16, అక్టోబర్ 2014, గురువారం

న్యస్తాక్షరి - 10

అంశం- భానుమతి.
(దుర్యోధనుని భార్య, సహదేవుని భార్య, సినీనటి వీరిలో ఎవరి గురించి వ్రాసినా సరే!) 
ఛందస్సు- ఆటవెలఁది. 
నాలుగు పాదాలలో చివరి అక్షరాలు వరుసగా భా, ను, మ, తి ఉండాలి.

30 కామెంట్‌లు:

  1. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    అభినవ శారద - అబినయ విశారద - భానుమతి :

    01)

    _____________________________

    అందమైన కంఠ - మామె కజితుని భా
    ర్యయె యొసగుట, బాడు - రమ్యముగను !
    అందమైన రూప - మామెకు వాణి మ
    గడు యొసగుట , తార - క వలె ద్యుతి !
    _____________________________

    రిప్లయితొలగించండి
  2. చిత్ర సీమ యందు చిరకీర్తి నిలిపె,భా
    నుమతి మహిళ లందు సుమతి తాను
    సరస గానమందు సరిగమల గరిమ
    నటన యందు జూపె నాట్య నిరతి
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  3. సుందరమగు రూపశోభలను, ప్రతిభా
    వంతురాలునయిన వనిత భాను
    పుత్రియె సహదేవుఁ బొందె పతిగ; రామ
    సుగుణరాశిగ నడచుకొను పడతి.

    రిప్లయితొలగించండి
  4. వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  5. తెలుగు చిత్ర సీమ తెలియగా నాడు భా
    నుమతి పేర నొక్క నువిదయె నటనను
    పాట పాడుటందు పలుకథ లనుపమ
    రీతి వ్రాయుటందు ఖ్యాతి గన్నపడతి.

    రిప్లయితొలగించండి
  6. చలనచిత్రసీమ కులుకుల రాణి భా
    నుమతి వెలుగునొందె, నునుపుగాను
    గానమాలపించి కంఠగరిమ
    చాటుకొన్నయామె మేటి సుదతి!

    రిప్లయితొలగించండి
  7. నటన, రచన, గాన, నాట్యములందు భా
    సిల్లె తెలుగు చిత్ర సీమ తాను
    పొగరు బోతు నటిగ పొంది పేరు, గరిమ
    నాంధ్రుల హృదయాల నందె సుదతి

    రిప్లయితొలగించండి
  8. మిత్రులందఱకు నమస్సులు.

    చలనచిత్రములనుఁ జక్కని నటన భా
    సురముగానుఁ జేసి సుస్థిరమును
    శాశ్వతమగు కీర్తి విశ్వాన భాను
    తియె కొనియెను! నే నుతింతును మతి!

    రిప్లయితొలగించండి
  9. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. కాని నాలుగు పాదాల్లోను 3 సూ.గ. 2 ఇంద్రగణాలుండి కొత్త ఛందస్సు సిద్ధమయింది. దీనిని ‘ఆటమగువ’ అందామా?
    ఆటవెలదిగా నా సవరణ....
    తెలుగు చిత్ర సీమ తెలియగా నాడు భా
    నుమతి పేర నొక్క నువిద తాను
    పాడి నటన జూపి పలుకథల్ వ్రాయు మ
    హానటి యను ఖ్యాతి నందె పడతి.
    *
    బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవ పాదంలో సరిపాదం గణాలు వేశారు. ‘గాన మాలపించి కలకంఠ గరిమను’ అనండి.
    *
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మూడవ పాదంలో "కంఠధ్వని గరిమ" గా పఠించ మనవి

    రిప్లయితొలగించండి
  11. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ సవరణే సరియైనది. నేను చివరి అక్షరాన్ని గమనించకుండా సవరణను సూచించాను. మన్నించండి.

    రిప్లయితొలగించండి
  12. నర్తనమ్ముఁ దెల్సి నటనమ్ము నెరిగి భా
    షణమున విరుపు గల చాతురి తను
    బహు ముఖముల వెలుగ భానుమతి పటిమ
    యుర్విఁ దెలుగు వారి కో బహుమతి!

    రిప్లయితొలగించండి
  13. చలన చిత్ర రంగ సౌరందు కొనెను, భా
    నుమతి. 'స్వర్గ సీమ' నుతిని గనెను
    భరణి సంస్థ నిలిపి భవ్యయయ్యె మహిమ
    పాట పాడు తానె భారతి గతి

    రాజ రాజు భార్య రమణీయమైన భా
    నుమతి, పతికి తగిన నోర్మి తోను
    చతుర మైన యాట చదరంగ చతురిమ
    నామె మేఖలూడ నరయదింతి

    చలన చిత్ర జగతి చంద్రునితో నిభా
    యాట పాటలందు మేటి యగును
    తనదు పాటలన్ని తానె పాడు, జనమ
    దెంత గానొ పొగడా ధీర యువతి

    భార్యగాను తాను పావకుతో నిభా
    రాజ రాజు పత్ని రమణమౌను
    చతుర కర్ణుడాడ చదరంగపు గరిమ
    తన్ను తానె మరచె ధర్మ యువతి

    రిప్లయితొలగించండి
  14. చలనచిత్ర సీమ జాణయైవెలిగి భా
    స్వంతకీర్తిమంతవైభవమును
    గనుచు శొభలిడుచు కనుపట్టు భానుమ
    తిని నుతింతు నామె దివ్య సుగతి.

    రిప్లయితొలగించండి
  15. పూజ్య గురుదేవులు కంది శంకరయ్య గారికి నమస్సులు.
    గోలి హనుమచ్ఛాస్త్రి గా రి పూరణలో
    భా/
    నుమతి పేర నొక్క నువిద తాను
    రెండవ పాదం లో ఉవిద ఐతే "ను" కు "ఉ" కు యతి చెల్లుతుందా? దయచేసి తెలియ జేయండి

    రిప్లయితొలగించండి
  16. శ్రీ సత్యనారాయణరెడ్డి గారికి,

    ఇది "అఖండయతి" అంటారు. లాక్షణికులు దీనిని ఒప్పుకోరు కానీ, ఆంధ్రమహా భారతములో కూడా మనకు అక్కడక్కడా ఈ రకమైన యతి మైత్రి ఉపయోగింపబడినది.

    మన " శంకరాభరణము" లోనే దీని వివరణములను మన గురువుగారు అంధించారు.

    http://kandishankaraiah.blogspot.in/search?q=%E0%B0%85%E0%B0%96%E0%B0%82%E0%B0%A1%E0%B0%AF%E0%B0%A4%E0%B0%BF

    రిప్లయితొలగించండి
  17. నా సందేహాన్ని తీర్చి నందులకు సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  18. చిత్రసీమ కంఠ చిత్రంపు మణిగ భా
    సిల్లి యాయె నామె యెల్లరకును
    బాలశిక్ష వోలె పసజూపె, యాలేమ
    తనకు తానె సాటి దాత్రి సుదతి

    రిప్లయితొలగించండి
  19. మాస్టరుగారూ ! ఏదో తేడా ఉన్నదని మనసు చెప్తూనే ఉన్నదండీ...అయినా కార్యాలయమునకు వెళ్ళు తొందరలో అలా పూరించాను. నా " ఆట మగువ " పూరణను ఆటవెలది లోనికి మార్చినమీకు కడుంగడు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  20. సుకవిమిత్రులు అన్నపరెడ్డి సత్యనారాయణరెడ్డి మఱియు సంపత్ కుమార్ శాస్త్రిగారలకు,

    మిత్రులు గోలి హనుమచ్ఛాస్త్రి గారి పూరణలో...
    "...భా/
    నుమతి పేర నొక్క నువిద తాను" అను పాదమందు
    ఒక్క + ఉవిద = ఒక్క యువిద కావలయును. "ఒక్క" అను పదము ద్రుతాంతము కాదు...కావున యడాగమము వచ్చును.
    "ఒక్క" యను పదమును "ఉవిద" యను పదమును సంధిచేయరాదు. "సంధిలేనిచోట స్వరంబుకన్నఁ బరంబయిన స్వరంబునకు యడాగమంబగు"నని కదా చిన్నయసూరిసూత్రము. కావున...ఈ పాదము...
    "నుమతి పేర నొక్క యువిద తాను"గాఁ గావలసియుండును.
    ను-యు లకు యతిమైత్రి చెల్లదు కావున దీనిని సవరింపవలసియున్నది.
    మిత్రులు గోలి హనుమచ్ఛాస్త్రిగారు తగు సవరణమునుం జేయఁగలరు.
    స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘ఒక బహుమతి’ అనండి. ‘ఒక’ అనే అర్థంలో ‘ఓ’ అనడం వ్యావహారికం.
    ప్రశ్నార్థకంలో, సందిగ్ధార్థంలో ‘ఓ’ వాడవచ్చు. కన్నడవారికో, తెలుగువారికో అన్నట్టు...
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ నాలుగు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    ‘నిభా’ అని రెండు పద్యాల్లో వాడారు. కాని అది తెలుగు సంప్రదాయం కాదు. కొన్ని టైపాట్లున్నాయి. ‘తగిన + ఓర్మి’ తగిన యోర్మి అవుతుంది. అప్పుడు యతి తప్పుతుంది.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    అన్నపరెడ్డి వారూ,
    సంపత్ కుమార్ శాస్త్రి, గుండు మధుసూదన్ గారల వ్యాఖ్యలను గమనించండి.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    గుండు మధుసూదన్ గారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  22. గుండు మధుసూదన్ గారి వివరణకు ధన్య వాదాలు.

    రిప్లయితొలగించండి
  23. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
    నర్తనమ్ముఁ దెల్సి నటనమ్ము నెరిగి భా
    షణమున విరుపు గల చాతురి తను
    బహు ముఖముల వెలుగ భానుమతి పటిమ
    యుర్విఁ దెలుగు వారి కొక బహుమతి

    రిప్లయితొలగించండి
  24. మాట కఠిన మామె మనసు వెన్న యని భా
    నుమతి గారి గురిచి నుడువ దగును
    చక్క నైన రూపు జాణతనపు భామ
    కమ్మనైన గొంతు గల్గె సుదతి

    రిప్లయితొలగించండి
  25. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  26. భారతీయ చిత్ర తారలలోన భా
    నుమతి నటన కీర్తి నొoదగాను
    మధుర గాయనమ్ము మరి కల్పనాపటిమ
    తిన్నతనము తెచ్చె తెలుగుజాతి

    కేంబాయి వేంకట తిమ్మాజీ రావు

    రిప్లయితొలగించండి
  27. కెంబాయి వేంకట తిమ్మాజీ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  28. శ్రీగురుభ్యోనమ:

    నటన కళను నమ్మి నాయిక యగుచు భా
    సిల్లె భానుమతియె స్థిరముగాను
    పరవశించి తాను పాడంగ సరిగమ
    ముదము నొంది మిగుల మురియు జగతి

    రిప్లయితొలగించండి
  29. శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. మధుసూదన్ గారికి ధన్యవాదములు...దోషమును సవరించి పూరించినాను.


    తెలుగు చిత్ర సీమ తెలియగా నాడు భా
    నుమతి పేర నొక్క సుమతి తాను
    పాడి నటన జూపి పలుకథల్ వ్రాయు మ
    హానటి యను ఖ్యాతి నందె పడతి.

    రిప్లయితొలగించండి