29, అక్టోబర్ 2014, బుధవారం

సమస్యా పూరణం – 1540 (పేరు లేనట్టివానికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
పేరు లేనట్టివానికి వేయిపేర్లు.

32 కామెంట్‌లు:

 1. పేరు లేనట్టి యనాధనూరిలోన
  పిలుచు జనులేదియో యొక పేరుబెట్టి
  యేమనుచు బిల్చినా బదులిచ్చు తాను
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు

  రిప్లయితొలగించండి
 2. ఊరు మఱి యును ధనమును జూ రగొనక
  యార్త రక్షణ ధ్యేయమై యా ర్తుల కిట
  యేమ ని బిలిచి నబదులు నిచ్చు నుమఱి
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు

  రిప్లయితొలగించండి
 3. తల్లి దంద్రులు లేరట తనకు మొదలె
  పేరు పెట్టగ వానికి పెద్ద లేడు
  తెలిసి కార్తీక మాసాన కొలుచు జనులు
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు!!

  రిప్లయితొలగించండి
 4. చక్కగా వండి నామెకు నొక్క కూర
  యడుగు కున్నట్టి తల్లికి నరువదారు
  కుప్ప తొట్టెలో పెరిగిన కున్నడెట్టి
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు

  రిప్లయితొలగించండి
 5. బాహ్య మందున లోన సర్వాంతరముల
  వెలయు తత్త్వమదియె దాని పేరదేమి?
  విష్ణు సాహస్రములజెసి వినుతిజేయ
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు!!

  రిప్లయితొలగించండి
 6. బంధుమిత్రులు వెయిమంది వచ్చినారు
  బారసాలకు, తలిదండ్రి పేరు నొకటి
  చెప్పుమనగానె తలకొకటి చెప్పినారు
  పేరులేనట్టి "వానికి" వేయిపేర్లు.

  రిప్లయితొలగించండి
 7. పుట్టనే లే దనంగ పే రెట్టు లుండు
  నామగుణరూపరహుతుడై నడచు నతడు
  ప్రస్తుతించెడి భక్తులవలన కలుగు
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు

  కొలుచు వారల మనముల కొలువుదీరి
  నిలచి యుండు మహాత్ముని వలపుమీర
  తలప నాతని గుణరూప తతని గలుగు
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు

  రిప్లయితొలగించండి
 8. బారసాలయి పేరిడ పరగు నొకటె
  పేర. బారసాలది కాని వేళ, వివిధ
  పేర్ల పిలుతురు బంధుల విడిగనతని
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు

  రాముడంచును, కృష్ణుగ, రాజితంపు
  నీశు డనుచును, శంభుగ, నేసు నొకట
  పిలువ నల్లాగ వేర్వేరు పేర్ల నొకడె
  పేరు లేనట్టి వారికి వేయి పేర్లు

  తల్లి కాతడు కొడుకునౌ ధరణి కనగ,
  చెల్లి కాతడు నన్నయౌ, చెల్లు భర్త
  గాగ పత్నికి, వరుసల ఘనుడునతడె
  పేరు లేనట్టి వానికి వెయి పేర్లు

  రిప్లయితొలగించండి
 9. మల్లెలవారిపూరణలు
  1.ఎవని చేతను పుట్టును యెల్ల జగతి
  ఎవని యందున లయమౌను ఎవడు రక్ష
  సర్వ జగతి యందాతడు సంచరించు
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు
  2.విష్ణు వన్నను శివుదన్న వేరు గాదు
  కనగ నాతడు భావానకానుపించు
  వేరు పేరులు దైవమ్ము వేరు గాదు
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు
  3.మతములేవైన పరమైన మాన్య విభుడు
  యొకడె వ్యక్తుల దృష్టుల నొప్పు వేరు
  రూపు తలచిన పాపాలు రూపు మాపు
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు
  4.వేంకటేశుండు అయ్యప్ప విశ్వ సాయి
  యేసు క్రీస్య్హని నల్లాగ ని౦పు పేర్ల
  వేరువేరుగా పిలిచినా విభుడు యొకటె
  పేరు లేనట్టివానికి వేయిపేర్లు


  రిప్లయితొలగించండి
 10. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కొన్ని సవరణలు... ‘లేనట్టి యనాధ’ అన్నప్పుడు గణదోషం. ‘పిల్చినా’ అని వ్యావహారికాన్ని ప్రయోగించారు. నా సవరణతో మీ పద్యం....
  ‘పేరు లేని యనాధ తా నూరిలోన
  పిలువ జనులేదియో యొక పేరు పెట్టి
  యేమనుచు బిల్చినను బదులిచ్చుచుండు....
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మత్తకూరు రాజణ్ణ చంద్రమౌళి గారూ,
  బహుకాలానికి మీ పూరణ! సంతోషం!
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తలకొకటి’ అన్నచోట గణదోషం. ‘చెప్పుమనగా తలకొకటి...’ అంటే సరి!
  *
  తాడిగడప శ్యామల రావు గారూ,
  చాలాకాలానికి మీ పూరణలు చూసే అదృష్టం లభించింది. సంతోషం!
  మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీరు నేరుగా పంపినవి, కెంబాయి వారి ద్వారా పంపినవి మొత్తం ఏడు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  1 పూరణ... ‘బారసాల + అయి’ అన్నప్పుడు సంధి లేదు. ‘బారసాలలో’ అనండి.
  2 పూరణ... ‘కృష్ణుగ’ అన్నచోట అన్వయలోపం... ‘రాము డని కృష్ణు డంచును’ అనండి.
  కెంబాయి వారు పంపినవి...
  1 పూరణ... ‘పుట్టును + ఎల్ల’ అన్నప్పుడు సంధి నిత్యం. యడాగమం రాదు. ‘పుట్టునీ యెల్ల’ అనండి. ‘లయమౌను ఎవడు’ అని విసంధిగా వ్రాయరాదు. ‘లయమగు నెవడు’ అనండి.
  3 పూరణ... ‘విభుడు + ఒకడె = విభు డొకండె’ అవుతుంది. అక్కడ ‘దైవ/ మొకడె’ అనండి.
  4 పూరణ... ‘క్రీస్తని యల్లాగ’ అనండి.

  రిప్లయితొలగించండి
 11. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు
  పుట్టు వారికే యుండును గిట్టుటయును
  యట్టి వానికే యవసరమ్మగును పేరు
  గిట్టుటయు పుట్టుకెరుగంగనట్టి యజుడు
  పేరులేనట్టి వానికి వేయి పేర్లు
  2.ఇల్లు లేని భిక్షుకు నన్ని ఇళ్ళు తనవె
  వేయి రుచులతో దొరకును విందు తినగ
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
  పెట్టి వ్యాపారమును జేయ గుట్టుగాను

  రిప్లయితొలగించండి
 12. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘గిట్టుటయును + అట్టి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘గిట్టుత మఱి/ యట్టి...’ అనండి.

  రిప్లయితొలగించండి
 13. కె.ఈశ్వరప్పగారి పూరణలు
  మనసు నందుండి లోకాల మలచు వాడు
  ప్రకృతి యందుండి సృష్టిని పంచు వాడు
  వెలుగు జీకటుల్ జగతిని నిలుపువాడు
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
  2.బారసాలను మామను పోరినారు
  యింటి దైవముపేరు నీవెంచు పేరు
  చిన్నవానికి చెవిలోన చిన్నగాను
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు

  రిప్లయితొలగించండి
 14. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘పోరినారు + ఇంటి’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పోరినార/ లింటి...’ అనండి. ‘దైవము పేరు నీ వెంచు పేరు’ అని రెండుసార్లు పేరు అన్నారు. ‘దైవము పేరు నీ వెంచు మనుచు’ అనండి.
  *
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  మీ పూరణలోని టైపాట్లవల్ల పద్యభావం అవగాహన కాకున్నది. సవరించి ప్రకటించండి.

  రిప్లయితొలగించండి
 15. జడలు గట్టిన సిగతోన జంగ మయ్య!
  మోము వీబూదితో నిండ మూడు కళ్లు!
  నీలకంఠాన రుద్రాక్ష! నిడుదవెన్ను!
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు!

  రిప్లయితొలగించండి

 16. కె యెస్.గురుమూర్తి ఆచారి గారి పూరణ
  పేరు కొని చాలమేలని కోరుకొ౦ద్రు
  పేరు పొందిన వారినే,పెట్టుచుంద్రు
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
  పేరుకొని కుళ్ళు బుద్ధి యీ పృథివి యందు

  రిప్లయితొలగించండి
 17. రూప రహితునకును సర్వ రక్షకునకు
  పేరులెనట్టి వానికి వేయి పేర్లు
  పెట్టి పిలుచుచునుందురు ప్రేమతోడ
  నమ్మి పిలిచెడి ప్రజలకు వమ్ము కలదె.

  రిప్లయితొలగించండి
 18. అవునండీ ! ఒక అక్షరం ఎక్కువైంది.
  మాస్టరుగారూ ! సవరణకు ధన్యవాదములు.
  మీరు చూపిన సవరణతో..

  బంధుమిత్రులు వెయిమంది వచ్చినారు
  బారసాలకు, తలిదండ్రి పేరు నొకటి
  చెప్పుమనగా తలకొకటి చెప్పినారు
  పేరులేనట్టి "వానికి" వేయిపేర్లు.

  రిప్లయితొలగించండి
 19. సమస్యను ఛందోవైవిధ్యంతో పూరించే విధానాన్ని వివరిస్తూ తాడిగడప శ్యామలరావు గారు ఎంతో ఉపయుక్తమైన వ్యాసాన్ని ఔత్సాహికకవులకోసం అందించారు. దానిని రేపు ఉదయం బ్లాగులో చూడండి. (ఇప్పుడే ఇచ్చేవాణ్ణి.. కాని కొన్ని గంటల్లో తేదీ మారి పోతుంది కదా.. ఉదయం ప్రకటిస్తే అందరూ చదవే అవకాశం ఉంటుంది).
  తేటగీతి సమస్యకు ఆటవెలదిలో నా పూరణ....
  రూపులేక సర్వరూపముల్ దానెయై
  గుణములేక సర్వగుణయుతుడయి
  తాను వెలుఁగు, పేరు లేనట్టి వానికి
  వేయి పేర్లటందు విష్ణువునకు.

  రిప్లయితొలగించండి
 20. గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విబూది’ ఉంది కాని ‘వీబూది’ లేదు. అందువల్ల ‘మోమున విబూది...’ అనండి.
  *
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  టైపాట్లు సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  మొదటి పాదంలో ‘రూ-ర’ యతి తప్పింది. ‘సర్వరూపునకును’ అందామా?

  రిప్లయితొలగించండి
 21. పేరు యన్నది కాసులపేరు గాగ
  పేరు కానిది "పెరుమాళ్ళు" పేరు యగుచు
  పేరు పేరుకు యొక్కొక్క పేరు నొసగ
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 22. కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘పేరు + అన్నది, పేరు + అగుచు, పేరుకు + ఒక్కొక్క’ అన్నప్పుడు యడాగమం రాదు. అక్కడ ‘పే రనగ నొక కాసుల పేరు...’, ‘పెరుమాళ్ళు పేరు కాగ’, పేరున కొక్కొక్క పేరు...’ అనండి.

  రిప్లయితొలగించండి
 23. పేరు అన్నది కాసుల పేరు గాగ
  పేరు కానిది "పెరుమాళ్ళ"పేరు కాగ
  పేరు పేరున కొక్కొక్క పేరు నొసగ
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు
  గురువు గారికి పాదాభి వందనాలు పద్యం సరిచేసాను చూడ గలరు

  రిప్లయితొలగించండి
 24. కొరుప్రోలు వారూ,
  ‘పేరు + అన్నది’.... సవరించలేదు...

  రిప్లయితొలగించండి
 25. గురుదేవులకు ధన్యవాదాలు. సవరించిన పద్యం :
  జడలు గట్టిన సిగతోన జంగ మయ్య!
  మోమున విబూది రేఖలు మూడు కళ్లు!
  నీలకంఠాన రుద్రాక్ష! నిడుదవెన్ను!
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు.

  రిప్లయితొలగించండి
 26. పేరనగనొక కాసుల పేరు గాగ
  పేరు కానిది "పెరుమాళ్ళ"పేరు కాగ
  పేరు పేరున కొక్కొక్క పేరు నొసగ
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు

  రిప్లయితొలగించండి
 27. విష్ణువన్న నేమొకొ! వాని విశ్వమనగ
  నేమి? యెల్ల నెలవులందు నెచ్చటైన
  నుండు వానికెన్నియొ పేరులొప్పుకొనుడు
  పేరు లేనట్టి వానికి వేయి పేర్లు.

  రిప్లయితొలగించండి
 28. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 29. పేరు లేనట్టివానికి వేయి పేర్లు
  పెట్టి మొక్కుచుంద్రు మిగుల ప్రేమ తోడ
  వివిధ మతములు పాటించు విభుదు లెల్ల
  నామమేదైన యా జగన్నాథు డొకడె.

  రిప్లయితొలగించండి
 30. కుసుమ సుదర్శన్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి