20, అక్టోబర్ 2014, సోమవారం

నిషిద్ధాక్షరి - 15

కవిమిత్రులారా,
"ల. ళ" లు లేకుండ
ఊర్మిళాదేవి నిద్రను గురించి
మీకు నచ్చిన ఛందంలో పద్యం వ్రాయండి.

32 కామెంట్‌లు:

  1. కవిమిత్రులందఱకు నమశ్శతములతో...

    జనక భూవిభు నౌరస తనయ తనదు
    భర్త సౌమిత్రి యన్నవెంబడి వనమ్ము
    నకును నరిగి తిరిగివచ్చు నంతదాఁక
    పట్టువిడువక నిద్రించినట్టి సాధ్వి!

    రిప్లయితొలగించండి
  2. పెనిమిటి సౌమిత్రి వనికి
    చనియె! చతుర్దశ వసంత సంతాపంబున్
    మనమున భరింప నేరక
    కునుకును దీసెను! పతి కునుకును తానొందెన్!!

    రిప్లయితొలగించండి
  3. సౌమిత్రిని యెడబాసిన
    భామిని యా జనకపుత్రి బాధ మరువ తా
    నామంత్రించెను నిద్రను
    దీమతి యై భర్త వచ్చు దివసము దనుకన్

    రిప్లయితొలగించండి
  4. రాము వెంటను సౌమిత్రి ప్రేమ తోడ
    నడవి కేగగ నాతని విడువ బడుట
    కామె దుఃఖ ప డుచు, వచ్చు నంత వరకు
    నిద్ర వోయెను మనసును నిమురు కొనుచు

    రిప్లయితొలగించండి
  5. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరింప నున్నవి !

    ఊర్మిళాదేవి నిద్ర :

    01)
    ______________________________

    జనక రాజ పుత్రి - జానకి తోబుట్టు
    పంక్తిరథుని స్నుష యు - పరమ సాధ్వి
    రాము తోడ బతియు - రాజ్యంబు వీడగా
    తిరిగి వచ్చు వరకు - మరిగె నిదుర !
    ______________________________
    మరుగు = శరణుచొచ్చు, ఆశ్రయించు

    రిప్లయితొలగించండి
  6. రాముని సేవకుఁ జనియెడు
    సౌమిత్రి సతికి నొసంగె చక్కని వరమున్
    భామిని విరహమ్ము మరువ
    స్వామికి తనదైన సేవ సాంతము జేయన్!

    రిప్లయితొలగించండి
  7. అంతము జేయ దైత్య తతి నగ్రజుడాటవి యందు నుండి నే
    సంతస మొప్ప తోడు పరి చర్యను జేయుచు కంటి రెప్పనై
    యింతి! సుఖమ్ముగా తిరిగి యిట్టె నయోధ్యకు రామె చూడుమా!
    వంతను బొంద నీకగునె వారిజ నేత్రి! యెఱింగి యంతయున్ ?

    సంతస మొప్ప మీరరుగ చాయగ నగ్రజు వెంట నాథ! నే
    సుంతయు నోర్తునే యిటను చూచుచు నొంటిగ వీడి మిమ్ము? నే
    చింతను బొంద కుండు గతి శీఘ్రమె నిద్ర వరమ్ము నిండు మీ
    రింత, త్వదీయ భామినికి నేమియు గోర సుమిత్ర నందనా!

    వనవాసము ముగియించుక
    తనకై సౌమిత్రి వచ్చు తరుణము దాకన్
    కను దెరువనిదై యా సతి
    తనరెను శయనించి జన్మ ధన్యము గాగన్.

    రిప్లయితొలగించండి
  8. ఆదికవియె వ్రాయని కథ
    నేదో విధముగ ప్రచారమెక్కుడు వొందెన్.
    ఖేదమున నున్న వనితకు
    మోదమగునె నిదురయైన? పుక్కిటి కథయౌ.

    రిప్లయితొలగించండి
  9. గుండు మధుసూదన్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    జిగురు సత్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    పద్యం చివర ‘తాఁ బొందెన్’ అంటే బాగుంటుందేమో?
    *
    చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    శ్రీదాస్యం లక్ష్మయ్య గారూ,
    ధన్యవాదాలు.
    మీరు కూడా పద్యాలు వ్రాస్తే సంతోషం!
    *
    మిస్సన్న గారూ,
    మీ మూడు పద్యాల పూరణ చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మీదేవి గారూ,
    ఊర్మిళాదేవి నిద్ర అవాల్మీకం అంటూ మీరు చేసిన పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. నిద్రను విడిచి తనభర్త నియతి తోడ
    నన్న, వదినను కాపాడు ననుట నెఱిగి
    నిదుర దేవిని ప్రార్థించె నిండు మదిన
    భర్త నిదురను తనకివ్వ వరముఁగోరి
    యట్టి వరమును తాఁబొంది యంబుజాక్షి
    శయన మొందె సౌమిత్రికి సాయముగను
    పరమ సాధ్విగ జగతిన పరగె నతివ

    రిప్లయితొలగించండి
  12. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘కాపాడుననుట యెఱిగి, నిండు మదిని’ అనండి.

    రిప్లయితొలగించండి
  13. పూజ్య గురుదేవులు కంది శంకరయ్యగారికి నమస్సులు. తమరి సవరణలకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. ఖేదంబబించుకనోపబోవనిక నీక్షింతున్ సదా, మీరు స
    మ్మోదమందున నిద్రవోయెడివరమ్మున్ నాకొన్సంగంగ నే
    డీదాసీప్రియ వేడుకొన్నదికనిద్రే నాతపంబౌట మా
    మీదన్ మీకరుణామృతంబునిడు సౌమిత్రాఖ్య రామానుజా!

    రిప్లయితొలగించండి
  15. వనమున కేగెడి సమయము
    తను సౌమిత్రిసతి నిదుర,ధన్యత నందెన్,
    వెనుదిరిగి వచ్చు వరకును
    మనసును శుద్ధము నునచగ మానితకీర్తిన్

    రామునితోడను సీతయె
    భీమపు నాటవికి నేగె విఖ్యాతగు నా
    రాముని సోదరు భార్యయె
    తా మునిగె నిదుర పదపడి ధర్మపు పత్నై!

    రాముని తోడను తమ్ముడు
    నేమము తోడను నడవికి నింపుగ నేగెన్
    భామగు నాతని భార్యయె
    గోముగ నిదురను మునిగెను గొప్పగ పతికై!

    వనితకు, పతియెటు చేసిన,
    తను నటు చేయంగకోర్కె,ధర్మంబు గదా!
    వని తా సౌమిత్రి సతియు
    పనిగొనె నిద్దుర,మనమున పతియే నిండన్

    నిదురను మనమది చెదరదు
    కుదురుగ నుండంగ పతియె,కోరిక మీరన్
    సదయుడు రాముని వెనుకన్
    పదపడి నడువగ నిదురను భాగ్యము నందెన్.

    రిప్లయితొలగించండి
  16. సంపత్ కుమార్ శాస్త్రి గారి పూరణ లో భావం బాగుంది కాని 1,2, పాదాల్లో కొంచెం టైపాట్లు దొర్లినట్లున్నాయి

    రిప్లయితొలగించండి
  17. తన కునుకును పతి కునుకును
    మననమ్మున బేధమీడి మరి నిద్రించన్
    తన పతినే కను గాంచుచు
    మనమున సేవించె నాడు.మానిని తానున్

    రిప్లయితొలగించండి
  18. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మల్లెల వారు చెప్పినట్లు మీ పద్యంలో టైపాట్లున్నాయి.
    *
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    ధన్యవాదాలు.
    *
    శ్రీదాస్యం లక్ష్మయ్య గారూ,
    శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది. చాలా సంతోషం!
    మీ పూరణ బాగున్నది. అభినంనలు.
    ‘భేదమీడి’ అన్నదాన్ని ‘భేదము విడి’ అనండి. ‘తన పతినే వీక్షించుచు’ అనండి.

    రిప్లయితొలగించండి
  19. గురువుగారికి మరియు శ్రీ మల్లెలవారికి,

    పొరబాటును తెలియజేసినందులకు ధన్యవాదములు. పని తొందరలో ఉండి గమనించనేలేదు. మన్నించాలి.

    ఖేదంబించుకనోపబోవనిక నీక్షింతున్ సదా, మీరు స
    మ్మోదమందున నిద్రవోయెడివరమ్మున్ నాకొసంగంచు నే
    డీదాసీప్రియ వేడుకొన్నదికనిద్రే నాతపంబౌట మా
    మీదన్ మీకరుణామృతంబునిడు సౌమిత్రాఖ్య రామానుజా!

    రిప్లయితొలగించండి
  20. రామునితో వని కేగిన
    సౌమిత్రుడు తిరిగి వచ్చు సమయము వరకున్
    ప్రేమముతో నిదురించుచు
    సేమముగా నతని పత్ని జీవించెనుగా!

    రిప్లయితొలగించండి
  21. తన కునుకును పతి కునుకును
    మననమ్మున బేధము విడి మరి నిద్రించన్
    తన పతినే వీక్షించుచు
    మనమున సేవించె నాడు.మానిని తానున్

    రిప్లయితొలగించండి
  22. కంది శంకరయ్య గారికి
    మీ సూచనలు బాగున్నాయి.
    ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  23. పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
    రాముని వనవాసమున
    న్నేమరకన్ సేవజేయ నిదురను పోరా
    దే మాత్ర మ్మని సౌమి
    త్రీ మార్పుగ నిద్ర తన సతీమణి కిచ్చెన్
    అంతట సౌమిత్రీ సతి
    వింతగ నిదురింప తనకు విరహము తప్పెన్
    సంతస మందెన్ పతియును
    సంతాపము మాయమయ్యె సతికిన్నిదురన్

    రిప్లయితొలగించండి
  24. శ్రీగురుభ్యోనమ:

    జనకజాత్మయు రాముడు వనము నందు
    కష్టపడకుండ దినమంత కాయు ననగ
    తాను గైకొనె సౌమిత్రి తాపముడుగ
    నిద్ర పోయెను నాథుని నిద్ర పొంది

    రిప్లయితొలగించండి
  25. నిదుర బోయె మగువ నేరక జగమంత ,
    వరము నొసగ భర్త పరమ నిదుర
    "మాన వతిని జేర మాన్యత గాదంచు"
    జనక పుత్రి గొణిగె జడత తోడ (వీడ)
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  26. సంపత్ కుమార్ శాస్త్రి గారూ.. మీరు రెండవ పాదం ప్రారంభంలో "మ్మోదంబందున" అనే సవరణ కూడా చేర్చాల్సింది.

    రిప్లయితొలగించండి
  27. రామచంద్రుని తోడుగా రమణుడేగ
    తాను నిద్రకు నేగెగా మానవతియె
    నదియె వరముగ భావించి సదమలతను
    విరహ బాధను దిగమింగి వేచెగాదె!

    రిప్లయితొలగించండి
  28. శ్రీసోమనాథ శాస్త్రిగారికి,

    శతథా కృతజ్ఞతలు.

    ఈ రోజెందుకో టైపాట్లు దొర్లుతూనే ఉన్నాయి.

    పెద్దలు క్షమించాలని మనవి.

    రిప్లయితొలగించండి
  29. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    రెండింటిలోను "సౌమిత్రి"ని దీర్ఘాంతం చేశారు. మొదటి పూరణలో సవరణకు అవకాశం లేదు. రెండ్వ పూరణలో "సౌమిత్రి సతియె" అనండి.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *
    రెండుచింతల రామకృష్ణ మూర్తి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  30. కవిమిత్రులకు మనవి...
    ఈమధ్య కొందరి పద్యాలలో టైపు దోషాలు ఉంటున్నాయి. బహుశా వారు లేఖినిలో పైన బాక్సులో ఇంగ్లీషులో టైపు చేసి క్రింది బాక్సులోని తెలుగును పరిశీలించకుండా కాపీ - పేస్ట్ చేస్తుండవచ్చు. దయచేసి మీరు కాపీ చేసే ముందు ఒకసారి పరిశీలించవలసిందిగా మనవి.

    రిప్లయితొలగించండి