ఛందోవైవిధ్యంతో సమస్యాపూరణం ఎలా?
సాధారణంగా సమస్య ఇచ్చినపుడు అది ఏ ఛందస్సులో
ఉందో వెల్లడిగానే ఉంటుంది. ఉదాహరణకు శంకరాభరణం బ్లాగులో ఒక సమస్య
తల్లికి ముక్కు కోసి పినతల్లికి ముక్కెర పెట్ట
మేలగున్
అని ఉన్నది. ఈ సమస్య ఉత్పలమాలలో ఒక పాదంగా
వస్తుంది. సంప్రదాయికంగా సమస్యాపాదాన్ని చివరిపాదంగా ఉంచి పూర్తిచేస్తారు. కాని అది అనుల్లంఘ్యనీయమైన నియమం యేమీ కాదు. పద్యంలోని
సందర్భాన్ని బట్టి
సమస్యాపాదాన్ని ఏ పాదంగానైనా వాడుకో వచ్చును.
ఇచ్చిన సమస్య ఒక పూర్తిపాదంగా లేని సందర్బాల్లో
తరచుగా పూరణం చేసే వారు ఫలాని
ఛందస్సులోనే పూర్తిచేయాలని ఆశించలేము. కవి
ప్రతిభను బట్టి, సమస్య ఇచ్చిన
అవకాశాలను బట్టి కవిగారు తనకు నచ్చిన ఛందస్సులో ఇచ్చిన సమస్యను ఇరికించి పద్యం చెప్పవచ్చును. కవి అలా స్వేఛ్చగా ఛందస్సును ఎన్నుకొనటాన్ని నిరోధిస్తూ కొన్ని కొన్ని సందర్భాల్లో సమస్యను ఇచ్చిన వారే ఫలాని ఛందస్సులో పూర్తిచేయండి అని అడుగుతూ ఉంటారు.
ఏ ఛందస్సులో పూర్తిచేయాలో స్పష్టంగా ఉన్నప్పుడు
మనం ఎలాగూ ఆ విషయంలో
ఆలోచించటానికి ఏమీ లేదు. కాని మనకి
ఛందస్సును ఎన్నుకునే స్వేఛ్ఛ ఉన్నప్పుడు తగిన ఛందస్సును ఎలా నిర్ణయించుకోవటం?
ఈ విషయంలో నా అలోచనలను మీ ముందు
ఉంచాలనుకుంటున్నాను.
ఒక ముఖ్యమైన గమనిక ఏమిటంటే, దత్తపదులవంటి ప్రక్రియలకు ఎలాగూ ఇబ్బందులు లేవు. విడిగా ఇచ్చిన పదాలే కాబట్టి అవకాశాలు
మెఱుగ్గానే ఉంటాయి.
ఒక పద్యపాదమో లేదా పద్యపాదంలో కొంతభాగమో ఇచ్చినప్పుడు
ఎలా మనం ఛందస్సును ఎన్నుకోవచ్చునో అన్నది ఇక్కడ చర్చనీయాంశం.
శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన ఒక సమస్యను చూడండి.
శంకరాభరణం బ్లాగులో ఇచ్చిన ఒక సమస్యను చూడండి.
పేరు లేనట్టివానికి వేయిపేర్లు.
ఇచ్చిన సమస్య "పేరు లేనట్టివానికి వేయిపేర్లు" అన్నదానికి గురులఘుక్రమం చూస్తే U I U U I U I I U I U I అని వస్తున్నది.
మనం రకరకాలుగా దీన్ని గణ విభజన చేసుకోవచ్చును. U I - U U I - U I I -
U I - U I అని సూ-ఇం-ఇం-సూ-సూ
గణాలుగా చేసి మనం తేటగీతి పాదంగా వాడుకోవచ్చును. ఇది మనం సులభంగానే
గుర్తిస్తున్నాము.
ఆ సమస్యను ఇస్తూ శంకరయ్యగారు ఫలాని ఛందస్సులో పూరించండి అనలేదు. కాని అందరూ ఇది తేటగీతిపాదం అని
వెంటనే కనిపెట్ట గలరు కదా. అందుచేత అందరూ తేటగీతులే
వ్రాసి పంపించారు. ఈ విషయంలో ప్రస్తుత
వ్యాసకర్త చేసినది కూడా అదే.
ఇప్పుడు మనం ఈ సమస్యను తేటగీతి కాకుండా ఇతర
ఛందస్సులలో ఎలా ఇరికించ వచ్చునో చూదాం.
మొదట సీసపద్యంలో ఎలా ఇరికించవచ్చునో చూదాం. సీసపద్యంలో ప్రతిపాదానికి గణక్రమం ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అనేది. అంటే
వరుసగా ఆరు ఇంద్రగణాల తరువాత రెండు సూర్యగణాలు. ఇచ్చిన సమస్యని
వేరు రకంగా గణవిభజన చేసి చూదాం. U I U - U I U - I I U
I - U I అని చేస్తే? మనకు ఇప్పుడు ఇం-ఇం-ఇం-సూ అని వచ్చింది. సీసపద్యపాదం గణక్రమంలో ఇది ఒదుగుతుందని సులభంగానే గుర్తించవచ్చును.
ఇలా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ లో ఎలా ఒదిగేదీ
క్రీగీతతో సూచిస్తున్నాను చూడండి ఇలా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ
అని. కాని ఇలా చేసినప్పుడు మనకు ఈ సమస్యతో
యతివిషయంలో చిక్కు వస్తోంది. పేరులే-నట్టివా-నికివేయి-పేర్లు
అని విడదీసి సీసంలో ఇరికించితే మనకు 'న' తో 'పే' కు యతిమైత్రి
కుదరటం లేదు.
ఇంకొక విధంగా ప్రయత్నిద్దాము. మనకు ఇచ్చిన సమస్యకు చివరన సూర్యగణం వస్తున్నది
కదా? అదనంగా ఒక లఘువును చేరి భ-గణంగానో అదనంగా ఒక
గురువును చేర్చి ర-గణంగానో మార్చి దానిని
ఇంద్రగణంగా తీర్చిదిద్దామనుకోండి. అప్పుడు
మనకు ఇం-ఇం-ఇం-సూ+(ల. లేదా గు.) = ఇం-ఇం-ఇం-ఇం అని సిధ్ధిస్తున్నది. ఇది మనకు సదుపాయంగానే ఉంటుంది. చూడండి. సీసం
యొక్క పాదం ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అని
కదా మనం ఒకటి కంటే ఎక్కువరకాలుగా నాలుగు ఇంద్రగణాల వరుసను ఇరికించగలం. క్రీగీతలతో చూపుతున్నాను చూడండి. ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ లేదా ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ లేదా
ఇం-ఇం-ఇం-ఇం-ఇం-ఇం-సూ-సూ అని మూడు రకాలుగా వ్రాయవచ్చును. మనకు ఇచ్చిన
సమస్యను మార్చలేము కాబట్టి ఏరకంగా అమర్చితే
యతిమైత్రి కుదుర్చుతూ వ్రాయవచ్చునో చూసుకొని పూరించవచ్చును.
ఈ సమస్యను చూస్తే పేరులే-నట్టివా-నికివేయు-పేర్లు X అన్నప్పుడు పే-ని లకు యతికుదరదు కాబట్టి పాదాదినుండి సమస్యను
ఉంచలేం. పాదాది మొదటిగణం విడిచి ఇరికిస్తే మొదటిగణం 'న'కు యతిమైత్రి
కలిగి ఉండాలి - ఇది పెద్ద చిక్కు కాదు. పాదాది రెండు గణాలు విడిచి వ్రాస్తే పాదాది
గణం 'పే'తో యతిమైత్రి కలిగి ఉండాలి - ఇదీ చిక్కు కాదు. అందుచేత ఈ విధంగా సీసపాదంలో ఇచ్చిన
సమస్యను ఇరికించగలం! అంటే మనం ఒక సీసపాదాన్ని సమస్యతో ఇచ్చిన సమస్యతో ఈ క్రిందివిధాలుగా తయారు చేయవచ్చును.
నప్పెడు పేరులేనట్టి వానికి వేయి ।పేర్లు విశదముగ
వెలుగుచుండె
విశదంబుగా నొక్క పేరులే నట్టి వా ।నికి వేయి పేర్లుగా నిగిడె యశము
విశదంబుగా నొక్క పేరులే నట్టి వా ।నికి వేయి పేర్లుగా నిగిడె యశము
సీసంలోప్రాసయతులు చెల్లించవచ్చును కదా అన్న
సదుపాయం గమనిస్తే నిజానికి ఇలాంటి పూరణ మరికొంత సుగమం అవుతుంది.
ఇప్పుడు మనం ఈ సమస్యను మధ్యాక్కరలో ఏ విధంగా
ఇరికించ వచ్చునో చూదాం.
మధ్యాక్కరలో ప్రతిపాదానికి గణవిభజన ఇం-ఇం-సూ-ఇం-ఇం-సూ
అన్నవిధంగా ఉంటుంది.
యతిస్థానం నాలుగవగణం అని కొందరి మతం. నన్నయగారు
ఐదవగణం ప్రధమాక్షరం వాడారు యతిస్థానంగా. మహాప్రతిభావంతులు
కాబట్టి విశ్వనాథవారు ఉభయస్థానాల్లోనూ విధిగా
యతిమైత్రి పాటిస్తూ మరీ వ్రాసారు మధ్యాక్కరలను!
ప్రస్తుత సమస్య గురులఘుక్రమం U I U U I U I I U I U I అన్నదాన్ని U I U - U I U - I I U I - U I అని ఇం-ఇం-ఇం-సూ అన్నట్లుగా గణవిభజన చేయవచ్చును అని ఇప్పతికే గమనించాం. మధ్యాక్కరలో
మూడు ఇంద్రగణాలు వరసగా వచ్చేందుకు
అవకాశం లేనే లేదు. సరే, మరొక రకంగా U I - U U I - U I I -
U I - U I అని గణవిభజన
చేదాం. అదనంగా మరొక గురువునో లగువునో తగిలిద్దాం అప్పుడు U I - U U I - U I I -
U I - U I X అంటే సూ-ఇం-ఇం-సూ-ఇం
అనివస్తుంది విభజన, వీటులో మొదటి సూర్యగణాన్ని పైపాదానికి బదలాయించ వచ్చును సుబ్బరంగా. అంటే మనం ఇలా
వ్రాయవచ్చునన్న మాట.
ఇంద్ర ఇంద్ర సూర్య ఇంద్ర ఇంద్ర పేరు లేనట్టి వానికి
వేయి పేర్లుX ఇంద్ర సూర్య యతిస్థానం మనకు హాయిగా రెండు విధాలుగా ఉంది కాబట్టి వీలు చూసుకొని
ఇక్కడ ఐదవ గణాదిని యతిమైత్రి చేయవచ్చును. అది మన చేతిలో ఉన్నదే సమస్యకు ఆవలగా. కాబట్టి ఇబ్బంది లేదు.
ఉదాహరణకు తేటగీతి కాక రెండు ఛందస్సులలో ఈసమస్యను
ఎలా ఇరికించి పూర్తిచేయవచ్చునో సూచనప్రాయంగా వివరించాను. ఇచ్చిన సమస్య యొక్క గురులఘుక్రమాన్ని
బట్టి ఏ విధంగా తగిన ఛందస్సును ఎంపిక చేసుకోవాలో పూరణ చేసే వారు ఆలోచించుకోవాలి. ఇక ఇరికించటం అన్న ప్రక్రియ విషయంలో మనం అనుకున్న పధ్ధతులు ఉపయోగిస్తాయి.
తాడిగడప శ్యామలరావు
మాలాంటి ఔత్సాహికులకు ఉపయోగకరమైన విషయాలు చెప్పారు ధన్యవాదములు తాడిగడప శ్యామలరావుగారు
రిప్లయితొలగించండిపద్య ములమార్పు జక్కగ బలికి తీవు
రిప్లయితొలగించండినీదు ధీవి శే షమునకు నాదు మనము
సంత సించెను నెంతయో సంభ్ర మమున
వంద నంబులు శ్యామల రావ ! నీకు
ఉపయోగకరమైన విషయాన్ని సవివరంగా తెలియజేసిన శ్రీ శ్యామలరావు గారికి ధన్యవాదాలు.
రిప్లయితొలగించండిఛందోవైవిధ్యంతో సమస్యాపూరణం గురించి విపులంగా తెలియ జేసిన శ్యామలరావు గారికి ధన్యవాదలు.
రిప్లయితొలగించండి