4, అక్టోబర్ 2014, శనివారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 101


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.       నగముంచి దానిస్థానమున మరలి వచ్చె
నీదకం; దెలసె మండోదరి యల
జడి రావణు జననా(శకునిపోక కనిఁ ద
మకమును వీడి ద్వై)మాతురపితృ
భక్తుండు దీక్షసల్పగ హోమముఁ జెఱుపఁ
గపులు వచ్చిరి; గేలి కైకొలిచెద
భార్య నీడ్చుటను ను(పాయనమున, డాగు
వరసుయోధ)ఖలుని సురరిపువిభు
గీ.       ననుచు నాగతిఁ జేసి వేయంగదుడు ఘ
(నుడు బిరుదు యుధిష్ఠిరుఁడు బలుడు సుకృతియు
వీఁక (వెడలద్రోయఁ జనెఁ బెనకువకును)
దశముఖుఁడు నిప్పులొల్క నేత్రంబులందు. (౧౧౬)

భారతము-
ఆ. శకునిపోక కనిఁ దమకమున వీడి ద్వై
పాయనమున డాగు వరసుయోధ
నుఁడు బిరుదు యుధిష్ఠిరుఁడు బలుడు సుకృతి
వెడలఁ ద్రోయగఁ జనె బెనకువకును. (౧౧౬)

టీక- శకుని పోకకు = (భా) శకుని చావునకు; అని = యుద్ధమును; (రా) ద్వైమాతుర = వినాయకుని, పితృ = తండ్రి (శివుని); ఉపాయనమున = (రా) కానుకచేత; యుధిష్ఠిరుఁడు = (రా) యుద్ధమందు స్థిరమైనవాఁడు; ఈదకందు = వాయుపుత్రుడగు హనుమంతుఁడు; అలజడి = చింత; తమకమున = సంభ్రమున; పోక = (రా) నడవడి, (భా) చనిపోవుట; పెనకువ = యుద్ధము; కేళికై... యనుచు = పరిహాసమున కారీతి పలుకుచు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి