11, అక్టోబర్ 2014, శనివారం

సమస్యా పూరణం – 1531 (కౌంతేయుల మేనమామ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కౌంతేయుల మేనమామ కర్ణుండు గదా.
(ఈ సమస్యను సూచించిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు)

28 కామెంట్‌లు:

 1. అందరికీ వందనములు
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  శల్య సారథ్యం :

  01)
  __________________________________

  దొంతిగ కర్ణుని దూరగ
  కౌంతేయులమేనమామ , - కర్ణుండు గదా
  కుంతీసుతుడౌ విజయుని
  పంతంబున మడిసె నకట - పంచకమందున్ !
  __________________________________
  దొంతి = అధికము(విపరీతముగా)
  పంతము = శౌర్యము
  పంచకము = యుద్ధభూమి

  రిప్లయితొలగించండి
 2. శ్రీగురుభ్యోనమ:

  కుంతీ సోదరుడెన్నగ
  కౌంతేయుల మేనమామ, కర్ణుండు గదా
  కుంతికి సుతుడై పుట్టియు
  వింతగ నగచాట్లనొందె, విధి చిత్రముగా!

  రిప్లయితొలగించండి
 3. కాంతా ! శకునియు నగుగద
  కౌంతేయుల మేనమామ, కర్ణుండు గదా
  కౌంతే యగ్రజు నన్నయ
  కౌంతేయులు నైదుమంది గౌరవ వంతుల్

  రిప్లయితొలగించండి
 4. పొంతన కరువైన పలుకు,
  వింతౌ సారధ్యము నిడి విసిగించగనే
  యంతిమ బాధితు డెవ్వడు?
  కౌంతేయుల మేనమామ, కర్ణుండుగదా!

  రిప్లయితొలగించండి
 5. శాంతా! విను వసుదేవుడు
  కౌంతేయుల మేనమామ, కర్ణుండు గదా
  కుంతీ సుతుడుగ బుట్టిన
  పంతము తో సోదరులకు వైరిగ నిలిచెన్ !

  రిప్లయితొలగించండి
 6. వంతుకు రారాజు పిలువ
  కౌంతేయుల, మేనమామ, కర్ణుండు గదా
  మంతనములాడి పాండవు
  లంత పరాభవమునొంద రమయుచు మురిసిరి

  రిప్లయితొలగించండి
 7. శాంతస్వభావులగు నా
  కుంతీతనయులను కోరి క్రూరముగా న
  శ్రాంతము బాధించిరి యీ
  కౌంతేయుల మేనమామ, కర్ణుండు, గదా.

  రిప్లయితొలగించండి
 8. భ్రాంతిన వైరులఁ జేరెను
  కౌంతేయులమేనమామ, కర్ణుండు గదా!
  స్వాంతమును గోలుపోయెను
  శాంతనవుడు తనను దూఱి శాంతిని చఱచన్

  రిప్లయితొలగించండి
 9. కె యెస్ గురుమూర్తి అచారిగారి పూరణ
  అంతమొనర్చునుకర్ణుడె
  కౌంతేయుల;మేనమామ!కర్ణు౦డె గదా
  యంతటికిని మన బలమని
  నంత శకుని గాంచి కౌరవాగ్రజు డనియెన్

  రిప్లయితొలగించండి
 10. తిమ్మాజీగారి విరుపు చక్కగా అతికింది. పూరణ బాగుంది, వారికి అభినందనలు.

  రిప్లయితొలగించండి
 11. పూజ్యులు గురుదేవులు శంకరయ్యగారికి వందనములు సొంతము గాడట శల్యుడు
  కౌ౦తేయుల మేనమామ,కర్ణు౦దు గదా
  కుంతీసుతుడై నర్జుని
  నంతము సేయంగ దలచి యంతము నందెన్
  2.పొంతన వలదనె కురుపతి
  పంతముతో, పాండవులు పవరమున గెలువన్
  నంతము నొందిరి తానును
  కౌంతేయులమేనమామ,కర్ణుండు, గదా

  రిప్లయితొలగించండి
 12. కె ఈశ్వరప్ప గారి పూరణ
  కౌంతేయుల వేషములో
  నంతా కనుపించు వారి నలరించెడి ధీ
  మంతు౦ డెవరనగా నా
  కౌంతేయుల మేనమామ, కర్ణుండు గదా

  రిప్లయితొలగించండి
 13. మల్లెల వారి పూరణలు

  వింతగ శల్యుడు నయ్యెను
  కౌంతేయుల మేనమామ- కర్ణుండగుగా
  కౌంతేయుడు వానికినగు
  నంతట వేమేనమామ- అంతము చూడన్

  కుంతీపుత్రుడు నైనను
  కౌంతేయుడు కాడు వాడు కర్ణుండకటా
  వింతౌగదరా వినగను
  కౌంతేయుల మేనమామ కర్ణుండు గదా

  వింతగ శకారుడనియెను
  వంతనుఁ జెందెడి వనితగు వసంత సేనన్
  చెంతను నగగా నందరు
  "కౌంతేయుల మేనమామ కర్ణుండుగదా

  వింతగ భంగున దేలుచు
  పొంతన లేనట్టి మాట పొలుపుగ పలికెన్
  సుంతయు నెరుగని యొక్అరుడు
  "కౌంతేయుల మేనమామ కర్ణుండుగదా"

  చింతన చేయగ శల్యుడు
  కౌంతేయుల మేనమామ-కర్ణుండుగదా
  కుంతీ తనయుడు. వానికి
  కౌంతేయులవలె ననినటు కాడా రిపుగా

  రిప్లయితొలగించండి
 14. దుర్యోధనుడి మనోగతం...

  ఎంతగనో సాయ పడిరి
  చెంతన నా గెల్పు కొరకు చెప్పెద వారే
  యింతగ నడవుల పంపగ
  కౌంతేయుల - మేనమామ , కర్ణుండుగదా !

  రిప్లయితొలగించండి
 15. వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కాకుంటే కర్ణుడు శబ్దం పునరుక్తి అయింది.
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  శకుని కౌరవుల మేనమామ కదా!
  మీ పద్యానికి చిన్న సవరణలు.....
  కాంతా ! శల్యుం డగుగద
  కౌంతేయుల మేనమామ, కర్ణుండు గదా
  కౌంతేయాగ్రజు నన్నయ
  కౌంతేయులు నైదుమంది గౌరవ వంతుల్.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మాజేటి సుమలత గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చివరిపాదం గురువుతో అంతం కాలేదు. ఆ పాదాన్ని ‘పాండవు/ లెంతయొ యవమాన మంది యిడుములఁ బడిరే’ అందామా?
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  చెఱచెన్... టైపాటు వల్ల చఱచన్ అయినట్టుంది.
  *
  కె.యస్. గురుమూర్తి ఆచారి గారూ,
  వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  మొదటి పూరణలో కర్ణుండు కర్ణుందు అని టైపాటు. మూడవపాదంలో ‘కుంతీసుతుడగు నర్జుని...’ అనండి.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ పూరణ అర్థం కాలేదు. అన్వయలోపం ఉన్నట్టుంది.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ ఐదు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
  మొదటి రెండు పూరణలలో సమస్య చివర కొంచెం మార్చారు ‘అగుగా, అకటా’ అని.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. పంతము తోడుత పలుకుచు
  కౌంతేయుల మేనమామ; కర్ణుండు గదా,
  మంతిర యుక్తపు శస్త్రము
  లెంతయు గలిగిన నొకింత వృథ జేసె గదా!

  రిప్లయితొలగించండి
 17. లక్ష్మీదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘మంతిరయుక్తపు’ అనడమే ఇబ్బందిగా ఉంది.

  రిప్లయితొలగించండి
 18. గోలి వారి పూరణ బాగుంది. నేను మొదట్లో అలానే ఆలోచించాను. కౌంతేయులకు శకుని "మేనమామ" అవ్వడు కదా అని ఊరుకొన్నాను. తెలిసిన వారు వివరించగలరు.

  రిప్లయితొలగించండి
 19. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  చంద్ర శేఖర్ గారూ ! బహుకాల దర్శనం... కౌంతేయులను అడవికి పంపటం లో..నా (దుర్యోధన) మేనమామ, కర్ణుడు ఎంతగానో సాయపడ్డారు కదా ....అని నాభావమండీ... ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 20. ధన్యవాదములు మాస్టారు . పెట్టిన వెంటనే గుర్తించాను. ఫద్యం వ్రాస్తుండగా ఇంటికి స్నేహితులు వచ్చారు. అందుకని సవరించలేదు.

  మీ సవరణ బాగుంది.

  సవరణతో

  వంతుకు రారాజు పిలువ
  కౌంతేయుల, మేనమామ, కర్ణుండు గదా
  తంత్రములు పన్న పాండవు
  లెంతయొ యవమాన మంది యిడుములఁ బడిరే

  రిప్లయితొలగించండి
 21. గురువుగారు,
  సవరించిన పద్యమునొక్కసారి గమనించగలరు.

  పంతము తోడుత పలుకుచు
  కౌంతేయుల మేనమామ; కర్ణుండుగ,దా
  దాంతుడె యయి గతి తప్పగ
  కుంతీ సుతుడైన మృత్యు గుహరముఁ దోసెన్.

  దాంతుడు=ఇంగితజ్ఞుడు, నిగ్రహచిత్తుడు

  రిప్లయితొలగించండి
 22. లక్ష్మీదేవి గారూ,
  సవరించిన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. శాస్త్రి గారూ, ఇచ్చిన సమస్యలో షష్ఠీ విభక్తి సూచక౦గా ఉన్నదానిని ద్వితీయా విభక్తి అర్థం వచ్చే విరుపుతో సరిపోతుందా? అదే నాకు అర్థం కాని విషయం.

  రిప్లయితొలగించండి
 24. కుంతి కెవరు ప్రియపురుషులు?
  కౌంతేయులు, పాండురాజు, కన్న జనకుడున్,
  చెంతనె యుండెడి కృష్ణుడు,
  కౌంతేయుల మేనమామ, కర్ణుండు గదా!

  రిప్లయితొలగించండి
 25. ‘అపరిచితుడు’ గారూ,
  కుంతికి ఇష్టమైనవారు అంటూ ఇచ్చిన లిస్టుతో మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
  ఇంత చక్కని పద్యాన్ని వ్రాసిన మీరు అపరిచితులుగా ఉండడం మాత్రం సబబుగా లేదు. శంకరాభరణం బ్లాగు మీకు స్వాగతం పలుకుతున్నది.

  రిప్లయితొలగించండి
 26. అపరిచితుడు గారు,
  మీ పద్యం నిజంగా బాగుంది.

  గురువుగారు,
  అన్నోన్ గా మనతెలుగు చంద్రశేఖర్ గారు సైన్ ఇన్ అవుతుంటారు కదా!

  రిప్లయితొలగించండి
 27. త్వరగా వ్యాఖ్యానించే ప్రయత్నంలో ఖాతా వివరాలు పూర్తిగా నింపలేక పోయాను. నాపేరు వేణు దశిగి (వేద). మీలో కొందరితో అన్యవేదికలలో పరిచయమున్నవాణ్ణే! ఏమైనా పరిచయమయ్యే వరకూ అపరిచితులమే కదా!

  రిప్లయితొలగించండి
 28. మీ ఆదరపూరిత స్వాగతానికీ, అభినందనలకూ ధన్యవాదాలు!

  రిప్లయితొలగించండి