26, అక్టోబర్ 2014, ఆదివారం

పద్యరచన - 718 (వృక్షో రక్షతి రక్షితః)

కవిమిత్రులారా,

పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

21 కామెంట్‌లు:

 1. వృక్షంబును రక్షించగ
  పక్షంబుకు దారి దిశను బదలాయించెన్
  దీక్షగ పరిశీలించిన
  వృక్షముపై వారి శ్రద్ధ వెల్లడియగుగా !

  రిప్లయితొలగించండి
 2. రాజ మార్గము జూడుము రమ్య మలరి
  త్రాచు పామును బోలుచు తళుకు లీనె
  నెంత దూరము బోవునో నెఱు క దరమె ?
  పోవు నెంతైన దవ్వును బోయి చూడు

  రిప్లయితొలగించండి
 3. వంగి వందనమును జేసె పసి తరువుకు
  వంపు సొంపయ్యెనిట కాని వంక కాదు
  తరుణి నడుమువోలె జలధి కెరటము వలె
  తరణి బింబము వలెనుండె తారు రోడ్డు!!

  రిప్లయితొలగించండి
 4. శంకరార్యా !

  ఈ చిత్రం చాలా కాలంగా నా దగ్గర ఉన్నది !
  దీన్ని చూస్తుంటే బాధతో కూడిన ప్రయోజనం లేని పశ్చాత్తాపం !

  1977 లో దివిసీమ(కృష్ణా జిల్లా) తుఫాను
  1996 లో కోనసీమ(తూ-గో-జిల్లా) తుఫాను
  2014 లో విశాఖ తుఫాను !

  మూడూ ఒకే తీవ్రత !
  కొన్ని వేలమంది మరణం-కొన్ని లక్షల చెట్ల హననం !
  (2014 లో మరణాలు తగ్గినవి)

  1996 తుఫానుకు నే నక్కడే ఉన్నాను !
  ఆ భయంకర విలయాన్ని ప్రత్యక్షంగా చూసాను !
  గజాని కొక చెట్టు-రోడ్డు కడ్డంగా !
  రోడ్లు-భవనాల శాఖలో ఉన్నందు వలన
  తీయించే బాధ్యత నాదే !
  ముక్క ముక్కలుగా కోయించి పక్కకు తప్పించి
  ట్రాఫిక్కు పునరుద్ధరించడానికి వారం పైనే పట్టింది !

  అడ్డంగా పడిపోయిన చెట్లూ - స్థంభాలూ
  కూలిన యిళ్ళూ - జంతు కళేబరాలూ
  ఎక్కడ చూసినా యివే దృశ్యాలు !
  అన్ని ఊళ్ళూ ఒక్కలానే ఉండేవి !

  ఒక్క మాటలో చెప్పాలంటే
  చిన్నప్పటి నుండి తెలిసిన ఊరు పేరు కూడా
  అక్కడెవర్నయినా అడిగి తెలుసుకుంటే గాని గుర్తొచ్చేది కాదు !
  దాదాపు నెలరోజులకు గాని కరెంటు రాలేదు !
  అదొక పెద్ద పీడకల !

  ఎక్కడయినా ఒకటీ అరా మిగిలిన చెట్లను
  రోడ్లు వెడల్పు చెయ్యడానికని తీయించేసాము !
  ఇప్పుడు తల్చుకుంటే బాధగా ఉంటుంది !

  నా చిన్నప్పుడైతే
  ఏ సమయం లోనూ రోడ్డు మీద ఎండ పడేది కాదు
  అంత దట్టంగా దగ్గరగా ఉండేవి చెట్లు !

  ఈ చిత్రం చూస్తుంటే
  ఆ బాధ రెట్టింపౌతుంటుంది !

  రిప్లయితొలగించండి
 5. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరింప నున్నవి !

  తేనెటీగ లంతరించిన 5 సంవత్సరాలకు
  భూమి పైన జీవమే యుండదట !
  పర్యావరణ రక్షణ - మన విధి - మన కర్తవ్యం !
  అందుజేత చెట్లను పాతండి - పెంచండి - పోషించండి - రక్షించండి !

  01)
  ____________________________

  చెట్టు తీయ కుండ - చుట్టు తిప్పిరి దారి
  చెట్టు విలువ దెలిసి - పట్టు బట్టి
  పచ్చనైన చెట్టు - ప్రాణ వాయువు, పండ్లు
  కాయ,కూర, మందు - కలప నిచ్చు !

  చెట్ల గొట్ట రాదు - యెట్టి స్థితి నయిన
  పట్టు బట్టి కొట్ట - పతన మౌను
  ప్రాణి కోటి యంత - ప్రాణవాయువు లేక
  శ్వాస నిడును చెట్లు - శ్వాసి కిలను

  చెట్లవి దైవ సమానము
  చెట్లవి ప్రాణులకు జగము - క్షేమము నిచ్చున్ !
  చెట్లవి జీవాధారము
  చెట్లవి లేకున్న సమయు - చేతన ధరపై !
  ____________________________
  శ్వాసి = ప్రాణి

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మాన్యులు వసంత కిశోర్ గారికి నమస్కారం. మీ పద్యం చాలా వివరణాత్మకంగా ఉంది.మీ అనుమతి లేకుండ మీ ఈ పద్యాన్ని నా facebook page
   https://m.facebook.com/story.php?story_fbid=920954201305947&substory_index=0&id=839110869490281
   లో ప్రచురించినందుకు మన్నించగలరు.మీ పద్యాన్ని ప్రజహితార్థం వినియోగించితిని. మీరు అభ్యంతరం తెల్పిన యెడల దానిని తొలగిస్తాను.మీరు నన్ను మన్నించ ప్రార్థన.

   తొలగించండి
  2. సతీశ్ గారూ,
   శంకరాభరణం బ్లాగులో ప్రకటింపబడిన ఏ విషయమైనా ఏవిధంగానైనా ఎవరైనా నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు. అనుమతి అవసరం లేదు.

   తొలగించండి
 6. శంకరార్య !
  నాదొక మూర్ఖ రాభణ సందేహం

  న-కార పొల్లు హల్లు కాదా యని !

  రిప్లయితొలగించండి
 7. చెట్ల రక్షింప నవియె రక్షించు జగతి
  ననెడు పలుకులు సత్యములంచు నమ్మి
  జనులెవరొగాని పాటించి సఫలులగుచు,
  జగతికాదర్శముగ నిల్చి చనిరి గనుడు.

  రిప్లయితొలగించండి
 8. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  ‘పక్షంబుకు’ అన్నారు. పక్షంబునకు.. అనవలసింది. అక్కడ ‘పక్షమునకు’ అంటే సరి!
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  కాని మీరు చిత్రాన్ని సరిగా ‘పరిశీలించలేదు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీరు వర్ణించిన హృదయవిదారక పరిస్థితులు మనస్సును కలత పెట్టాయి.
  మీ పద్యాలు బాగున్నవి. అభినందనలు.
  నకారపొల్లు హల్లే. మీ కెందుకు సందేహం వచ్చింది?
  *
  లక్ష్మీదేవి గారూ,
  మీ పద్యం బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి

 9. చేరి గూల్చిన చెట్ల నెడారియగును
  దారితెన్నుయు గానడు ధరణి నరుడు
  చేయవలసిన దొక్కటే చెట్ల పెంపు
  దారి జూపెనుగా రహదారి మనకు

  రిప్లయితొలగించండి
 10. పాదపమును గని యెడారి ప్రాంతమందు
  మార్గమును మరలించిరి మంచి తలచి
  బాట సారుల బడలిక బాపు ననుచు
  చెట్లు పెంచుట నందరుఁ జేయ వలయు

  రిప్లయితొలగించండి
 11. శంకరార్యా ! ధన్యవాదములు !
  నా సందేహం-------------
  *****
  కంది శంకరయ్య చెప్పారు...

  వసంత కిశోర్ గారూ,
  నేను ఎదురుచూస్తున్న భావంతో చక్కని పూరణ చెప్పారు. (నిజానికి వాలిసుగ్రీవుల ప్రస్తావనతో నేను పూరణ వ్రాయాలనుకున్నాను.) అభినందనలు.
  ‘సర్వమ్’ అని హలంతంగా చెప్పరాదు కదా... అక్కడ ‘ఆస్తుల నెల్లన్’ అనండి.

  అక్టోబర్ 25, 2014 11:17 AM
  *****

  రిప్లయితొలగించండి
 12. బీడుగమారెభూములిట వృక్షములేవియులేక క్షామ సం
  పీడితులైరిజీవులఁట వేదననొందెను జంతుజాలముల్
  వేడుకగాదెభూతలము విచ్చినపుష్పఫలాధికత్వమన్
  వేడెదమానవాళిని సవిస్తరమౌహరితోద్భవంబుకై.

  రిప్లయితొలగించండి
 13. వృక్షంబును రక్షించిన
  రక్షించును మనలననుచు రహదారైనన్
  లక్షణముగ వక్రించిరి
  వృక్షంబుల విలువ దెలిసి వినురా మిత్రా!

  రిప్లయితొలగించండి
 14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  ‘సర్వమ్’ అన్నది హలంత సంస్కృతపదం. దానిని ‘సర్వము, సర్వంబు’ అని తెలుగులో ప్రయోగించవలసి ఉంటుంది. ‘ఎల్లన్’ అన్నది ద్రుతాంతమైన తెలుగు పదం. దానిని ‘ఎల్ల, ఎల్లన్, ఎల్లను’ అని ప్రయోగించవచ్చు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  బొడ్దు శంకరయ్య గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. రాజ మార్గము జూడుము రమ్య మలరి
  త్రాచు పామును బోలుచు తళుకు లీనె
  చెట్లు లేనట్టి మార్గము చిత్రమాయె
  చెట్లు నా టంగ వలయును నీడ కొఱకు

  రిప్లయితొలగించండి
 16. తరువుల బెంచుడి పర్యా
  వరణము గాపాడు నంచు బాటల వెంటన్
  పరిపరి విధముల నుడివిరి
  మరచినచో సంభవించు మరణావస్థల్

  రిప్లయితొలగించండి
 17. చెట్టుని గొట్టక వేసిరి
  గట్టిగ మరి తారురోడ్డు ఘనముగ భళిరా!
  నెట్టుకు పోలేదొ కటని
  బిట్టుగ నిది నాచరించి బెంచుము చెట్లన్!

  రిప్లయితొలగించండి
 18. సుబ్బారావు గారూ,
  మీ తాజా పద్యం బాగున్నది. అభినందనలు.
  *
  గండూరి లక్ష్మినారాయణ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  శైలజ గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 19. మొక్కలు మొలవని చోటని
  యొక్కటిగా నున్న చెట్టు నుంచిరి కనుమా!
  చెక్కిలి గుంటై వంపది
  చక్కని రహదారి మోము సార్థక మాయెన్!

  రిప్లయితొలగించండి