6, అక్టోబర్ 2014, సోమవారం

నిర్వచన భారత గర్భ రామాయణము - 103


రావిపాటి లక్ష్మినారాయణ

రామాయణము-
సీ.        అరివచ్చు నపుడైన (పరఁగు ఘూకకృతి క
లరుచు, నశ్వత్థామ)లకముఖభువి
జము లేసెఁ గపులు దాశరథి సంగరమహి
(మాతులబలు నండచేతఁ; గృష్ణ)
ఘోరతనులఁ దితి (కొడుకులఁ దమిఁ గూల్చె
నడఁచె ధృష్టద్యుమ్నుఁ) డంగదుఁడు
క్రూరగుణుని సర్పరోముఁడన్ రాక్షసుఁ;
(గాలుపురికి నంపె ఘనుశిఖండి)
ఆ.        గమనుఁ బోలు నీలుఁ డమర వృశ్చికరోము;
నగ్నివర్ణు రాముఁ డణఁచె; మాత
లి రహిఁ దెచ్చిన మఘవు రథ మెక్కె; నపహృ
తామృతుండు నయ్యె నసురవిభుఁడు. (౧౧౮)

భారతము-
ఆ.        పరఁగు ఘూకకృతి కలరుచు, నశ్వత్థామ
మాతులబలు నండచేతఁ; గృష్ణ
కొడుకులఁ దమిఁ గూల్చెనడఁచె ధృష్టద్యుమ్నుఁ
గాలుపురికి నంపె ఘనుశిఖండి. (౧౧౮)
టీక- ఘూకకృతికి = గుడ్లగూబ పనికి (రా) (శత్రువున కయిన దుశ్శకునమునకు); (రా) అశ్వత్థ = రావిచెట్టు, అమలక = ఉసిరిక చెట్టు; సంగరమహిమ = యుద్ధప్రౌఢియందు; అతుల = సమానరహితుఁడు; (భా) మాతుల = మేనమామ (కృపుడు); కృష్ణ = (రా) నల్లని, (భా) ద్రౌపదియొక్క, తమి = (రా) కోరికతో, (భా) రాత్రియందు, ధృష్టద్యుమ్నున్ = దిట్టయైన సత్త్వము గలవానిని; శిఖండిగమను = నెమలి నెక్కి పోవువాఁడు (కుమారస్వామి); మఘవు = ఇంద్రుని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి