23, అక్టోబర్ 2014, గురువారం

సమస్యా పూరణం – 1537 (తెలుఁగుల సంవత్సరాది)

కవిమిత్రులారా,

దీపావళి పర్వదిన శుభాకాంక్షలు! 
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
 తెలుఁగుల సంవత్సరాది దీపావళియే.

27 కామెంట్‌లు:


 1. దీపావళి శుభా కాంక్షలు
  ====
  రాక్ష సుండగు నరకుని గక్షతోడ
  సంహ రించిన యాసతి సత్య భామ
  శాంత రూపము వహియించి సంతసమున
  బ్లాగు కవులకు నీయుత ! వరము శతము

  రిప్లయితొలగించండి
 2. శ్రీగురుభ్యోనమ:

  తెలుపగ చైత్రపు టాదియె
  తెలుఁగుల సంవత్సరాది, దీపావళియే
  విలసిత యాశ్వయుజమ్మున
  పలు దివ్వెల కాంతులీను పర్వంబనగన్.

  రిప్లయితొలగించండి
 3. వెలవెల లాడెడు జీవిత
  ముల కళకళ లాడ జేసి మురిపించంగన్
  వెలుగుల నింపును రెండును
  తెలుఁగుల సంవత్సరాది, దీపావళియే

  రిప్లయితొలగించండి
 4. గురువుగారికి మరియునితర కవిమిత్రులకు దీపావళి శుభాకాంక్షలు.

  మామూలుగా తెలుగు ప్రజలలో కూడా వ్యాపారలావాదేవీలకు దీపావళిరోజే ఆరంభము. ఆ భావనతో........

  వెలుగులకారంభము స
  త్ఫలదాయకమగుచు సర్వపాపహరముగా
  నలరగ వర్తక జనులగు
  తెలుగుల సంవత్సరాది దీపావళియే.

  రిప్లయితొలగించండి
 5. వెలుగులు జిమ్ముచు లాభపు
  ఫలములు తెచ్చి సిరి గూర్చు వ్యాపారమునన్
  తొలకరి దస్త్రముఁ బెట్టెడి
  తెలుఁగుల సంవత్సరాది దీపావళియే!!

  రిప్లయితొలగించండి
 6. కవిమిత్రులందఱకు దీపావళి పర్వదిన శుభాకాంక్షలు!

  ఖలుఁడగు నరకుఁడుఁ జావఁగ,
  వెలుఁగులు జనమనములందు వేకువ దీప
  మ్ము లిడఁగ, మొదలయె నూత్నపుఁ
  దెలుఁగుల సంవత్స"రాది దీపావళి"యే!

  రిప్లయితొలగించండి
 7. ఇలచై త్రమాస పాడ్యమి
  తెలుగుల సంవత్సరాది, దీ పావళి యే
  యలమిన చీకట్లను మ ఱి
  తొలగంగా జేయు నట్టి తొలి పండుగ యౌన్

  రిప్లయితొలగించండి
 8. విలువగ పర రాష్ట్రములకు
  కులవృత్తుల విడిచిపెట్టి కూటికి లేకన్
  వలస చని వర్తకులయిన
  తెలుగుల సంవత్సరాది దీపావళియే!

  రిప్లయితొలగించండి
 9. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు, కవి మిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 10. అచట అరవ దేశమున
  మకర సంక్రాంతి యే ఉగాది అనె
  ఇచట అయ్యవారు సరిమంత్రము జెప్పె
  తెలుఁగుల సంవత్సరాది దీపావళియే!!


  చీర్స్
  దీపావళీ శుభాకాంక్షల తో
  జిలేబి

  రిప్లయితొలగించండి
 11. బ్లాగు మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు!
  *
  శ్రీపతి శాస్త్రి గారూ,
  విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘విలసిత + ఆశ్వ..’ అన్నప్పుడు సవర్ణదీర్ఘసంధి వస్తుంది. యడాగమం రాదు. ‘విలసిలు నాశ్వయుజమ్మున’ లేదా ‘విలసితపు టాశ్వయుజమున’ అనండి.
  *
  చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ వైవిధ్యంగా ఉండి అలరించింది. అభినందనలు.
  *
  సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.
  *
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండు మధుసూదన్ గారూ,
  ‘ఆది దీపావళి’ అంటూ వైవిధ్యమైన విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  బొడ్డు శంకరయ్య గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 12. జిలేబీ గారూ,
  మీ భావానికి నా పద్యరూపం.....
  వెలయును చైత్రపు పాడ్యమి
  తెలుఁగుల సంవత్సరాది; దీపావళియే
  యిల మార్వాడీలకు, నర
  వలకును సంక్రాంతి నూత్నవత్సరము లగున్.

  రిప్లయితొలగించండి
 13. తొలి పండుగౌ యుగాదియె
  తెలుగుల సంవత్సరాది, దీపావళియే
  ఫలములనిచ్చి వణిజులకు
  తొలిపండుగయై కరమగు తుష్టి నొసంగున్
  ఫలము: లాభము

  రిప్లయితొలగించండి
 14. గురువర్యులకు,, కవిమిత్రులకు,బ్లాగువీక్షకులకు అందరికి దీపావళి పర్వదిన శుభాకాంక్షలు.

  రిప్లయితొలగించండి
 15. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. కె.యెస్.గురుమూర్తి గారి పూరణ
  లలితా!తెలుపుమ యేదో
  తెలుగుల సంవత్సరాది?దీపావళియే
  పలికె లలిత టీచరు తో
  కళకళ కాంతులు మెరయగ కన్నులలోనన్

  రిప్లయితొలగించండి
 17. విలయమ్మును ఛేదించగ
  కొలువంతయు కదలి రాగ కోలాహలమై
  వెలుఁగుల విశాఖ మెరయన్
  తెలుఁగుల సంవత్సరాది దీపావళియే!

  రిప్లయితొలగించండి

 18. కె .ఈశ్వరప్ప గారి పూరణలు
  పలుకని దీపపు కాంతులు
  పలికెడి బంగారు యేర్పు భగవత్స్మరణే
  తలపున జేర్చెడి ఉక్తులు
  తెలుఁగుల సంవత్సరాది, దీపావళియే

  వెలుగుల వేడుక లలరగ
  పలుకకనే దీపకాంతి పక్కున నవ్వెన్
  కలుషిత జీకటి తరుగగ
  తెలుఁగుల సంవత్సరాది, దీపావళియే

  రిప్లయితొలగించండి
 19. శ్రీ కంది శంకరయ్య గురుదేవులకు, కవి మిత్రులందరికి దీపావళి శుభాకాంక్షలు.
  కలుముల తల్లియె స్వయముగ
  కలకలలాడుచును వచ్చి కామ్యము లీయన్
  వెలిగెను సిరి సంపదతో
  తెలుఁగుల సంవత్సరాది, దీపావళియే
  .

  రిప్లయితొలగించండి
 20. శ్రీ శంకరయ్య గురుదేవులకు ధన్యవాదములు తో...
  గురుదేవులకు,కవులకు మరియు వీక్షకులకు దీపావళి శుభా కాంక్షలు

  రిప్లయితొలగించండి
 21. వెలుగది చిమ్మిన యప్పుడె
  తెలియగు లోకము, తెలివిని ధీవెలుగందన్
  తొలియగు వత్సరమునకును
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  వెలుగుల పండుగ నిదియౌ
  పలుగతి తామస ముడుగగ పరగునమాసే
  కలుగదె యుగాది జనులకు
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  పలుగతి రాక్షస బాధలు
  నిలవీడ ప్రభవ మగుగద నింపును గాదే
  తెలిగను వెలిగెడి రోజయి
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  తెలియగ పండుగలందున
  వెలిగింతురు దీపమెలమి, వెలుగులు చిమ్మన్
  వెలుగును గాదియు నటులనె
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  వెలుగును చైత్రము మొదలుగ
  తెలుగుల సంవత్సరాది,-దీపావళియే
  వెలుగుల నీనగ జనులకు
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  తొలగు నమాసను మొదలుగ
  పలుగతి కార్తికమునందు, పంపగ తిమిరం
  బలమును జనులకు విజ్ఞత
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  తొలిగను తెలుగులు నొకటై
  వెలిగిరి కార్తీక మందు. వేగము నిపుడీ
  వెలుగులు రెందుగ పెరిగెను
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  తెలుగన త్రిలింగ దేశము
  వెలుగును నాలయములందు, వేయాకసమున్
  చెలగును దీపాలిపుడల
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  తెలుగున నన్నయ, తిక్కన
  పొలుపుగ ప్రాంతాలిరుగడ, పోతన మూటన్
  వెలిగించ కావ్య దీపాల్
  తెలుగుల సంవత్సరాది దీపావళియే

  రిప్లయితొలగించండి
 22. కలసిరి గుజరాతీయులు
  తెలుగులు నొకచోట నపుడు తెలియక గుజరా-
  తిలడిగిరి యేమి మీకున్
  తెలుగుల సంవత్సరాది దీపావళియే?

  రిప్లయితొలగించండి
 23. అందరికీ వందనములు !
  అందరి పూరణలూ అలరించు చున్నవి !

  మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు !

  సంవత్సరాది - దీపావళి :

  01)
  _____________________________

  కలుగును చైత్రము నందున
  తెలుగుల సంత్సరాది ! - దీపావళియే
  జిలుగుల వెలుగులు జిమ్మును
  కలిగిన వారింటి లోన- కమనీయముగా !
  _____________________________

  రిప్లయితొలగించండి
 24. విలువల గణించు చుందురు
  వెలుగుల పండుగకు నాటి విలువలనెంచన్,
  కలిమియు లేముల నెంచగ
  తెలుగుల సంవత్స రాది దీపావళియే
  కొరుప్రోలు రాధా కృష్ణ రావు

  రిప్లయితొలగించండి
 25. కె.యస్. గురుమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ తొమ్మిది పూరణలు బాగున్నవి. అభినందనలు.
  *
  మిస్సన్న గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  వసంత కిశోర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *
  కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 26. పలుతెఱగుల వ్యాపకముల
  నెలకొని వృద్ధిని బడసెడి నేర్పరి జనులై
  వలసగ మార్వారరిగిన
  తెలుఁగుల సంవత్సరాది దీపావళియే!

  రిప్లయితొలగించండి