10, ఏప్రిల్ 2015, శుక్రవారం

సమస్యా పూరణము - 1644 (వానపాము కాటు ప్రాణహరము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వానపాము కాటు ప్రాణహరము.

18 కామెంట్‌లు:

  1. రైతు నేస్త మనగ రమణీయ సారమ్ము
    వాన పాము , కాటు ప్రాణ హరము
    త్రాచు విషము దిగిన తరలిపో దురుపైకి
    మత్తు లోన కరిగి చిత్తు గాను

    రిప్లయితొలగించండి
  2. పాడి పంట తోడ పల్లెలు రంజిల్ల
    హర్ష మిచ్చు నపుడు వర్ష మదియె
    నీరు నిండు కొనగ నీర సించిన పల్లె ,
    వాన పాము కాటు ప్రాణ హరము
    కొరుప్రోలు రాధా కృష్ణ రావు

    రిప్లయితొలగించండి
  3. Ravi Rangarao
    November 27, 2014 • Guntur • Edited
    బ్నిం గారి జడ శతకం ప్రేరణతో "బొట్టు" అనే గ్రూప్ పెట్టి ఐదేసి పద్యాలు ఆహ్వానిస్తున్నామని సవినయంగా మనవి. కవులందరూ సహకరించాలని కోరుతున్నాం, ఈ గ్రూప్ గురించి అందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం...ఓ పాతిక మంది కవులు పంపిస్తే వెంటనే పుస్తకంగా కూడా వేయటం జరుగుతుంది.


    Ravi Rangarao
    March 31 at 10:52am • Guntur • Edited
    ఇంకా ఎవరైనా మిత్రు లుంటే "బొట్టు" పై పద్యాలు పంపించండి...
    త్వరలో పుస్తకం రానుంది....కృతజ్ఞతలతో...రావి రంగారావు
    ఛందస్సు తేటగీతి పెట్టుకున్నాం
    https://www.facebook.com/groups/tilakam/

    రిప్లయితొలగించండి
  4. రైతు బంధువు గను రాజిల్లు భువిలోన
    సార మిడును గాదె సస్యమునకు
    వానపాము కాటు ప్రాణహరము కాదు
    మంచి జేయు నిదియె మానవులకు !!!

    రిప్లయితొలగించండి
  5. వాన పాము కాటు ప్రాణ హరము కాదు
    మేలు జేయు జీవి బాల ! యదియ
    త్రాచు పాము కాటు ప్రాణ హ రముసుమ్ము
    పాము వెంట బడుచు బరుగు లిడకు

    రిప్లయితొలగించండి
  6. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కొరుప్రోలు రాధాకృష్ణ రావు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    పద్యంలో అన్వయలోపం ఉన్నట్లు తోస్తున్నది.
    *****
    శైలజ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  7. రైతు పంట కెరువు"రాజుగమార్చెడి
    వానపాము"|"కాటు ప్రాణహారము
    దోమ,కీటకాలు-దోచగ పంటను
    బ్రతుకు తెరువులేక బంగపాటు.
    "విత్తబూన రైతు-సత్తువతోబాటు
    వాన"పాముకాటు ప్రాణహారము
    లాగ?దోమకాటు వేగమెనెలకొన్న?
    సస్యరక్షనుంచ-సాగుపంట".

    రిప్లయితొలగించండి
  8. పుట్టనుండి వెడలు భుజగముల్ గురియఁగ
    వాన, పాముకాటు ప్రాణహరము,
    కాన ముందు వెనుక కడుజాగరూకతన్
    జూచుకొనుచు నడుచుచో హితమగు.

    రిప్లయితొలగించండి
  9. నాగరాజు రవీందర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  10. మూషికములఁజంపి పొలముల రక్షించి
    కాపు పంట నెపుడు కాచు పాము
    తప్పదుమరణమని తలచిన భయపు భా
    వాన పాము కాటు ప్రాణ హరము

    రిప్లయితొలగించండి
  11. అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. మిత్ర ద్రోహి వేటు, పుత్రులయెడబాటు ,
    దున్ను రైతు పైన పన్నుపోటు ,
    పడవ మునుగు వేళ పడియెడు వడగళ్ళ
    వాన, పాము కాటు ప్రాణ హరము !!!

    రిప్లయితొలగించండి
  13. మిత్రులు శ్రీకంది శంకరయ్యగారికి, సుకవి పండిత మిత్రబృందమునకు నమోవాకములతో...

    ప్రాఁతదైన యిల్లు, పక్కలో బళ్ళెమ్ము,
    బాలిశకృతము, యమపాశహతియు,
    నింటిలోన శత్రులుంట, తోరపు ౙడి
    వాన, పాముకాటు "ప్రాణహరము"!

    రిప్లయితొలగించండి
  14. తాడుఁ జూడ నదరి తలపులో పామని
    పిల్లిని పులి యంటు బెదరి పోవు
    సున్నితంబగు మనసున భీతి ముదిరిన
    వానపాము కాటు ప్రాణహరము!

    రిప్లయితొలగించండి
  15. అయ్యా!ఇది 1404 వరుస సంఖ్యతో ది.06-05-2014 న ఇచ్చినది, గమనించగలరు.

    వానకాలమందు వానపాములవెన్నొ
    చేల,బోదెలందు చెలగు గాని
    వాని యందు విసము భయములేదౌ భీతి
    వానపాము కాటు ప్రాణహరము

    పాములన్నితెలియ ప్రాణహరము గావు
    వానపామునయిన పరగు విసము
    కొన్నిటందు,నవియ గొనును ప్రాణాలనే
    వానపాము కాటు ప్రాణహరము

    భయము కలుగు వాడు ప్రాణాలు తెగియించి
    కాచు కొనగ,కొట్టు గట్టి దెబ్బ,
    యదియ తీయు ప్రాణమరయగ నానుడౌ
    వానపాము కాటు ప్రాణహరము

    వానపాముకాటు భయమెంతొ లేదని
    వదలవీలుకాదు-వైద్య మొసగ
    వలయు-కొన్నిచోట్ల వానిలో విసముండు
    వానపాము కాటు ప్రాణహరము

    ఇక నిన్నటిపూరణలు;

    ఆమనందు చెట్లయాకుల మధ్యగా
    సందులందు కాంతి సందడించు
    నవియె తారలవలె నగుపించగా తోచె
    తరువున వెలుగొందె దారలెల్ల

    పొదలమాటున గన పోడిమి నామనిన్
    చైత్రమందున యల జంటలెల్ల
    నవియె తారలట్లు నగుపింపగాతోచె
    తరువున వెలుగొందె దారలెల్ల

    తారలాకసాన తళుకున రాత్రులన్
    వరలుచుండ,నారుబయట పక్క
    చెట్లనీడ,తారలట్లు చిత్తమునను
    తరువున వెలుగొందె దారలెల్ల

    రిప్లయితొలగించండి


  16. పడగయున్న తోక పొడవుగా యున్నను
    పైన పొడలెయుండి పరులెత్త
    విషము గలుగు పాము వినుమన్న యది కాదు
    వాన పాము , కాటు ప్రాణ హరము

    రిప్లయితొలగించండి
  17. మంద పీతాంబర్ గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండు మధుసూదన్ గారూ,
    ఏవేవి ప్రాణహరములో ఆ ‘లిస్టు’తో చక్కని పూరణ నందించారు. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ******
    మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    నిజమే! ఈమధ్య మతిమరుపు ఎక్కువౌతున్నది.
    మీ పూరణ లన్నీ బాగున్నవి. అభినందనలు.
    నిన్నటి సమస్యకు మీ పూరణలు బాగున్నవి. ‘ఆమని+అందు’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది.
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    వివిధ్యమైన మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి