14, ఏప్రిల్ 2015, మంగళవారం

సమస్యా పూరణము - 1647 (వలచి పెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
వలచి పెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల.

23 కామెంట్‌లు:

  1. మాస్టారూ, ఈ రోజు సమస్య చూస్తే నాకు ఈ సమస్య తోచింది - "ముదియె సంతసమ్ముగ వచ్చెముద్దులాడ"

    రిప్లయితొలగించండి
  2. చంద్రశేఖర్ గారూ,
    ధన్యవాదాలు.
    ‘ముదియె సంతసముగ ముద్దులాడె’ అంటే ఇంకా బాగుంటుందేమో? ‘కౌముదియె...’ అనడానికి అవకాశం ఉంటుంది.

    రిప్లయితొలగించండి
  3. మదిని దోచిన వాడని మరులు గొనెను
    గుణగణమ్ముల మేటితో కుదిరె పొత్తు
    తండ్రి మెచ్చెను ప్రియుని సాదరమున గనె
    వలచి పెండ్లాడె, వృద్ధుని పడుచుపిల్ల.

    రిప్లయితొలగించండి
  4. మాష్టారు, నా మనసులో మాట కౌముది పట్టేశారు. మీ సవరణ చాలా బాగుంది. అట్లాగే ఇవ్వండి.

    రిప్లయితొలగించండి
  5. తనను మెచ్చిన వానిగా తరుణి యెరిగి
    బుద్ధి కుశలత లోతను వృద్ధుడనుచు
    నచ్చి పెద్దల నొప్పించి నయము మీర
    వలచి బెండ్లాడె ,వృద్ధుని పడుచుపిల్ల!!!

    రిప్లయితొలగించండి
  6. సతియె జూడగ హిమవంతు సూతియయ్యె
    తపము జేయుచు గజచర్మ ధారి హరుని
    యాదిదేవు,సనాతను నాత్మ నెంచి
    వలచి బెండ్లాడె ,వృద్ధుని పడుచుపిల్ల.

    రిప్లయితొలగించండి
  7. మిస్సన్న గారూ,
    వృద్ధుని పడుచుకూతురు వలచి పెళ్ళాడిందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    చంద్రశేఖర్ గారూ,
    మీ మనస్సులో ‘కౌముది’ ఉన్నప్పుడు తేటగీతిని ఎలా తీసుకున్నారు? ఆ అవకాశం ఆటవెలదిలోనే ఉంది కదా!
    *****
    శైలజ గారూ,
    వయోవృద్ధుడు కాకుండా బౌద్ధికవృద్ధునితో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    సనాతనవృద్ధునితో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    మొదటిపాదంలో ప్రాసయతి తప్పింది. ‘సతియె చూడగ హిమవంతు సుతగ నయ్యె’ అనండి.

    రిప్లయితొలగించండి
  8. మాస్టరు గారూ ! దోష సవరణకు ధన్యవాదములు...సవరణతో...

    సతియె జూడగ హిమవంతు సుతగగాగ
    తపము జేయుచు గజచర్మ ధారి హరుని
    యాదిదేవు,సనాతను నాత్మ నెంచి
    వలచి బెండ్లాడె ,వృద్ధుని పడుచుపిల్ల.

    రిప్లయితొలగించండి
  9. పెండ్లి చేెయగ నెంచుచు వృద్ధ తండ్రి
    వెదికి బుద్ధిమంతుని జూపఁ విజ్ఞుడైన
    వరుని గుణగణమ్ముల వివరములెరిగి
    వలచి పెండ్లాడె, వృద్ధుని పడుచుపిల్ల

    రిప్లయితొలగించండి
  10. వృద్ధు డయ్యును గనిపించ శుద్ధ ముగను
    పడుచు కుఱ్ఱా డు వోలెను బడతి కపుడు
    వలచి పెండ్లాడె వృధ్ధుని పడుచు పిల్ల
    వారి బంధము బాగుగ వరలు గాక !

    రిప్లయితొలగించండి
  11. వృద్ధ వేషము ధరియించి ప్రేక్షకులకు
    నవ్వు దెప్పించు చున్నట్టి నాటకమున
    పాత్రధారుని యభినయ ప్రతిభ నెరిగి
    వలచి పెండ్లాడె వృద్ధుని పడుచు పిల్ల!

    రిప్లయితొలగించండి
  12. బొడ్డు శంకరయ్య గారూ,
    మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
    *****
    పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. బల్లూరి ఉమాదేవి గారి పూరణ....

    బాల్య చేష్టతోడ ఋషిని బాధ పెట్ట
    కోప వశముచేతనతడు క్రుద్ధు డవగ
    తండ్రి మాటమేర ప్రజల కొరకు తాను
    వలచి పెండ్లాడె వృద్ధుని పడుచు పిల్ల.

    రిప్లయితొలగించండి
  14. బల్లూరి ఉమాదేవి గారూ,
    సుకన్య ప్రస్తావనతో మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘కోపవశమున’ అన్నతరువాత ‘క్రుద్ధుడు’ అనడం పునర్తుక్తి. మూడవపాదంలో యతి తప్పింది. మీ పద్యానికి నా సవరణ....
    బాల్యచేష్టతోడ సుకన్య బాధపెట్ట
    కోపవశమున చ్యవనుఁడు శాప మిడగ
    ప్రజల రక్షణకై తండ్రి పలుకు మేర
    వలచి పెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల.

    రిప్లయితొలగించండి
  15. ఆశయాలకు ననుగుణమైన విధిగ
    చదువు,సంస్కార మున్నట్టి సద్గుణుండు
    వలచి పెండ్లాడె|"వృద్దుని పడుచుపిల్ల
    ననుటతప్పది?నాటకమందునొకటే"|
    నీతినియమాలుగలిగిన నిష్టపరుడు|
    నాటిసంస్కృతి చాటెడి న్యాయ వేత్త|
    నేటికట్నాల యువతకు పోటిబడక?
    వలచిపెండ్లాడె వృద్దుని పడచుపిల్ల

    రిప్లయితొలగించండి
  16. వెడలె నత్తమ్మ! మామేమొ వృద్ధుడాయె!
    బావ మనసైనవాడని పట్టు బట్టి
    వలచి పెండ్లాడె , వృద్ధుని పడచు పిల్ల
    యోర్పు తోడను సేవల నుద్ధరించె!

    రిప్లయితొలగించండి
  17. కె. ఈశ్వరప్ప గారూ,
    మీ సుదీర్ఘపూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    విరుపుతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  18. గురువుగారూ నాదో సందేహం:
    సుకన్య చ్యవనుని వలచి పెళ్లాడినట్లా?
    నాన్నగారి కోరికమేరకు తప్పనిసరై పెళ్లాడినట్లా?

    రిప్లయితొలగించండి
  19. సహదేవుడు గారూ,
    తన కపకారం చేసిన సుకన్యను తనకిచ్చి వివాహం చేయమని చ్యవనుడు కోరగా ఆమె తండ్రి శర్యాతి వృద్ధుడూ అంధుడూ అయిన ఆ ఋషికి తన కూతురును ఇవ్వడానికి సంకోచిస్తుంటే సకన్యయే వలచి (ఇష్టపడి) తండ్రిని ఒప్పించి పెళ్లిచేసుకుంటుంది.
    సుకన్య

    రిప్లయితొలగించండి
  20. సహదేవుడు గారూ,
    పై వాఖ్యలో నీలిరంగులో కనిపిస్తున్న ‘సుకన్య’ అన్నదాన్ని క్లిక్ చేసిచూడండి.

    రిప్లయితొలగించండి
  21. ఆది భిక్షుడు,వృద్ధుడు నైన శివుని
    బూది భూతిగ గలవాని,భూతపతిని
    పామునగయైన వానిని,-పార్వతి యట
    వలచి పెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల

    ప్రియుడు శాపాన వృద్ధుడై వెలుగు చుండ,
    వాని శాపంబు నెరిగిన పడతి యోర్తు
    శాపముడుపంగ తలచియు,సతియె యపుడు
    వలచి పెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల

    కట్నమిడ లేని తండ్రికి,కన్యయొకతె
    భారమును తాను తీర్పంగ బాధ్యతనుచు
    కట్నమడుగని వృద్ధుని గనినయంత
    వలచి పెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల

    వయసు కాదది ముఖ్యంబు భవ్య మనమె
    ముఖ్యమంచును నొకతెయు,ముదిమి యైన
    నొక్కసద్వర్తనుని గాంచి యుల్లమలర
    వలచి పెండ్లాడె వృద్ధుని పడుచుపిల్ల

    రిప్లయితొలగించండి
  22. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ పూరణలు బాగున్నవి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  23. ఇద్దరు సుతులంగని యక్కయిలనువీడ
    నాదరణలేక విలపించు యర్భకులను
    వలచి పెండ్లాడె వృద్ధుని పడుచు పిల్ల
    త్యాగమును గాంచి తలిదండ్రి తృప్తినొంద

    రిప్లయితొలగించండి