19, ఏప్రిల్ 2015, ఆదివారం

సమస్యా పూరణము - 1652 (కోడిని కరకర నమిలె కోడలమ్మ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
కోడిని కరకర నమిలె కోడలమ్మ!
("నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" బ్లాగు నుండి డా. ఆచార్య ఫణీంద్ర గారికి ధన్యవాదాలతో)

నా పూరణ....
అత్త గయ్యాళి; కోడలి కన్ని పనులు
చెప్పి చేయించెఁ దినుటకు చెడిన యన్న
మిడగఁ దినక చాటుగను మగఁ డొసఁగిన ప
కోడిని కరకర నమిలె కోడలమ్మ!

31 కామెంట్‌లు:

 1. చికెను మంచూరియా తాను జేయ నెంచి
  నెట్టులో వండు పద్ధతి నేర్చుకోని
  చక్కగా వండె తెచ్చి బాజారునుండి
  కోడిని - కరకర నమిలె కోడలమ్మ

  రిప్లయితొలగించండి
 2. పిండి వంటలు జేయగ పండు గనుచు
  కొత్త కోడలి కిచ్చెను సత్తు పిండి
  వళ్ళు మండుచు కోపించి పంటి తోచె
  కోడిని నమిలె కరకర కోడలమ్మ

  రిప్లయితొలగించండి
 3. అత్త దుర్గకునిచ్చె 'డి' యనెడి కోడు
  ఏ బి సి డి ల జంతికలింక యెదుటనుండె
  అత్తపైన కోపంబుననలిగి యందు
  కో 'డి'ని కరకర నమిలె కోడలమ్మ!

  అందుకు + ఓ + ' డి ' ని = అందుకో'డి'ని

  రిప్లయితొలగించండి
 4. మిడగఁ దినకున్న చాటుగా మగఁడొసఁగు ప

  గురువుగారు పైన ఇచ్చిన పాదం లో 'మ ' కి 'ఇ ' యతి కుదురుతుందా ? దయచేసి వివరించగలరు.

  రిప్లయితొలగించండి
 5. తే.గీ.భర్త నడుగుజాడలబెట్టి భామయేలు
  చుండె గృహముతెలివితోడ, గుండెమండి
  యత్త యిదియేమ నడుగగా!యంత నాటు
  కోడిని కరకర నమిలె కోడలమ్మ!

  రిప్లయితొలగించండి
 6. ఆడి కారును దెచ్చిన కోడలనుచు
  పెత్తనమ్మునుజేయక నత్తగారు
  కమ్మ కమ్మగ నీయగ కాజు తోప
  కోడి ,ని కరకర నమిలె కోడలమ్మ!!!

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘...జేయ నెంచి
  యెట్టులో వండు పద్ధతి నేర్చుకొనియు...’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఒక’ను ‘ఓ’ అనడం వ్యావహారికం. అక్కడ ‘కోపంబున నలిగె నెందు|కో, ‘డి’ని...’ అంటే ఎలా ఉంటుంది?
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  అక్కడ యతిదోషాన్ని నేను గమనించలేదు. ధన్యవాదాలు. సవరిస్తాను.
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘ఏమని+అడుగగా’ అన్నప్పుడు సంధి లేదు. యడాగమం వస్తుంది. అక్కడ ‘అత్త్త యేమని యడుగగా నంత నాటు...’ అందామా?
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘చేయక యత్తగారు’ అనండి.

  రిప్లయితొలగించండి
 8. గురుదేవులకు వందనములు.మీ పద్యంలో ప్రాసయతి సరిపోయిందండి.సవరించనవసరంలేదు.

  రిప్లయితొలగించండి
 9. సహదేవుడు గారూ,
  అంతకుముందు యతి తప్పిన మాట నిజమే.ఇప్పుడున్నది సవరించిన పాదం.

  రిప్లయితొలగించండి
 10. తే.గీ.కోడిని కరకర నమిలె కోడలమ్మ!
  కుక్కు వడ్డించ ప్లేటున మక్కు వగను
  పిల్లలకుపకోడిని,మంచి పిండి వంట
  వచ్చు మగినికే సరిపోగ వచ్చె నత్త

  రిప్లయితొలగించండి
 11. గురువుగారు మీరిచ్చిన ప్రేరణ తొ కొద్దిపాటి మార్పుతో నా పద్యంపెడుతున్నాను.యతి విషయం లో నా సూచన మన్నించినందుకు శిరసు వంచి పాదాభివందనము చేస్తున్నాను .

  సవరించిన పద్యం:
  *************
  తే.గీ. భర్త నడుగుజాడలబెట్టి భామయేలు
  చుండె గృహముతెలివితోడ, గుండెమండి
  యత్త యిదియేమనియడుగ! నంత నాటు
  కోడిని కరకర నమిలె కోడలమ్మ!

  ధన్యోస్మి.

  రిప్లయితొలగించండి
 12. అత్తపైన కోపముతోడ నాగ్రహించి
  పడకటింటిలో నికి చని పండుకొనియె
  నర్ధరాత్రి యాకలితోడ నర్థిఁగొని ప
  కోడిని కరకర నమిలె కోడలమ్మ

  రిప్లయితొలగించండి
 13. కోడి చర్మము వొలిచి కుతకు తగ ను
  నగ్ని మీదను గాల్చి మా హర్ష మొన్న
  కోడిని కరకర నమిలె , కోడలమ్మ
  విస్కి బాటిలు కొనియీ య వేగ ద్రాగి

  రిప్లయితొలగించండి
 14. పడదు పడదన్న వినకుండ ప్రక్కఁజేరి
  కోడిఁ దినుచుండ నత్తమ్మఁ గోపగించి
  తనదు నిరసనన్ దెల్పగ తినెడా ప
  కోడిని కరకర నమిలె కోడలమ్మ

  రిప్లయితొలగించండి
 15. కడుపుతోనున్న కోడలి కత్తగారు
  బహు రుచికరము లగుపిండి వంటలొండ
  కరకర మనెడి యాజంతికనుమరియు,ప
  కోడిని కరకర నమిలె కోడలమ్మ.
  బల్లూరి.ఉమాదేవి.
  19/4/15

  రిప్లయితొలగించండి
 16. ఉల్లి,మిరపల ముక్కలు నల్లికలచె
  శనగ పిండిచే గలిసి విశాలమైన
  నూనె బాణిలి లోకాలి నోటిలో ప
  కోడిని కరకర నమిలె కోడలమ్మ

  రిప్లయితొలగించండి
 17. అత్తపెత్తనమందున ?చిత్తమనుచు
  క్రొత్తకోడలు కొడుకెంచు కోర్కె చేత
  మెత్తబడకున్న-ఉల్లియు,మిరపతో-ప
  కోడిని కరకర నమిలె కోడ,లమ్మ

  రిప్లయితొలగించండి
 18. అల్లు డను బంధ మింటను నల్లుకోగ?
  తీపివంటలతో బాటు-తీరికగను
  బజ్జి,చిప్సులు,జతగాను వడియములు-ప
  కోడి కరకర నమిలె?కోడ-లమ్మ|

  రిప్లయితొలగించండి
 19. పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ తాజా పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  నాగరాజు రవీందర్ గారూ,
  మీ థాయిలాండ్ కోడలి పూరణ బాగున్నది. అభినందనలు.
  మీ మూడవ పూరణ కూడ బాగున్నది. ‘కాపు+ఉంచెను’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘కాపుగా నుంచెఁ గోడలి గారె నొకటి’ అనండి.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  అమెరికాలో ఉన్నా ననిపించుకున్నారు. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘తినెడా...’ ?
  *****
  బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వండ’ను ‘ఒండ’ అన్నారు. ‘పిండివంట లిడగ’ అనండి.
  *****
  కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 20. గురుదేవులకు ధన్యవాదములు.
  తినెడు +ఆ=తినెడా (కాదా మాష్టారూ?)

  రిప్లయితొలగించండి
 21. సూర్యనారాయణ గారూ,
  అర్థ మయింది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 22. వెక్కసంపు మాటలనుచు వెక్కిరించు
  ఏమి తెలియదు నీకంచు నేడిపించు
  అత్త నేమి యనగ లేక హస్తగత చె
  కోడిని కరకర నమిలె కోడలమ్మ

  రిప్లయితొలగించండి
 23. పంచ దారను పాకమ్ము బట్టి యత్త
  మూసలోబోసిచేసెను ముచ్చ టైన
  చిలకలను కోడిపుంజుల చిత్రముగను
  కోడిని కరకర నమిలె కోడలమ్మ !!!

  రిప్లయితొలగించండి
 24. వాడి దయ్యంబు బట్టిన వనితకైన
  కోడలొకయెడ నూగుచు కూతలిడుచు,
  నింట బెంచెడి పుంజును,నేర్పు బట్టి
  కోడిని కరకర నమిలె కోడలమ్మ!

  పిండి వంటలు జేయుచు పేర్మితోడ
  సెనగ పిండికి నుల్లియు,చెలగు మిర్చి
  కలిపి,బాణలి వేగిన కమ్మనౌ,ప
  కోడిని కరకర నమిలె కోడలమ్మ

  అత్తయింటిలో దాచెను నందకుండ
  వేడివౌ పకోడిల నొక పెద్దకుండ
  కోడలి కిడక,తెలిసియు కుండలో,ప
  కోడిని కరకర నమిలె కోడలమ్మ

  కొత్తకోడలు రాగను నత్తగారు
  యింపు గాగను కోడిని నేర్పు వండి
  పెట్ట,నామెయు,నాత్రాన,వేడ్కమీర
  కోడిని కరకర నమిలె కోడలమ్మ

  రిప్లయితొలగించండి
 25. అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మంద పీతాంబర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
  మీ పూరణలన్నీ బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి