15, ఏప్రిల్ 2015, బుధవారం

సమస్యా పూరణము - 1648 (రణము కవులకు కీర్తికరమ్ముగాదె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది....
రణము కవులకు కీర్తికరమ్ముగాదె.
(ఆకాశవాణి వారి సమస్య)

28 కామెంట్‌లు:

  1. వ్యాకరణమును చక్కగా నభ్యసించి
    పద్య రచనమ్ము చేయుడు బాగుగాను
    పద్యమేగ మనతెలుగు భాషకాభ
    రణము - కవులకు కీర్తి కరమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  2. పండి తోత్తము లనుగన్న భరత భూమి
    కలము హలముగ దున్నిన కవన పంట
    చదివి ముదమందు జనులకు సంతస ప్రహ
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  3. క్షమించాలి మూడవ పాదం
    చదివి ముదమందు జనులకు చక్కని ప్రహ
    రణము " అంటే బాగుండే దేమొ

    రిప్లయితొలగించండి
  4. పద్య రచనలు జేయంగ ప్రధమముగను
    భద్రముగ నేర్చు కోవలె వ్యాకరణము
    విమల యశమును బొందగా విషయ సంస్మ
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె !!!

    రిప్లయితొలగించండి
  5. పోటి తప్పదు యన్నిట పూర్తిగాను
    పోరు నిత్యము గెలువంగ పూన వలయు
    ఓడి పోవరె పండితు లూరకున్న
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె!

    రిప్లయితొలగించండి
  6. పరులు నలుగురు పొగడగ, పరవశించి
    అదటున నెగడకు నెపుడున్, అరయగ యది
    తల్లి భగవతి కృపయను తలపు నాభ
    రణము కవులకు కీర్తికరమ్ముగాదె.

    రిప్లయితొలగించండి
  7. డా.బల్లూరి ఉమాదేవి 15/4/15

    తే.గీ: భాష మీదను గట్టిగ పట్టు యున్న
    వ్రాయగలడలవోకగ వ్రాతలెల్ల/పద్యములను
    సమయ మొదవి నపుడు గొప్పసత్కవులతొ
    రణము కవులకు కీర్తికరమ్ము గాదె.

    రిప్లయితొలగించండి
  8. ప్రశ్నలును సరసమగు పూరణల తోడ
    కవులకును పృచ్ఛకులకును గాదె రణము?
    జనులనలరించి మెప్పించు సదవధాన
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె"

    (సదవధానరణము సాధు ప్రయోగమేనా?)

    రిప్లయితొలగించండి

  9. ,సరససంభాషణాపటిమ చతురసూక్తి
    తేనెధారల నాశువు తేట కవిత
    సమయమెఱిగిన హాస్యమ్ముసద్గురుని చ
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  10. రణము లైనను కైతల, రమ్యమైన
    పూరణములైన, పద్యాల తోరణములు
    గాని వాణి యాడెడు భవ్యమైన యావ-
    రణము! కవులకు కీర్తికరమ్ముగాదె.

    రిప్లయితొలగించండి
  11. మంచికవితలు ప్రజఁజేరి యంచితముగ
    విలువలను పెంచు జగతిన విశ్రుతముగ
    రమ్య కవితల చేకొను ప్రభుని యధిక
    రణము కవులకు కీర్తికరమ్ముగాదె

    రిప్లయితొలగించండి
  12. కె,,స్,గురుమూర్త్ఆచారి గారి పూరణ
    సాహితీ క్షే్త్రమైనట్టి శంకరాభ
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె
    సత్కవీశ్వరు లన్నకర్షకులు నేడు
    మంచి కవితల పంట పండించ గలరు

    రిప్లయితొలగించండి
  13. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
    కవులకు కీర్తి తెచ్చే ఆభరణం పద్యం అంటూ మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
    *****
    రాజేశ్వరి అక్కయ్యా,
    చదివి సంతోషించే జనాలపై ప్రహరణం (దెబ్బ) కవికి కీర్తి కారణ మెలా అయింది? ‘కవనపంట’ అని సమాసం చేయరాదు. మీ పద్యానికి నా సవరణ....
    పండితోత్తములను గన్న భరతభూమి
    కలము హలముగ దున్నిన కవనఫలము
    చదువు జనుల యజ్ఞానము వదలెడి ప్రహ
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె.
    *****
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘కృతికరణము’ కీర్తి తెచ్చు నంటూ మీరు చేసిన మొదటి పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘యతి ప్రాసలతో రణము’ అంటూ చెప్పిన రెండవ పూరణ కూడ బాగున్నది. అయినా అభ్యాసదశలో నున్న కవులకే యతి ప్రాసలతో రణం కాని, చేయితిరిగిన కవులకు అవి దాస్యం చేస్తాయి కదా!
    *****
    శైలజ గారూ,
    ‘విషయం’ ఉన్న కవిత్వం కీర్తి తెస్తుందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    టేకుమళ్ళ వెంకటప్పయ్య గారూ,
    పాండిత్యస్పర్థ కవులకు కీర్తి తెస్తుందన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘తప్పదు+అన్నింట’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పోటి తప్ప దన్నింటను పూర్తిగాను’ అనండి.
    *****
    పి.యస్.ఆర్. మూర్తి గారూ,
    మంచితలంపు అనే ఆభరణంతో మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    రెండవ పాదాన్ని ‘అదటున నెగడక యెపుడు నరయగ నది’ అనండి.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    ‘పట్టు+ఉన్న’ అన్నప్పుడు యడాగమం రాదు. ‘పట్టు గలుగ’ అనండి. మూడవ పాదాన్ని ఇలా మార్చితే బాగుంటుందని నా సలహా... ‘సమయ మొదవి నపుడు శాస్త్రచర్చలందు’.
    *****
    పుష్యం గారూ,
    అవధాన మంటేనే అష్ట, శత, సహస్ర దళ పద్మవ్యూహం. ప్రవేశ నిర్గమనోపాయాలు తెలిసి ఉంటేనే ఆ రణంలో విజయం. సదవధానరణంపై మీ పూరణ చాలా బాగున్నది. అభినందనలు.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    గురుచరణసేవ కీర్తికర మన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    వాణి నర్తించే ఆవరణం అంటూ మీరు చెప్పిన పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    నైపుణ్యంతో పాటు దేవుని ప్రాపు ఉండాలన్న మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. యస్. గురుమూర్తి ఆచారి గారూ,
    మంచి పూరణ అనే పండించారు. బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  14. mallelavaari pooraalu
    1, కవులు తా సమస్యలకును కమ్ర రీతి
    పద్యములను పూరణములు వాసి కెక్క
    జేయ సభలను నవధధానసీమ జరుగు
    రణము - కవులకు కీర్తి కరమ్ము గాదె
    2,

    రిప్లయితొలగించండి
  15. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    అవధానరణంపై మీరు చెప్పిన పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  16. పద్య ములువ్రాయ సరియగు పద్ధ తినిల
    తెలుపు ఛందము బాగుగ తెలిసి కొనుచు
    భాష శుద్ధత గలిగించు భవ్య వ్యాక
    రణము కవులకు కీర్తి క రమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  17. నమస్కారములు
    సవరణ జేసి నందులకు గురువులకు ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  18. కృష్ణరాయలు కవులన తృష్ణగాన
    ఆదరించగ రచనలు మోద మొసగ
    నాటి సంస్కృతి కీర్తిని చాటెడి ప్రచు
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  19. కావ్య మందున వాగ్ధార కదలి పార
    తరచి చూచు విమర్శకోద్దండు లెల్ల
    నెరిగి సంతృప్తి జెందుచు నరుగు యధిక
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె!

    రిప్లయితొలగించండి
  20. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    కె. ఈశ్వరప్ప గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. యతుల మన్నించి ప్రీతి నత్యాదరమునఁ
    బ్రాసలౌదలఁ దాల్చి నిర్వ్యాజ భక్తిఁ
    గావ్య కన్యకకుం గూర్చఁగల యలంక
    రణము కవులకు కీర్తికరమ్ముగాదె !

    రిప్లయితొలగించండి
  22. డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణమే బ్లాగుకు అలంకరణం. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  24. మల్లెల సోమనాథ శాస్త్రి గారి పూరణ
    2.కావ్య రచనకు గోప్పగా ఖ్యాతి నోంది
    సరసమగు సమస్యల పూర్తి సరసరీతి
    సలుప పాండిత్యమున జరుగు పద్య
    రణము కవులకు కీర్తి కరమ్ము గాదె

    రిప్లయితొలగించండి
  25. శంకరార్యుల సాహితీ సభయె " బ్లాగు "
    నిత్యమింతయు దప్పక నీమముగను
    సరస పూరణముల జేయ " శంకరాభ
    రణము " కవులకు కీర్తి కరమ్ము గాదె.

    రిప్లయితొలగించండి
  26. మల్లెల సోమనాథ శాస్త్రి గారూ,
    మీ రెండవ పూరణ బాగున్నది. అభినందనలు.
    మూడవపాదంలో గణదోషం. ‘సలుప పాండిత్యమున నెప్డు జరుగు పద్య...’ అందామా?
    *****
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ వంటి కవుల వల్లనే శంకరాభరణానికి కీర్తి వచ్చింది. పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి