29, ఏప్రిల్ 2015, బుధవారం

న్యస్తాక్షరి - 29

అంశం- భూకంపము.
ఛందస్సు- తేటగీతి
నాలుగు పాదాల మొదటి అక్షరాలు వరుసగా 
‘భూ - కం - ప - ము’ ఉండాలి.

31 కామెంట్‌లు:

 1. భూమి లోపల వత్తిడి ముమ్మరమవ
  కంపనమ్ములు పుట్టగ ముంపు కలుగు
  పగులు భూమి పొరలు కూలు భవనములును
  ముక్కలౌ నొక్క క్షణములో మొత్తమంత

  రిప్లయితొలగించండి
 2. భూరి పాపము బెరిగిన పుడమి పైన
  కంప మొనరించ భుజము దిగ్గజము లంట
  పరమ భీతిగ మార్చిన భయము గలుగు
  ముదము గూర్చగ జగతిని ముక్తి నిడగ

  రిప్లయితొలగించండి
 3. భూత పంచకమున తాను బూతమయ్యె
  కంట దాల్చి తాఁ గావక కదిలిపోయె
  గిలి పోయె తనకు తాను వగపు కూర్చి
  మునుపటి పలుకు భువి క్షమా మూర్తి యనుట!!

  రిప్లయితొలగించండి
 4. భూమి, గుండెల ద్రవ్వుచు బోర్లు వేసి
  కంటికింపగు వనముల కాల్చి కాల్చి
  పసిడి పంటలఁ బొలముల పాడు సేయ
  ముక్త వాత్సల్య మూర్తియై ముప్పు దెచ్చె

  భయద సంరంభ క్రోధ సంభరిత యగుచు
  ఫటఫటార్భటి నూగుచు భగ్న పృథివి
  భద్ర కాళికా ప్రతి రూప భస్త్ర యగుచు
  ప్రాణి కోటిని పరిమార్చు ప్రళయ యవదె

  అందువలన
  ప్రకృతి ధర్మములనతిక్రమణ వలదు
  వలదు యాసల కగణిత బలమునివ్వ
  ఇవ్వనిటులనె ప్రాణుల కెడ్డ మగును
  అగును శుభము హద్దు లెరుగు నంతవరకు

  రిప్లయితొలగించండి
 5. దయచేసి రెండవ పద్యం మూడవ పాదం
  భద్రకాళికావేశిత. అనియు
  నాల్గవపాదం ప్రాణికోటిఁపరిహరించు అనియు
  ఉండాలని మనవి

  రిప్లయితొలగించండి
 6. చంద్రమౌళి సూర్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  ‘వత్తిడి’ కాదు... ‘ఒత్తిడి’ ... ‘భూమిలోపల నొత్తిడి’ అనండి.
  *****
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  జిగురు సత్యనారాయణ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  అశ్వత్థ నారాయణ మూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. కొనసాగింగా వ్రాసిన పద్యాలు చాలా బాగున్నవి. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 7. చంద్రమౌళిగారు పద్యంలో మూడవపాదం ఒకసారి చూసుకోవాలి

  రిప్లయితొలగించండి
 8. భూమి కంపించు లోపలి పోటుకతన
  కంపనలు ధృతం బైనట్టి కారణమున
  పగులు లేర్పడి భూమిపై ప్రజల భవన
  ములుధరణిఁగూలు వారాసి పొంగిపొరలు

  రిప్లయితొలగించండి
 9. భాగవతుల కృష్ణారావు గారి పూరణ

  భూమి పొరలందు కదలిక భూత గతిని
  కంపనము గూర్చ విధ్వంస కారణమయి
  పలు విధమ్ముల భవనాల,ప్రజల గూల్చ
  మునిగి రెందరొ దు:ఖ సముద్ర మందు

  రిప్లయితొలగించండి
 10. భూమి లోపలి పొరలందు భూరిగాను
  కంపనము వచ్చిన నది భూకంపమగుచు
  పగులు లేర్పడి జరుగును ప్రాణహాని
  ముప్పు ముంచుకు వచ్చును గొప్పగాను!!!

  రిప్లయితొలగించండి
 11. భూమి లోపల వత్తిడి భూరి యుండ
  కంపనము మొద లగుచుండి కటువు గాను
  పగిలి భూమి బీ టలు బీ ట లగుచు మిగుల
  ముప్పు గలిగించు బ్రజలకు మూర్తి ! గనుము

  రిప్లయితొలగించండి
 12. భూమి భారము మోసెడి భూమితల్లి
  కంపనమొనరింప గతియు గానమిలను
  పచ్చ పచ్చని తరువులు వడలి పోవు
  ముప్పు దప్పదు ప్రజకు పుడమి యలుగ/కినియ

  రిప్లయితొలగించండి
 13. శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  చంద్రమౌళి సూర్యనారాయణ గారి పద్యం మూడవపాదంలో నాకే లోపమూ కన్పించడం లేదు.
  *****
  అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  భాగవతుల కృష్ణమూర్తి గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  శైలజ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  *****
  పోచిరాజు సుబ్బారావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 14. డా. బల్లూరి ఉమాదేవి గారూ,
  మీ పూరణ బాగుంది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 15. నాగరాజు రవీందర్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. భూమి లోపల నుష్ణంబు పోరుసలుప?
  కంపనాలచె నేరుగ కదలికలచె
  పగులు లేర్పడి నాశనపాశ ముంచి
  మునుగు జీవుల ప్రాణాల ముప్పుదెచ్చు
  2.భూత భవిషత్తు లందున ఘాతకాన
  కంట కంబుగ మార్చెడి కలత లందు
  పలుక రించక భయమును గలుగ జేసి
  ముప్పు జీవులకొనగూర్చ?చెప్పతరమ?

  రిప్లయితొలగించండి
 17. భూభ్రమణమున నుండెడు పుడమి కేల
  కంపనమ్ములు? గోవుపై కదలు దోమ
  పట్టి పీడించి తాను కంపరము రేప
  ముడిచి తనువుఁ గంపనలిడు పోలికందు!

  రిప్లయితొలగించండి
 18. తే.గీ.భూతము,పిశాచగణములు పోగుయవ్వ
  కంస వారసులధికులై కాపుగాయ
  పతనమవ్వునే ప్రకృతికి పచ్చదనము
  ముదము కల్గువీటినినీట ముంచి నపుడు.

  రిప్లయితొలగించండి
 19. చంద్రమౌళి గారూ, శంకరయ్య గారూ, నేను పొరబడ్డాను. మన్నించాలి

  రిప్లయితొలగించండి
 20. కె. ఈశ్వరప్ప గారూ,
  మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
  ‘చే’ ప్రత్యయాన్ని రెండుచోట్ల హ్రస్వంగా ప్రయోగిచారు. అది దోషం. ‘కంపనములచే నేరుగ కదలికలను’ (తృతీయార్థంలో ద్వితీయ) అనవచ్చు.
  ‘భవిష్యత్తు’ను ‘భవిషతు’ అన్నారు. ఆ పాదాన్ని ‘భూత భావికాలములందు ఘాతకముల’ అనండి.
  *****
  గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
  ఏమి కార్యకారణ సంబంధం? ఎంత చక్కగా వివరించారు! చాలా బాగుంది మీ పూరణ. అభినందనలు.
  *****
  పిరాట్ల ప్రసాద్ గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  కొన్ని లోపాలు. మీ పద్యానికి నా సవరణలు చూడండి.....
  భూతము,పిశాచగణములు ప్రోగుపడగ
  కంసవారసు లధికులై కాపుగాయ
  పతనమైపోవు ప్రకృతికి పచ్చదనము
  ముదము కల్గు వీటిని నీట ముంచి నపుడు.
  *****
  శ్రీఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
  ‘ప్రమాదో ధీమతా మపి!"

  రిప్లయితొలగించండి
 21. భూమిగర్భాన కలవరము లుబుకగను
  కంపముల్ కల్గె,విననాయె గర్జితములు
  పగిలి కూలెను భవనముల్ వాని క్రింద
  ముడుగుపడిరి వేలాదిగ పురజనమ్ము

  రిప్లయితొలగించండి
 22. కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 23. భూమి కంపించగను పంచ భూతములవి
  కంటి రెప్పను వాల్చెడి కాల మందు
  పట్ట వశము కాని యపార పరిధి తోడ
  ముప్పు తిప్పలుగజనము న్ముంచి వేయు

  రిప్లయితొలగించండి
 24. గుండా వెంకటసుబ్బ సహదేవుడు గారు మీ పూరణ తాత్పర్యం వివరిస్తారా ?

  రిప్లయితొలగించండి
 25. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవిమిత్రబృందమునకు నమస్సులు.

  మొదటి పూరణము:
  భూనభో౽౦తరమధ్యమ్ము భోరుమనెడి
  కంపనోద్భూత విలయ సంఘట్టనములు
  ల్లెలం బట్టణమ్ములఁ బగులఁ జీల్చి,
  ముప్పుఁగలిగించె నేపాళభూమికకట!


  రెండవ పూరణము:
  భూమిజనదుష్కృతోద్ధృతస్ఫోటజనిత
  కంపితోద్విగ్ననేపాళఘనచరిత్ర
  తనమాయెను భూకంప భండనమున!
  ముక్తజీవావసధులైరి భూమిజనులు!!

  రిప్లయితొలగించండి
 26. మిత్రులు శ్రీ కంది శంకరయ్యగారికి, సుకవిమిత్రబృందమునకు నమస్సులు.

  మొదటి పూరణము:
  భూనభో౽౦తరమధ్యమ్ము భోరుమనెడి
  కంపనోద్భూత విలయ సంఘట్టనములు
  ల్లెలం బట్టణమ్ములఁ బగులఁ జీల్చి,
  ముప్పుఁగలిగించె నేపాళభూమికకట!


  రెండవ పూరణము:
  భూమిజనదుష్కృతోద్ధృతస్ఫోటజనిత
  కంపితోద్విగ్ననేపాళఘనచరిత్ర
  తనమాయెను భూకంప భండనమున!
  ముక్తజీవావసధులైరి భూమిజనులు!!

  రిప్లయితొలగించండి
 27. పల్లా నరేంద్ర గారూ,
  మీ పూరణ బాగున్నది. అభినందనలు.
  (అన్నట్టు వరంగల్‍లో గతంలో విజయాప్రెస్ నిర్వహించిన కీ.శే. పల్లా దుర్గయ్య గారు ‘వినగదప్ప వెఱ్ఱివెంగళప్ప’ అన్న మకుటంతో వ్యంగ్యపద్యాలు వ్రాసారు. వారు మీకేమైనా బంధువా?)
  *****
  గుండు మధుసూదన్ గారూ,
  ఈనాటి పూరణలలో మీవి ఉత్తమపూరణలు... ఏమా శబ్దసంపద! ఏమా ధారాశుద్ధి! ఏమా భావవైశిష్ట్యం!
  హృత్కమలవికసనాత్తల
  సత్కవితారచనసూర్య! సద్గుణగణసం
  పత్కలితలలితహృదయ! స
  రిత్కలలహరీవిలాసకృతి! మధుసూదన్!

  రిప్లయితొలగించండి
 28. నమస్తే మాస్టరు గారూ

  నేను పద్యరచన చేయగలగడం కేవలం మీ ప్రోత్సాహం తోనే సాధ్యమయింది. మీకు నేను సదా ఋణపడి వుంటాను.
  మా కుటుంబమంతా ఎక్కువగా పాలమూరు జిల్లాలోనే విస్తరించి ఉన్నది. పల్లా దుర్గయ్య గారితో నాకు తెలిసి మాకు బహుశా దగ్గరి బంధుత్వము ఏమి లేదనుకుంటాను.

  రిప్లయితొలగించండి
 29. ధన్యుఁడను శంకరయ్యగారూ! మీ కందపద్యరచనపటిమ అనన్యసామాన్యము. వాత్సల్యముతో నభిమానముతో నాకు మీరీ యభినందన పద్యకుసుమమునందించినందులకు నేను సదా కృతజ్ఞుఁడను. ధన్యవాదములతో...భవదీయమిత్రుఁడు...గుండు మధుసూదన్.

  (అంతర్జాలావరోధముచే, విద్యుదభావముచే నాలస్యముగా స్పందించినందులకు మన్నింపఁగలరు)

  రిప్లయితొలగించండి
 30. గుండు మధుసూదన్ గారూ,
  నా పద్యం మీకు నచ్చినందుకు సంతోషం!

  రిప్లయితొలగించండి