15, ఏప్రిల్ 2015, బుధవారం

పద్య రచన - 880

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

17 కామెంట్‌లు:

  1. జగతికి గురువట శంకరు
    డాగమములు తెలిసి యుండి యమ్మను గాంచన్
    యుగములు మారిన,జననికి
    తగులము నొందుచును జేయ దహన క్రియలన్

    రిప్లయితొలగించండి
  2. శంకరుని కొమరునిగ గాంచి
    తల్లి పొందేను ముక్తి మార్గమును
    ఆ ఆది నాథుడు పుత్రుడైన
    తపము ఫలించిన శుభవేళ !


    శుభోదయం
    జిలేబి

    రిప్లయితొలగించండి
  3. అక్కయ్య గారూ, ఒకటీ, మూడూ నాలుగు పాదాలు హ్రస్వంతో మొదలయి రెండోపాదం మాత్రం దీర్ఘంతో మోదలయింది. అది పొరపాటు.

    రిప్లయితొలగించండి
  4. బల్లూరి ఉమాదేవి గారి పద్యం....

    శంకరభగవత్పాదుల సమ్ముఖమున
    కన్ను మూసెను దృప్తిగ కన్న తల్లి
    ధన్యతను గాంచె నామాత ధరణి యందు
    ముదమున గొని పోవ విమాన మొచ్చె గాదె.

    రిప్లయితొలగించండి

  5. తల్లి రుణసును దీర్చగ తనయులైన
    యాదిశంకరు లరుదెంచి రంత్యఘడియ
    లందు తెచ్చె విెమానము నాత్మజేర్చ
    హరునిధామమ్ముకైలాసగిరి నిలయము

    రిప్లయితొలగించండి
  6. తల్లి యవసానకాలమై తల్లడిలగ
    వచ్చి వ్రాలిరి శంకరు లిచ్చి నట్టి
    మాట చొప్పున క్షణములో మాత యొద్ద
    జగతి గురువైన తల్లికి స్వజుడు కాదె.

    తల్లి శిరమును తొడమీద దాల్చి నంత
    కనుల వెలుగులై యార్యాంబ కనులు విప్పి
    బిడ్డ స్పర్శకు పులకించె ప్రీతి తోడ
    చింత లేదిక స్వర్గము జేరుదు నని.

    మాతృదేవత ముక్తికై మాల్మితోడ
    చేసి కృష్ణాష్టకమ్మును చెంత నిలిపె
    శంఖచక్రాబ్జహస్తుని శంకరయతి
    స్వర్గమును జేర్చ విష్ణుపార్షదులు వచ్చి.

    రిప్లయితొలగించండి
  7. ఆదిశంకరార్యుల తల్లి యాత్మకొరకు
    దివ్య లోకాలఁ జేర్చగ తేలి వచ్చె
    దేవ దూతల తోడుగ దివ్య రథము
    పుత్ర రత్నంపు ప్రార్థనల్ పొల్లు పోక!

    రిప్లయితొలగించండి
  8. అవును కదా చక్కగా గుర్తు చేశారు నేను గమనించనే లేదు సోదరులు శ్రీ శర్మ గారికి ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  9. తల్లి కిచ్చిన మాటను తప్పకుండ
    యాది శంకరు లరుదెంచె నామె కడకు
    సుతుని జూచుచు నాతల్లి సురిగి పోవ
    సత్య లోకమ్ము జేర్చెను శంకరుండు !!!

    రిప్లయితొలగించండి
  10. జగతికి గురువట శంకరు
    నిగమములు తెలిసి యుండి నెమ్మిని గాంచన్
    యుగములు మారిన జననికి
    తగులము నొందుచును జేయ దహన క్రియలన్

    రిప్లయితొలగించండి
  11. తల్లికిచ్చిన సమయముఁదలచి మదిని
    యంతిమక్రియల్ శంకరు డాచరించ
    దివ్య మౌవిమానమ్మున దివికి చనియె
    శంకరుని తల్లి యాత్మతా సంతసముగ

    రిప్లయితొలగించండి
  12. రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో పద్యాన్ని వ్రాశారు. అభినందనలు.
    శ్రీఆదిభట్లవా రన్నట్లు కందపద్య నియమం తప్పింది. మీ సవరణ బాగుంది. కాకుంటే ‘శంకరు’ అని ప్రత్యయం లేకుండ వ్రాశారు. క్రింది విధంగా సవరిస్తే సరి!
    జగతికి శంకరుడు గురువు
    నిగమమ్ముల నెల్ల దెలిసి నిజమాత గనన్...
    *****
    జిలేబీ గారూ,
    _/\_
    *****
    శ్రీ ఆదిభట్ల కామేశ్వర శర్మ గారూ,
    ధన్యవాదాలు.
    *****
    డా. బల్లూరి ఉమాదేవి గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    ‘వచ్చె’ను ‘ఒచ్చె’ అన్నారు. అది గ్రామ్యం కదా! ‘ముదమునన్ వచ్చెను విమానము గొనిపోవ’ అనండి.
    *****
    కెంబాయి తిమ్మాజీ రావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    మిస్సన్న గారూ,
    చక్కని ఖండికను అందించారు. అభినందనలు.
    *****
    గుండా వేంకట సుబ్బ సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    శైలజ గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    ‘తప్పకుండ| నాదిశంకరు...’ అనండి.
    *****
    అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. చిత్ర మందున గలయట్టి శిష్టు డరయ
    యపర శంకరు డా తడు హర్ష ! కనుము
    వాని తల్లిని గొనిపోవ పైన జూడు
    సిధ్ధముగ నుండె గగనాన శివుని గణము

    రిప్లయితొలగించండి
  14. అద్వైతామృతధారఁ బంచుచు విశాలాసేతుశీతాద్రిలో
    విద్వన్మూర్తుల పామరప్రజలకున్ వేదాంత సద్బోధచే
    విద్వేషంబుల బాపి ధర్మమిల శోభిల్లంగ వాక్రుచ్చితే
    మద్వాక్యంబుల సంస్తుతించెదను శ్రీమఛ్ఛంకరాచార్యులన్.

    తల్లికి మాటనిచ్చితి గతమ్మున తానవసాన దుర్దశన్
    తల్లడిలంగనున్నదిక తత్క్షణమేగి ప్రశాంత వృత్తి సం
    ధిల్లఁగజేసి శంకరుల దివ్యపదాంబుజ సన్నిధానమం
    దుల్లము శాంతిఁ బొందు ఘనయోగము నేర్పడ జేసివచ్చెదన్.

    హరి హర రూపమ్ముల గని
    పరవశమున మేనదెల్ల వణకఁగ మది సు
    స్థిరతను గని ముక్తి పరం
    పర కిదె యవిభాజ్యమైన వారధి యయ్యెన్.

    రిప్లయితొలగించండి
  15. "పాల సంద్రములోనఁ బన్నగేంద్రుని వేయి
    ...........పడగల నీడలోఁ బవ్వళించి
    హరి చందనముతోడ నలరారు మేనితో
    ...........వనమాల సౌరుతోఁ బరిఢవిల్లి
    భుజములకిరు పార్శ్వముల నున్న శంఖ చ
    ...........క్రాల తేజస్సుతోఁ బ్రభల నీని
    భక్తి నొడిని జేర్చి - పతి పాదపద్మమ్ము
    ...........లొత్తు శ్రీలక్ష్మితో నుల్లసిల్లి

    నీల ధారాధరచ్ఛాయఁ గ్రాలు శౌరి
    మణిమయ కనత్కనక రత్న మకుటధారి
    సకల దైత్యారి - శ్రీహరి - స్వామి శార్ఙి
    సత్కరుణ తోడ మాకుఁ బ్రసన్నుఁడగుత"

    అనుచు తన తల్లి కొఱకునై యార్తి తోడ
    శంకరుఁడు మాధవుని గూర్చి సన్నుతింప
    దేవదేవుఁడు ప్రీతుఁడై దివ్యమయిన
    రథమునొకదానిఁ బంపె నార్యాంబ కొఱకు

    అనుపమ స్మిత చంద్రికలెనయు శుభ్ర
    వదన సీమలతోఁ జాల వన్నెలీను
    విష్ణు దూతల బృందమ్ము పేర్మినంత
    భవ్య రథముపై నచటకు వచ్చి నిలిచె


    సాత్వికాకారులౌ విష్ణుజనులఁ గాంచి
    చేతమందునఁ దల్లి నిశ్చింత నొంది
    శ్రీహరి స్వరూపమునే స్మరించుచుండి
    యురు ప్రశాంతత సల్పెఁ బ్రాణోత్క్రమణము !

    దివ్యదేహముఁ దాల్చి యా తేరు పైన
    విష్ణుజన బృందములు గారవించుచుండ
    నంతరిక్ష పథమ్మున నార్యమాంబ
    కుశలయై చేరె నంత వైకుంఠ సీమ !

    రిప్లయితొలగించండి
  16. పోచిరాజు సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.
    *****
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ పద్యాలు మనోజ్ఞంగా ఉన్నాయి. అభినందనలు.
    *****
    డా. విష్ణునందన్ గారూ,
    కావ్యామృతరసాస్వాదనకు అవకాశం ఇచ్చే అత్యుత్తమ పద్యాలను అందించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి