శరణం పండిత మానసాపహరణం శశ్వద్యశఃకారణం సరసానందద వాగ్విలాస చరణం, శబ్దార్థ సంపూరణమ్ | చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం ‘శంకరా భరణం’ నిత్యమహం స్మరామి విలసద్ వాగ్దివ్య సింహాసనమ్ ||

శనివారం 21 జనవరి 2012

లక్కాకుల వారి సాయి షష్ఠ్యంతాలు

6 వ్యాఖ్యలు
సాయి నాధునికి  " షష్ఠ్యంతాలు "
కం. 
జయ మంగళ శుభ కరునికి
జయతు జయతునిఖిల లోక జగదీశునకున్
జయ పావన శుభ చరితుకు
జయతుజయతు సాయి నాధు చరణ యుగళికిన్

కం. 
జయ బాబా నామునికిన్
జయతు జయతు సాయి రాము సర్వజ్ఞు నికిన్
జయ భక్త జన వరదునికి
జయతు జయతు కరుణామయు చరణ యుగళికిన్

కం. 
జయ సర్వాంతర్యామికి
జయతు జయతు సర్వ కార్య జయ శీలునకున్
జయ శిరిడీ నిలయునికిన్
జయతు జయతు దేవ దేవు చరణ యుగళికిన్

కం. 
జయ యోగీశ్వర వరునికి
జయతు జయతు సాయి కృష్ణ జనార్ధనునికిన్
జయ గీతా చార్యునికిని
జయతు జయతు పరమ గురుని చరణ యుగళికిన్

కం. 
జయ జగదా ధారునికిని
జయతు జయతు జంగమ పతి సాయి శివునికిన్
జయ దీన జనావనునికి
జయతు జయతు లోక ప్రభునిచరణ యుగళికిన్

కం. 
జయ బ్రహ్మార్చిత మూర్తికి
జయతు జయతు దత్త సాయి జ్ఞా నాంభసికిన్
జయ చిన్మయ సందీప్తికి
జయతు జయతు పరమ పురుషు చరణ యుగళికిన్

కం. 
జయ సర్వ వ్యాపనునికి
జయతు జయతు సాయి విష్ణు జలజేక్షణుకున్
జయ నారాయణ విభునికి
జయతు జయతు వేద వేద్యు చరణ యుగళికిన్

కం. 
జయ నిత్య పరం జ్యోతికి
జయతి జయతు సర్వ సిధ్ధి సంభావ్యు నకున్
జయ గుణ సాయి ప్రభునికి
జయతు జయతు సద్గురు వర చరణ యుగళికిన్
 
వెంకట రాజా రావు . లక్కాకుల





6 వ్యాఖ్యలు:

మిస్సన్న చెప్పారు...

జయమగు సాయీశునకును
జయమగు శ్రీ సాయి భక్త సాధు జనులకున్
జయమగు షష్ఠ్యoతములకు
జయమగు లక్కాకు వంశ చంద్ర కళలకున్

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

శ్రీ సాయీశ్వరు కృపకున్
మీ సఖ్యత తోడు గాగ మిస్సన గారూ !
శ్రీ 'శంకరాభరణము' స
దా సత్కవి నిలయమై ముదమ్మొనరించున్

శ్రీ మస్సన్న గారికి ధన్యవాదములు.

కంది శంకరయ్య చెప్పారు...

ఇటువలె మనోజ్ఞ కవిత
ల్ఘటియించిన మిమ్ము మెత్తు లక్కాకుల వెం
కట రాజారావు! దయా
స్ఫుట దృక్కుల సాయి బ్రోచు శుభదాయకుఁడై.

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

కంది వంశ మందు ఘనులైన శంకరా!
మంచి మనసు గల్గు మా సఖుండ!
సాయి నాధు కృపలు చల్లని చూపులు
కురిసి మీకు శుభము గూర్చు గాక!

వసంత కిశోర్ చెప్పారు...

రమ్యమైన రచన - రచియించి నావహో
రామ రామ సాయి - రామ యనుచు !
రాగ మొలుక, సాయి - రాముడే కృపజూపి
రక్ష సేయు ! రాజ - రావు నిన్ను !

వెంకట రాజారావు . లక్కాకుల చెప్పారు...

ఏయది వ్రాయ దలంతురొ
తీయని తెలుగందు దాని దీర్చి రచించే
చాయలు గల మిత్రుడ! శ్రీ
సాయి తమకు శుభమొసగు వసంత కిశోరా !

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి