6, జనవరి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 582 (నామంబులలోన పంగ)

 
కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
నామంబులలోన పంగ నామము  మేలౌ.
ఈ సమస్యను పంపిన పోచిరాజు సుబ్బారావు గారికి ధన్యవాదాలు.

52 కామెంట్‌లు:

  1. శ్రీమంతుఁడు శ్రీహరికిన్
    సామీప్యము నొందఁ గొలువ శత శత సంఖ్యౌ
    నామంబుల , నొసటికిఁ దగు
    నామంబుల లోన పంగ నామము మేలౌ !

    రిప్లయితొలగించండి
  2. శ్రీమాధవు భక్తులకున్
    నామంబులలోన పంగనామము మేలౌ
    నామ మొకటె చాలదు శ్రీ
    ధామమ్మును జేర్చు భక్తి తాత్పర్యంబే

    రిప్లయితొలగించండి
  3. ఆత్మ చింతన:

    మిత్రులారా!
    నిన్నటి నా వ్యాఖ్యలలో "ఆత్మనింద" కూడదని, త్రికరణ శుద్ధి అవసరమని పేర్కొనినాను. త్రికరణ శుద్ధి గురించి భగద్గీతలో 17వ అధ్యాయములో (శ్లో.14, 15, 16) తప్పక అందరూ గమనించ దగినవి - వాటిని చూడండి.

    దేవ ద్విజ గురు ప్రాజ్ఞ
    పూజనం శౌచ మార్జవం
    బ్రహ్మచర్య మహింసా చ
    శారీరం తప ఉచ్యతే (శారీరికమైన తపస్సు లేక శుద్ధి)

    అనుద్వేగకరం వాక్యం
    సత్యం ప్రియ హితంచ యత్
    స్వాధ్యాయాభ్యసనం చైవ
    వాఙ్మయం తప ఉచ్యతే (వాక్శుద్ధి)

    మనః ప్రసాదః సౌమ్యత్వం
    మౌన మాత్మవినిగ్రహః
    భావ సంశుద్ధి రిత్యేతత్
    తపోమానస ముచ్యతే (మనశ్శుద్ధి)

    ఈ విధమైన త్రికరణ శుద్ధి అవసరమని గీతాచార్యుడు చేసిన బోధ యెంతయునూ ఆచరింపదగినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  4. మూర్తి మిత్రమా మీ పద్యం హృద్యం.
    మీరన్నట్లు నేమాని పండితార్యుని పద్యపు ప్రత్యేకత విశిష్టం.

    రిప్లయితొలగించండి
  5. హాస్యం వ్యంగ్యం జోడిస్తూ దుర్యోధనుడు శకునితో అన్నట్లు ఊహ:
    మామా! నీనామమహిమ
    దేమాటలఁ జెప్పలేక నేడ్చితి శకునీ!
    వేమాటల లేలా! నీ
    నామంబులలోన పంగనామము మేలౌ!
    మనవి: పంగనామము=మోసము అనే అర్థంలో; పండితులు నా పూరణకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నవ్వుకోవలసినది.

    రిప్లయితొలగించండి
  6. చక్కని బోధ ! అన్నగారికి ,గురువు గారికి నమస్సులు !

    రిప్లయితొలగించండి
  7. చి.తమ్ముడు నరసింహమూర్తి ఈనాడు ప్రథమ తాంబూలము పుచ్చుకొన్నాడు. శ్రీ చంద్రశేఖర్ గారు కావలసినంత హాస్యమునకు అవకాశము నిచ్చేరు. "పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ గ్రాసములేని కొల్వు కొరగానివి పెమ్మయ సింగధీమణీ!" అని పూర్వము ఒక మహాకవి సెలవిచ్చేరు. తగినంత మోతాదులో హాస్యము కూడ కావలసిందే. అందరికీ శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  8. నేమంబున హరి గొల్చెడి
    ధీమంతులకును సమమగు దృష్టియు, నాయా
    హోమంబుల వేళ నుదుట
    నామంబులలోన పంగ నామము మేలౌ.

    రిప్లయితొలగించండి
  9. సోమా విను కొందరికిని
    నీమంబు విభూతి రేఖ నెన్నుదుటన్నౌ
    రామా మరి కొందరికిని
    నామంబులలోన పంగ నామము మేలౌ.

    రిప్లయితొలగించండి
  10. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, జనవరి 06, 2012 8:41:00 AM

    ప్రేమ నటించుచు లోలో
    నామంబులు దీయు సఖుని నమ్మకు నీవున్
    ధీమమ్మున వాడి కిడుము
    నామంబుల లోన పంగ నామము మేలౌ

    రిప్లయితొలగించండి
  11. ఓం శ్రీ వేంకటేశ్వరాయ నమః

    గోమాయువు నీ నంబై
    హేమాభరణములు సంగ్రహించెడు వేళన్
    క్షేమంబుగ పెట్టెనె !ఆ
    నామంబుల లోన పంగ నామము మేలౌ !

    రిప్లయితొలగించండి
  12. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, జనవరి 06, 2012 9:36:00 AM

    నామము గురువుకు పొందుగ
    నామంబుల లోన పంగనామము 'మేలౌ'
    ధీమంత్ర మెరిగి తీయగ
    నేమాత్రము సంశ యింప రిప్పటి శిష్యుల్

    రిప్లయితొలగించండి
  13. వెంకట రాజారావు . లక్కాకులశుక్రవారం, జనవరి 06, 2012 10:00:00 AM

    శంకరయ్య గారూ!

    నిన్నటి మిస్సన్నగారిని గురించిన ప్రశంస లో ...

    తమ సందేహం 'మేను దెలుగు'...?

    'పరవశించె మిత్రుడా! మేను,దెలుగున మేటి వీవు'(తమరు పూర్తిగా చదివి నట్లు లేదు)

    రిప్లయితొలగించండి
  14. నామమె గురు లఘువుల కిర
    వీ మహి ఛందస్సునకు నదే మూలమ్మౌ
    సామాన్యమె యా వన్నెలు
    నామంబులలోన పంగనామము మేలౌ

    సాత్వికుడైన గురువు (తెల్లని రంగు) మరియు రాజసము కల్గిన లఘువు (ఎర్రని రంగు) కలిగిన ఈ చిహ్నము విశేషములెన్నో మన ఊహకు అందవు కదా!.

    రిప్లయితొలగించండి
  15. కందుల వరప్రసాద్ గారి పూరణ .....

    రామాయణమును బూతని
    యే మాత్రము సంశయింప కిట్టుల దెలుపన్
    నీ మాయ జగతి యందున
    నామంబులలోన పంగనామము మేలౌ.

    రిప్లయితొలగించండి
  16. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘శతశతసంఖ్యౌ’ కంటే ‘శతశతసంఖ్యా/ నామంబులు’ అంటే బాగుంటుందేమో?
    మీ రెండవ పూరణ చమత్కారంగా ఉంది. అభినందనలు.
    ‘నీ నంబై’ .... ?
    *
    పండిత నేమాని గారూ,
    బాహిరచిహ్నంతో ఆంతరంగిక భక్తి ఆవశ్యకతను ప్రబోధించిన మీ మొదటి పూరణ, గురులఘువుల సంబంధాన్ని వివరించిన మీ రెండవ పూరణ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.
    త్రికరణశుద్ధిని ప్రస్తావించిన మీ వ్యాఖ్య బాగుంది. ధన్యవాదాలు.
    హాస్యప్రవృత్తిని (sense of hummer) ఆహ్వానించినందుకు కూడా ధన్యవాదాలు. సమస్యలు ఇవ్వడంలో, పూరించడంలో దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ మధ్య సమస్యలను ఇవ్వడానికి ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించవలసి వస్తుంది. ఎవరి మనోభావాలను నొప్పించవద్దని. అయితే సమస్యా పూరణలను ఒక సరదా ప్రక్రియగా భావించి, సమస్యలోని విపరీతార్థాన్ని గ్రహించకుండా (నొచ్చుకోకుండా) చమత్కారంగా పూరించడం ఆహ్వానించదగింది. స్వస్తి!
    *
    చంద్ర్రశేఖర్ గారూ,
    చమత్కారభరితమైన మీ పూరణ అలరించింది. అభినందనలు.
    ‘మహిమ + అది + ఏ మాటల’ అని పదవిభాగమా? ఇక్కడ సంధి సందేహమే. ‘మహిమ నే మాటల’ అంటే బాగుంటుందేమో? ‘వే మాటల లేలా’ అన్నచోట ‘వేమాట లేలనో’ అంటే ఎలా ఉంటుంది?
    *
    మందాకిని గారూ,
    చక్కని పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    ‘నెన్నుదుటన్నౌ’ .... ‘నెన్నుదుట నగున్/దగున్’ ఆంటే?
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ రెండు పూరణలు చాలా బాగున్నాయి. అభినందనలు.
    *
    వరప్రసాద్ గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. గురువుగారూ అవును నుదుట నగున్ అంటే చాలా బాగుంది. ఈ టన్నులు, మణుగులు బాధ ఉండదు. దన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  18. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! అభినందనలు.

    మీ వ్యాఖ్యలోని ఆంతర్యాన్ని గ్రహించేను. నేను మీతో ఏకీభవిస్తున్నాను. సమస్యలు సాహిత్య ప్రక్రియలే - వినోదము ఉండవలసిందే - అమలిన భావములు ప్రకటించడములో తప్పు లేదు. ఇవి సామాన్య సామాజిక విషయాలను మతేతర విషయాల గురించి చెప్పినంతవరకు బాగానే ఉంటాయి.

    పూర్వ జన్మల సుకృత ఫలము, జగన్మాత యొక్క కరుణా కటాక్షము లేనిదే కవిత్వము పాండిత్యము అలవడవు. అట్టి మనము నిరంతరము వాగ్దేవీ వరివస్యను చేస్తూనే ఉంటున్నాము. అందుచేత మనకు ఇంతో అంతో వాక్శుద్ధి ఉంటుంది. పండిత వాక్యము రిత్త వోవునే అని ఆర్యోక్తి కూడా ఉంది కదా. అందుచేత ఎక్కడ దోషమైన వాక్యాలు భావాలు ఉచ్చరిస్తే ఏది నిజమౌతుందో అని కూడా జాగ్రత్తగా ఉండాలి అని నా ఉద్దేశము.

    అందుచేత ఈ విషయములను మీరు గుర్తు ఉంచుకొనగలరని నా నమ్మకము. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  19. శ్రీ నేమాని వారికీ, మాస్టారికీ ధన్యవాదాలు. మీ సవరణల మీద నావి కొన్ని. ఇప్పుడు ధారబాగుందనిపించింది:
    హాస్యం వ్యంగ్యం జోడిస్తూ దుర్యోధనుడు శకునితో అన్నట్లు ఊహ:
    మామా! నీనామమహిమ
    నేమాటల నుడువఁగలేక నీల్గితి నౌరా!
    వేమాట లేలనో నీ
    నామంబులలోన పంగనామము మేలౌ!
    మనవి: పంగనామము=మోసము అనే అర్థంలో.

    రిప్లయితొలగించండి
  20. కామ క్రోధములు వదలి
    రామాయని పిలచి నంత రంజిల్లు మదిన్ !
    ఏమరు పాటున దురితపు
    నామంబుల లోన పంగ నామము మేలౌ !

    రిప్లయితొలగించండి
  21. పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.
    మీ అభిప్రాయంతో నేను సంపూర్ణంగా ఏకీభవిస్తున్నాను.
    *
    చంద్రశేఖర్ గారూ,
    సంతోషం!
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    పద్యం బాగుంది. కాని పూరణ అన్వయమే కొద్దిగా తికమక పెడుతున్నది.

    రిప్లయితొలగించండి
  22. తమ్ముని అభినందించి
    అన్వయము = " రామ నామం స్మరిస్తే మనసుకు బాగుంటుంది.
    పొరబాటున చెడు నామము అనుకోవడం కంటె అసలు మానెయ్యడం మంచిది " అని నాఉద్దేశ్యమ్ [ అందుకేనేమో " ఆడు వారి మాటలకు అర్దాలే వేరులే " అన్నారు ]

    రిప్లయితొలగించండి
  23. గురువుగారూ నమస్సులు. నా మొదటి పూరణలో మీ సవరణ బాగుంది.
    రెండవ పూరణలో నంబి + ఐ = నంబై అలా సంధి కుదరక పోతే
    నా సవరణ ;

    గోమాయువు నంబియ ? తా
    హేమాభరణములు సంగ్రహించిన వేళన్
    క్షేమంబుగఁ బెట్టెనె ! ఆ
    నామంబుల లోన పంగ నామము మేలౌ !

    రిప్లయితొలగించండి
  24. విశిష్టాద్వైతులయిన శ్రీ వైష్ణవులలో రెండు తెగలు. తెంగల వారి నామమునకు ముక్కు పాదము ఉండి యిరు ప్రక్కల ఉండే పుండ్రములు కనుబొమల నుండి మీదకు వెడల్పుగా సాగుతాయి. వడగల వారి నామములొ పుండ్రములు విరివి తక్కువగా ఉంటుంది. ముక్కు పాదము లేక అర్ధవలయాకారములో రేఖలు ముక్కు మొదట కలుస్తాయి.

    రిప్లయితొలగించండి
  25. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    ______________________________________

    నామంబిదె "రామా" యని !
    నేమంబున దలచుచుండు - నిజ భక్తులకున్
    నేమియు నేమీ నొవ్వదు !
    నామంబుల లోన పంగ - నామము మేలౌ !
    ______________________________________
    నామము = పేరు(జప మంత్రము)
    నేమము = కట్టుబాటు
    నేమి = వజ్రాయుధము
    నామము = బొట్టు
    పంగనామము = వైష్ణవులు ధరించు బొట్టు

    రిప్లయితొలగించండి
  26. 02)
    ______________________________________

    పాములలో వాసుకియును
    భామలలో భర్త నెపుడు - బాధించనిదౌ
    పామరులకు రామా యన
    నామంబుల లోన పంగ - నామము మేలౌ !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  27. 03)
    ______________________________________

    చామలలో సీతా సతి
    మోములలో చందమామ - బోలెడి మోమే
    కామములో రామా యన
    నామంబుల లోన పంగ - నామము మేలౌ !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  28. డా.మూర్తి మిత్రమా! మీ తెన్గల్-వడగళ్ నామ వివరణ అమోఘం. నా చిన్నప్పుడు మా ఇంటికి మురళీకృష్ణమాచారి అని మా అన్నయ్య స్నేహితుడొకడు వచ్చేవాడు. అతను చెప్పేవాడు. జయహో, మరలా మీ ద్వారా ఇపుడు!

    రిప్లయితొలగించండి
  29. 04)
    ______________________________________

    గోముగ జూచే భర్తయు
    నోములు నోచుచు పతియెడ - నెనరును జూపే
    చామయె భార్యలలో కడు
    నామంబుల లోన పంగ - నామము మేలౌ !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  30. రాజేశ్వరి అక్కయ్యా,
    ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ధన్యవాదాలు.
    నడుమ ఎడం ఉండేవిధంగా తీర్చిన తిరుమణి ‘పంగనామం’
    నడుమ ఎడం లేకుండా తీర్చిన తిరుమణి ‘బుంగనామం’
    *
    వసంత కిశోర్ గారూ,
    మీ మూడు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  31. రాజకీయులు :

    05)
    ______________________________________

    స్కాముల మునుగుచు దేలుచు
    హోమంబులు ధనము కొఱకు - నొనరించు చిలన్
    నేమము ,నీతీ ,విడి ,చెడు
    నామంబుల లోన పంగ - నామము మేలౌ !
    ______________________________________
    పంగనామము = మోసము(ప్రజలకు)

    రిప్లయితొలగించండి
  32. వసంత కిశోర్ గారూ,
    మీ 4వ, 5వ పూరణలు కూడా బాగున్నవి. అభినందనలు.
    నాల్గవ పూరణ రెండవ పాదంలో యతి తప్పింది.

    రిప్లయితొలగించండి
  33. 06)
    ______________________________________

    స్వామీ శరణని వేడిన
    ప్రేమగ భక్తులను గాచి - పెన్నిధి నిచ్చే
    స్వామియె కలిగిన నిలలో
    నామంబుల లోన పంగ - నామము మేలౌ !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  34. వసంత కిశోర్ గారూ,
    మీ ఆరవ పూరణ బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  35. శంకరార్యా ! ధన్యవాదములు !

    ఇది మీరు నేర్పిన పాఠమే :
    సరసయతి :

    "అయహల మైత్రి నిట్లు విస్తరించి చెప్పవచ్చును.
    1) అఆఐఔ - యయాయైయౌ - హహాహైహౌ.
    2) ఇఈఋౠఎఏ - యియీయృయౄయెయే- హిహీహృహౄహెహే.
    ౩) ఉఉఒఓ - యుయూయొయో - హుహూహొహో
    ‘తెలుగులో ఛందోవిశేషములు’ - యతిభేదపరిశీలనము నుండి)

    రిప్లయితొలగించండి
  36. వసంత కిశోర్ గారూ,
    పాదాద్యక్షరం ‘నో’. యతిస్థానంలో ‘ను,నూ,నొ,నో’లు ఉండాలి కదా. మీరు ‘నె’ వేసారు. దోషమే కదా!
    ‘నోములు నోచుచు పతియెడ - నెనరును జూపే’ ... ?

    రిప్లయితొలగించండి
  37. హోమంబులు ధనము కొఱకు - నొనరించు చిలన్
    శంకరార్యా ! ధన్యవాదములు !
    ఇక్కడ -"హో "- కి -"ఒ" - కి యతి !

    ఓహో ! నాల్గవ పూరణలో గదూ ! తప్పే !
    నేను రెండవ దానిలో ననుకున్నా !
    సవరిస్తా !

    రిప్లయితొలగించండి
  38. 04 అ)
    ______________________________________

    గోముగ జూచే భర్తయు
    నోములు నోచుచు పతి యెద - నూగుచు దనరే
    చామయె భార్యలలో కడు
    నామంబుల లోన పంగ - నామము మేలౌ !
    ______________________________________

    రిప్లయితొలగించండి
  39. అడ్డ నామంబు బెట్టి తిరపతి కొండ నెక్కంగ
    ఎగ నామంబు బెట్టిన ఫాస్టు దర్శన మనిరి
    హర నామంబును హరీ నామంబు గావింపగ
    నామంబులలోన పంగ నామము మేలౌ.

    రిప్లయితొలగించండి
  40. వసంత కిశోర్ గారూ,
    సవరించినందుకు ధన్యవాదాలు.
    *
    జిలేబి గారూ,
    బాగుంది. మీది వచన కవిత అనుకోమంటారా? సరె .. కానీండి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  41. 07)
    ______________________________________

    సోముడు పొరపడి , గురువుల
    భామను సల్లాపకేళి - పచరించె నహో
    కామార్తి జెంది ; గురునకు
    నామంబుల లోన పంగ - నామము మేలౌ ! ???
    ______________________________________

    రిప్లయితొలగించండి
  42. వసంత కిశోర్ గారూ,
    ‘గురువుకు పంగనామాలు’ అన్న లోకోక్తిని ఎవ్వరూ ప్రస్తావించడం లేదే అనుకున్నా ... ఆ పని మీరు చేసారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  43. క్షేమంబును గూరుచు హరి
    నీమంబున పూజ జేయ నిశ్చల మతితో
    నామ జపము జేయ నుదుట
    నామంబుల లోన పంగ నామము మేలౌ.

    రిప్లయితొలగించండి
  44. నామంబన నమ్మించుట
    నామంబన వంచనయట నామంబనగా
    నేమార్చిదోచుకొనుటట
    నామంబుల లోన పంగనామము మేలౌ!!!

    రిప్లయితొలగించండి
  45. నీమముగ బోరు గొట్టెడి
    కామేశ్వర రావు గారి కామర్సుల క్లాస్
    రూమున హాజరుకు బిలుచు
    నామంబులలోన పంగ నామము మేలౌ!

    రిప్లయితొలగించండి