29, జనవరి 2012, ఆదివారం

సమస్యాపూరణం - 606 (జయజయ యంచు కౌరవులు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసినసిన సమస్య ఇది
జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్.

19 కామెంట్‌లు:

  1. దుర్యోధన,అర్జున రాకను మదిని నెంచి
    శయనానందుడైన యదుననందనుని కలలో
    జయ జయ యంచు కౌరవులు
    సాగిలి మ్రొక్కిరి 'కృష్ణ' మూర్తికిన్

    రిప్లయితొలగించండి
  2. గురువుగారు,

    విద్యను నాకొసంగుమని వేడుచు నుండెదనమ్మశారదా!
    పద్యములందు నేరుపుగ పల్కగ మమ్ముల తీర్చిదిద్దుమా!
    అద్యతనమ్మునూహలను హంగుగ చేర్చుచు పెద్దలొప్పగా
    హృద్యపు వర్ణనాపటిమ హెచ్చగు రీతి వరమ్మొసంగుమా!

    మయసభ చూసి యోర్వకను మాయల జూదము నాడుచుందురే,
    భయమును భక్తి నేర్వకను పాపపు యోచన చేయుచుందురే,
    చయమును కోర, దైవమగు శౌరియె సైన్యము నిచ్చినంతనే,
    జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్.

    రిప్లయితొలగించండి
  3. జయ మతిదుర్లభం బనెడు శంకలు గల్గియు బల్కి రాజిలో
    జయ జయ యంచు కౌరవులు, సాగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్
    నయముగ పాండునందనులు నమ్మక మొప్పగ ధర్మ మొక్కటే
    జయమును గాంచు మాధవుని సన్నిధిలో నని యుత్సహించుచున్

    రిప్లయితొలగించండి
  4. కౌరవ పాత్ర ధారులు భక్తితో...

    నయముగ నేడు వేయునది నాటక మే మరి యందు మిమ్ములన్
    స్వయముగ మేము దిట్టవలె శాపము బెట్టకు మంచు శ్రద్ధతో
    భయమును భక్తియున్ గలిగి భాగవ తోత్తమ గావు మాధవా
    జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్.

    రిప్లయితొలగించండి
  5. నయవచనాలు సుంతవిననట్టి సుయోధనుడాపరాత్పరున్
    రయమునగట్టనెంచగ విరాట్పురుషుండుదయించె విస్మయో
    దయులయి విశ్వరూపశుభదర్శనమోహితనిర్వికారులై
    జయజయయంచుకౌరవులు సాగిలిమ్రొక్కిరికృష్ణమూర్తికిన్

    రిప్లయితొలగించండి
  6. ఉత్తరగోగ్రహణానంతరము సంజయ రాయభారమునకాదిగా కౌరవుల మన: ప్రవృత్తి - యుద్ధానంతరము

    నయముగ తేటతెల్లమయె నాదుపరాక్రమమంచు తన్మదిన్
    భయమురహింపగా దమకు ప్రాప్తము దౌత్యమటంచునెంచి సం
    జయ జయయంచు కౌరవులు సాగిలి - మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్
    ప్రయతులు ధర్మతత్పరులు పాండుతనూజులు భక్తితోడుతన్.

    రిప్లయితొలగించండి
  7. గయునకు రక్ష గూర్తునని గైకొనె బాసను ఫాల్గునుండు దా
    నయమున జెప్ప నొల్లడు వినాశము నైనను లక్ష్యపెట్టడీ
    లయ నెటు నోపునో సరియె రమ్మనె కృష్ణుడు, సంగరమ్మునన్
    జయజయ యంచు కౌరవులు సాగిలి మ్రొక్కిరి కృష్ణ మూర్తికిన్

    రిప్లయితొలగించండి
  8. మిత్రమా రాజారావు గారూ మీ పూరణ చాలా బాగుంది. కానీ నాకో సందేహం. విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడు తక్క మిగిలిన కౌరవులేవరూ చూడలేక పోయారు గదా.

    రిప్లయితొలగించండి
  9. జిలేబి గారూ,
    మంచి భావాన్ని అందించారు. అభినందనలు. మీ భావానికి నా పద్యరూపం .....

    జయమును గోరి యాదవుల సాయముఁ బొందుటకై ధనుం
    జయుఁడు సుయోధనుండు హరి సన్నిధిఁ జేరిరి, వారి రాక ని
    శ్చయముగ నెంచి నిద్రఁ గనె చక్కని స్వప్నముఁ జూచె నందులో
    జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్.
    *
    మందాకిని గారూ,
    మీ సరస్వతీ స్తుతి హృద్యంగా ఉంది. ధన్యవాదాలు.
    మీ పూరణ బాగుంది. వాణి పద్యరచనాప్రావీణ్యం కలిగే వరమిచ్చినట్లే ఉంది. అభినందనలు.
    మూడవ పాదంలో ‘జయమును’ అనేది ‘చయమును’ అని టైపైనట్లుంది.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పూరణ మనోహరంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    చక్కని విరుపు. ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ‘శత్రువుకు శత్రువు మిత్రుడు’ అన్నట్లు చక్కని ఊహతో మంచి పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘.... ఇట్లు దుర్నిరీక్ష్యం బగు నత్తేజోరూపంబుఁ గనుంగొనం గొలఁది గాక సకలజనంబులు నయనంబులు మొగిడ్చి యద్భుతభయానకరసంబుల జొత్తిల్లు చిత్తంబుతోడం గదలకుండ ...’ (భార. ఉద్యోగ. 3-405)

    రిప్లయితొలగించండి
  10. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! మీ పద్యములో (జిలేబి గారి భావమునకు పద్య రూపము) ధనంజయునకు (అర్జునునికి) కొమ్ము (ఉత్వము) తగిలించి ధనుంజయ అని అన్నారు. ఒక మారు పరిశీలించి సవరించండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  11. గురువు గారు,
    ధన్యురాలను.
    చయమును సమూహము అనే అర్థంలో వాడానండి. స్వామిని దర్శించి కూడా దుర్యోధనుడు ఆశీర్వాదం కాకుండా గుంపు బలాన్ని కోరాడు కదా, అర్జునుడి వద్ద కృష్ణుడొక్కడే , మాకు స్వామి సైన్యాన్ని ఇచ్చాడని కౌరవులు సంతోషిస్తారే కానీ బాధపడరు. దైవబలం తెలియక స్వశక్తిని మాత్రమే నమ్ముకుంటారు కదా! స్వశక్తి కి దైవబలం తోడుండాలని వారికి తోచదు.

    రిప్లయితొలగించండి
  12. గురువుగారూ నా సందేహం నివృత్తి చేసినందుకు ధన్యవాదాలు.
    రాజారావు గారూ అభినందనలు.

    రిప్లయితొలగించండి
  13. పండిత నేమాని గారూ,
    నిజమే! అదేమిటో తప్పని తెలిసిననా ‘ధనుంజయ’ శబ్దమే వస్తుంది. మా బంధువులలో ఒకరి పేరు ‘ధనుంజయ్’

    రిప్లయితొలగించండి
  14. శ్రీ శంకరయ్య గారికి

    భావానికి మీరు కట్టిన భాషా బంతి అమోఘం !


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  15. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    01)
    _______________________________________

    నియమము దీరునట్లు, తన - నేస్తుడు వైచిన , చక్ర మడ్డమై
    బయలున క్రుంకినట్లు గను - భాస్కరు డల్లదె మాయమవ్వగాన్
    రయమున పార్థుడే శిరము - రాలగ జేసెను , సైంధవాధమున్
    కుయి కుయి యంచు కౌరవులు - గొల్లున ఘోషలు పెట్టు చుండగా
    జయజయ యంచు కౌరవులు - సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్ !
    _______________________________________
    కౌరవులు = కురువంశ సంజాతులు = ( కౌరవులు, పాండవులు )

    రిప్లయితొలగించండి
  16. వసంత కిశోర్ గారూ,
    పాండవులు కూడా కౌరవులే అనే భావంతో ఎవరైనా పూరణ పంపుతారని ఆరోజు ఎదురుచూసాను. ఇప్పటికి మీరు పంపారు. సంతోషం.
    చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  17. దయగొని మమ్ము చేర్చమని దారుణ రీతిని గోలపెట్టగా
    నయముగ కన్నుగొట్టుచును నందమమొందగ చంద్రశేఖరుల్
    రయమున కాంగ్రెసోత్తములు లాలన సేయుచు కారునెక్కిరే:
    "జయజయ యంచు కౌరవులు సాఁగిలి మ్రొక్కిరి కృష్ణమూర్తికిన్"

    కారు = "తెరాస" చిహ్నము

    రిప్లయితొలగించండి