18, జనవరి 2012, బుధవారం

లక్కాకుల వారి కవిత

నేటి జన్మమున సార్థకత గనుము

మనుజ జన్మము ప్రాప్తించె మనకు సఖుడ !
మరల వచ్చుట కల్ల , యేమైన నేమి
పూర్వ జన్మలు మరల బుట్టు కథలు
తక్కి, నేటి జన్మమున సార్థకత గనుము


చావు తరువాత నేవియున్ లేవు సఖుడ !
నీవు చేసిన మంచియే నిలిచి యుండు
మంచి చెడ్డల మూల్య మిమ్మహిని గాక
చచ్చి స్వర్గాని కేగు ముచ్చటలు విడుము


తేర మాటల బుధుల వాతెరల కన్న
చిన్న సాయమ్ము మిన్నయంచెరుగు మన్న!
సమ సమాజమ్ము కలయయ్యె , సాటి మనిషి
బాధలో నైన తోడ్పాటు బాధ్యత గద !


అరసి జీవిత కాలమ్ము నందు నెంత
మందికి సహాయ మందించి , మంచి జేసి
మించి నీ యాత్మ సాక్ష్య మిప్పించ గలవొ
అనుభవింతువు రెండింత లగు ఫలమ్ము


పిల్చి పేదల కన్నంబు బెట్టు వారు
వస్త్ర దానమ్ము చేయు పావనులు ఘనులు
చదువు చెప్పించు వారు నాపదలు బాపి
బ్రతుకు తెరువులు చూపించు వారు ఘనులు


రోగ గ్రస్తుల కారోగ్య రుధిర మిచ్చి
ప్రాణ దానమ్ము జేసెడు వారు ఘనులు
నీవు చేసిన మంచి రాణించి నీదు
భార్య బిడ్డల బ్రతుకులు బాగు పరచు


రచన
            వెంకట రాజారావు . లక్కాకుల

3 కామెంట్‌లు:

  1. మంచి సందేసాత్మకమైన మీ కవితలు చాలా బాగున్నాయి. రాజారావు గారూ ! ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  2. మంచి సందేసాత్మకమైన మీ కవితలు చాలా బాగున్నాయి. రాజారావు గారూ ! ధన్య వాదములు

    రిప్లయితొలగించండి
  3. వెంకట రాజారావు . లక్కాకులగురువారం, జనవరి 19, 2012 8:13:00 AM

    రాజేశ్వరి గారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి