3, జనవరి 2012, మంగళవారం

సమస్యాపూరణం - 579 (పంది మిగుల చొక్కె)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
పంది మిగుల చొక్కె సుందరాంగి.
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

29 కామెంట్‌లు:

  1. 'సాఫ్టు వేరు ఫీల్డు' చక్కని జీతమ్ము
    చిన్న తనము నందు స్నేహి తుండు
    పెండ్లి యాడు మనిన ప్రేమతో తా వల
    పంది, మిగుల చొక్కె సుందరాంగి.

    రిప్లయితొలగించండి
  2. చిన్న సవరణ తో ...

    'సాఫ్టు వేరు ఫీల్డు' చక్కని జీతమ్ము
    చిన్న తనము నందు స్నేహి తుండు
    పెండ్లి యాడు మనిన వేడ్కతో తా వల
    పంది, మిగుల చొక్కె సుందరాంగి.

    రిప్లయితొలగించండి
  3. చిన్న తనము నుండి స్నేహితు లైనట్టి
    ప్రీతి, రమణు లైరి ప్రేమి కులుగ
    పెండ్లి యాడు మనుచు ప్రీ తియె దావల
    పంది, మిగుల చొక్కె సుంద రాంగి.

    రిప్లయితొలగించండి
  4. బ క సే వలు సేయ సకల భద్రము లొ దవున్ .
    ---------

    రక రకముల నామంబుల
    సకలం బుల కీ శు డైన చండీ నాధున్
    నకళంక మనస్కు త్ర్యం
    బక సేవలు సేయ సకల భద్రము లొదవున్ .

    రిప్లయితొలగించండి
  5. బ్లాగు అయ్యవారు పూరణ ఇవ్వగ
    ఆ దారి పోవు భామ ఇది ఏమి అని
    హాశ్చర్య పోవంగ మురిపంగ పూరించు రే
    పంధీ, మిగుల చొక్కే సుందరాంగి!

    రిప్లయితొలగించండి
  6. నేటి సమస్య:

    పంది రూపు దాల్చి సుందరి ధారుణీ
    దేవి కార్తి దీర్చె దితిజవైరి
    యంత ప్రణయమెసగ నా రక్షకుని వల
    పంది మిగుల చొక్కె సుందరాంగి

    పండిత లక్షణము:

    సకల జీవతతుల సమదృష్టితో జూచి
    యాదరించుచుందు రాత్మవిదులు
    పండితులు వివేక వైభవ శోభితుల్
    భవ్య భావ యుక్త భద్రమతులు

    రిప్లయితొలగించండి
  7. సకలబంధుజనుల సరస సంభాషణా
    ప్రభలు వెలుగు మంటపమున జరుగు
    పరిణయమున తనదు వరునిక్రీగంటి చూ
    పంది మిగుల చొక్కె సుందరాంగి.

    రిప్లయితొలగించండి
  8. వెంకట రాజారావు . లక్కాకులమంగళవారం, జనవరి 03, 2012 9:54:00 AM

    పార్వతి'యుమ ' తాను పరమేశ్వరుని కోరి
    నిర్వి కారు డైన నిజ మెరింగి
    ఘోర తపము జేసి కోర్కె తీరగ గెలు
    పంది మిగుల చొక్కె సుంద రాంగి

    రిప్లయితొలగించండి
  9. రాజేశ్వరి నేదునూరి గారి పూరణ .....

    చంద మామ వంటి యందాల వలరేడు
    వంద నమ్ము లిడెడి వల్ల భుండు
    డెంద మందు చిందు లేనగవు పిలు
    పంది మిగుల చొక్కె సుంద రాంగి

    రిప్లయితొలగించండి
  10. కంసదాసి కుబ్జఁ గనె కృష్ణుఁ డామెపైఁ
    గరుణ గల్గె నతని కరకమలము
    సోఁకఁగానె యౌర సొగుసులు గురియు రూ
    పంది మిగుల చొక్కె సుందరాంగి.

    రిప్లయితొలగించండి
  11. విశ్వనాధవారి కల్పవృక్షములోని అహల్యా శాపవిమోచన వర్ణన అమోఘం. ఆ స్ఫురణతో దశేన్ద్రియములనే శబ్దం (పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు) వాడుతూ:
    తపసి గౌతమ సతి యుపలరూపువిడచి
    చిగురులు తొడుగుచు దశేన్ద్రియముల
    తోడ రామపాదధూళి సోకంగ రూ
    పంది మిగుల చొక్కె సుందరాంగి!

    రిప్లయితొలగించండి
  12. ఆడు పంది జూచి యానందమై మగ
    పంది మిగుల చొక్కె సుందరాంగి
    జట్టు గట్ట రమ్ము జగమేలు దమ్మనె
    వలపెరుగని జీవి యిలను లేదు.

    రిప్లయితొలగించండి
  13. చంద మామ వంటి యందాల వలరేడు
    వలపు విరులు విసురు వల్ల భుండు
    డెంద మందు చిందు లేనగవు పిలు
    పంది మిగుల చొక్కె సుంద రాంగి

    రిప్లయితొలగించండి
  14. చిన్న నాడు తనదు చెలియ చెలువమేమొ
    యెఱుగలేని చెలుడు యిట్లు పలికె.
    "నొప్పుకొందు నేను, నొయ్యారి- మదను తూ
    పంది- మిగుల చొక్కె సుందరాంగి."

    రిప్లయితొలగించండి
  15. మిత్రులందరికీ నూతన సంవత్సర శుభా కాంక్షలు !

    అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    వారం రోజులనుండీ షరా మామూలే !
    ఆరోగ్యంలో చంద్ర కళలు !

    అదీ గాక ఫోనూ నెట్ కూడా దోబూచులాటే !
    ఏమైతేనేం మిత్రులనెంతో కోల్పోయాను !

    మొత్తానికి ఎలాగైతేనేం యీ నాటికి కలుసుకో గలిగాను !
    మహదానందముగా నున్నది !

    రిప్లయితొలగించండి
  16. తప్ప దయ్యె విందు, తాను శాఖాహారి
    కోడికూరఁ బెట్టి కుడువ మనిరి,
    కాని భాగ్యవశముగా నట ముద్దప
    ప్పంది మిగుల చొక్కె సుందరాంగి.

    రిప్లయితొలగించండి
  17. మాస్టారూ, నోరూరించే పూరణ బాగుంది,

    రిప్లయితొలగించండి
  18. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    ప్రీతిపాత్రమూ, రమణీయమూ అయిన చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘బకసేవలు ...’ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘సకలంబుల కీశుడు’ ను ‘సకలంబున కీశుడు’ అందాం. మూడవపాదంలో గణదోషం. ‘అకళంకమనస్కుని త్ర్యం ...’ అంటే సరి!
    *
    జిలేబి గారూ,
    అభినందనలు. మెల్లమెల్లగా దారికి వస్తున్నారు. కొనసాగించండి.
    *
    పండిత నేమాని వారూ,
    విష్ణుపరంగా మీరు చేసిన పూరణ కవిమిత్రులకు ఒక పాఠ్యాంశం వలె ఉంది. అభినందనలు.
    పండితుల పట్ల మీ గౌరవాన్ని మనోహరంగా ఆవిష్కరించారు. ధన్యవాదాలు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    మీ క్రీగంటి చూపందిన పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి భావంతో పూరణ చేసారు. అభినందనలు.
    ఇంతకీ వల్లభుండు ఎవరికి వందనమ్ము లిడుతున్నాడు? మూడవ పాదంలో గణదోషం. నా సవరణ ...
    చంద మామ వంటి యందాల వలరేడు
    (వలెను చేరినాడు) వల్ల భుండు
    డెంద మందు చిందు లేనగవు(ల) పిలు
    పంది మిగుల చొక్కె సుంద రాంగి
    ఓ ... మీరు సవరించిన పూరణ ఉంది. చూడలేదు. అయినా మూడవపాదంలో గణదోషం, యతిదోషం ... ‘డెందమందు చిందు మందహాసపు వల ...’ అందాం.
    *
    చంద్రశేఖర్ గారూ,
    ఉత్తమమైన పూరణ. అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    ‘వల పెఱుగని జీవి యిలను లేదు’ అంటూ సమస్యపాదాన్ని అదే అర్థంలో సమర్థించిన మీ పూరణ అద్వితీయంగా ఉంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    ‘మదను తూ పంది.. ’ చక్కని ఊహ. అభినందనలు.
    *
    వసంత కిశోరా,
    మీకు ఆయురారోగ్యాలు, మనశ్శాంతి చేకూర్చాలని భగవంతునికి వినుతులు.

    రిప్లయితొలగించండి
  19. అజ్ఞాత గారూ,
    ధన్యవాదాలు.
    ఇంతకీ మీకు నోరూరేలా చేసింది కోడికూరా? ముద్దపప్పా? లేక రెండూనా?

    రిప్లయితొలగించండి
  20. ఓహ్హొహొహొహ్హో ----అంటూ
    తోటలోకి యెవరు ముందొస్తే వాళ్ళు సంకేతపదం ఆలపిస్తే
    అది విన్న రెండవ వారు పరుగుపరుగున వచ్చి
    పాటందు కుంటారు ! ఓ----- ఓ ఒ---- దేవదా ! అంటూ !

    01)
    _________________________________

    పడుచు దేవ దాసు - పక్కింటి పార్వతి
    పాట పాడు కొనగ - పరవశమున
    పాత తోట లోన - పార్వతీ ప్రియ, పిలు
    పంది మిగుల చొక్కె - సుందరాంగి !
    _________________________________
    పార్వతీ ప్రియ = దేవదాసు

    రిప్లయితొలగించండి
  21. శ్రీ శం కరయ్య గారికి నమస్కారములు .
    సవర ణ బాగున్నది .కృ తజ్ఞు డను
    సవరిం చు కొందును .

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యా ! ధన్యవాదములు !

    (idea usb modem net connect) తో
    ఒక posting వెయ్యడానికి 100 నిమిషాలు పట్టింది !

    ఇదీ యీ నాటి నా net పరిస్థితి !

    రిప్లయితొలగించండి
  23. శంకరార్యా,

    >>>జిలేబి గారూ,
    అభినందనలు. మెల్లమెల్లగా దారికి వస్తున్నారు. కొనసాగించండి.


    అంతా మీ బ్లాగ్ మాధురీ మహిమ !

    సుబ్బా రావు గారి, గోలీ వారి 'కామెంటు సాంగత్యం'

    లక్కాకుల వారి లాలిత్యం

    మీదు మిక్కిలి ఈ శంకరాభరణం కొలువు కవీశ్వరుల - "చరదత్యద్భుత సత్కవీశ్వరగణం సాలంబనం" అంతే !


    చీర్స్
    జిలేబి.

    రిప్లయితొలగించండి
  24. అయ్యా! శ్రీ శంకరయ్య గారూ! శుభాశీస్సులు.
    తప్పదయ్యె విందు అని మొదలిడిన పద్యములో "శాఖాహారి" అన్నారు. శాకాహారిచేత కొమ్మలనే తినిపిం చేస్తున్నారు. అది మీ తప్పు కాదులెండి. ప్రతి హొటెలు వాడు అలాగే బోర్డు పెట్టుచున్నాడు కదా.

    పండిత శబ్దానికి ఉత్కృష్టమైన స్థానమును ఇచ్చేడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో. ఆ నిర్వచనానికి సరియగు రూపము దాల్చినవాడే పండితుడు. ఆ విషయములనే నేను నా పద్యములో వివరించే ప్రయత్నము చేసేను. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  25. గురువుగారూ ధన్యవాదములు.
    వసంత మహోదయా అనంతాయురారోగ్య ప్రాప్తిరస్తు.
    నిరాటంక జాల సంధాన మస్తు.

    రిప్లయితొలగించండి
  26. శంకరార్యరచిత సరస భావాన్విత
    కృష్ణ లీలను విని హృదయ మలర
    సుకవితా కుమారి సుకుమారి సొంపు పెం
    పంది చొక్కె మిగుల సుందరాంగి

    రిప్లయితొలగించండి
  27. నా పూరణలో ‘శాఖాహారి’ని ‘శాకాహారి’గా చదువుకొన వలసిందిగా మనవి. తెలియజేసిన పండిత నేమాని వారికి ధన్యవాదాలు.
    *
    వసంత కిశోర్ గారూ,
    సంతసం బయెను వసంతకిశోర! మీ
    కెల్ల శుభము లిచ్చు నీశ్వరుండు
    శంకరాభరణము సతియె; మీ పూరణం
    బంది చొక్కె మిగుల సుందరాంగి.
    *
    జిలేబి గారూ,
    సత్కవితా లేఖన ప్రానీణ్య ప్రాప్తిరస్తు!
    *
    పండిత నేమాని వారూ,
    ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  28. మిస్సన్న మహాశయా ! ధన్యవాదములు !
    శంకరార్యా ! ధన్యవాదములు !
    పార్వతీ ప్రియ = దేవదాసు అనుట
    సరియేనా ?
    లేక "పార్వతీ ప్రియు" అనవలెనా ?

    రిప్లయితొలగించండి