17, జనవరి 2012, మంగళవారం

చమత్కార పద్యాలు - 176/A

ప్రహేళిక సమాధానం

తద్విరహ మసహమానా
నిందతి బాలా దివానిశం శంభుమ్ |
రాహు మపి రామచంద్రం
రామానుజ మపి చ పన్నగారాతిమ్ ||


నీ వియోగమ్ము సైపని నీలవేణి
శివుని, రాహువున్, రాముని, శ్రీసతీశు,
వైనతేయుని దిట్టు రేఁబవళు లన్న
భావ మెఱిఁగినవాఁడె పో పండితుండు!


నీ వియోగాన్ని సహింపలేని ఆ యువతి శివుణ్ణి, రాహువును, రామచంద్రుణ్ణి, బలరామసోదరుడైన శ్రీకృష్ణుణ్ణి, గరుత్మంతుణ్ణి రేయింబవళ్ళు నిందిస్తున్నది.

వివరణ

విరహవేదనను పెంచే మన్మథుణ్ణి, చంద్రుణ్ణి, మలయపర్వతాన్ని, మలయమారుతాన్నీ మిగిల్చినందుకు వారు ఆమె నిందకు గురి అయ్యారు. ఎలాగంటే ... మన్మథుణ్ణి ప్రాణాలతో వదిలినందుకు శివుణ్ణి, చంద్రుణ్ణి మ్రింగక కక్కడం వల్ల రాహువును, సేతుబంధనం సమయంలో సముద్రంలో కొండలను, పర్వతాలను వేసి, మలయపర్వతాన్ని వేయనందుకు రాముణ్ణి, మన్మథుని కన్నందుకు శ్రీకృష్ణుణ్ణి, మలయమారుతాన్ని భక్షించే సర్పాలను తినడంవల్ల గరుత్మంతుణ్ణి ఆమె నిందించింది.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథంనుండి)

1 కామెంట్‌:

  1. విరహ వేదన కతనన వెలది యటుల
    నింద గావిం చు చుండెను నీ శు వలన
    సహజ మయ్యది నింతుల చయిద ములును
    ఈ శు డొక్కడె కాపాడు నెవరి నైన .

    రిప్లయితొలగించు