8, జనవరి 2012, ఆదివారం

చమత్కార పద్యాలు - 170

                                  ప్రహేళిక
విషం భుంక్ష్వ మహారాజ
స్వజనైః పరివారితః |
వినాకేన వినానాభ్యాం
కృష్ణాజిన మకంటకమ్ ||


ఒక కవి ఒక మహారాజును దీవిస్తున్నాడు ....

వాచ్యార్థం - 
          "ఓ మహారాజా! బంధుపరివార సమేతుడవై మోసపోకుండా (కేన వినా), బొట్టు పెట్టుకోకుండా (వినా నాభ్యాం), ముళ్ళులేని (అకంటకం) జింకచర్మం (కృష్ణాజినం)పై కూర్చున్నవాడవై విషం త్రాగు (విషం భుంక్ష్వ)"

వ్యంగ్యార్థం -
          "ఓ మహారాజా! బంధుపరివార సమేతుడవై కకారం లేని (కేన వినా), నకారం లేని (నాభ్యాం వినా), షకారం లేని (విషం) ‘కృష్ణాజినం’ను అనుభవించు" ‘కృష్ణాజినమ్’ (క్ + ఋ + ష్ + ణ్ + ఆ + జ్ + ఇ + న్ + అ + మ్) పదంలో క, ష, న కారాలను (నకారమంటే న, ణ రెండూ) తొలగిస్తే ఋ + ఆ + జ్ + ఇ + అ + మ్ మిగులుతాయి. ఋ + ఆ = రా, జ్ + ఇ + అ + మ్ = జ్యమ్; రాజ్యమ్ అవుతుంది.
          అనగా " ఓ మహారాజా! బంధుపరివారంతో నిష్కంటకమైన రాజ్యాన్ని అనుభవించు" అని భావం.                      
                   (శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

3 కామెంట్‌లు: