10, జనవరి 2012, మంగళవారం

చమత్కార పద్యాలు - 172

                                   ప్రహేళిక

విహంగా వాహనం యేషాం
త్రికంచ ధరపాణయః |
పాసల సహితా దేవా
స్సదా తిష్ఠంతు తే గృహే ||


భావం
ఎవరికి ‘విహంగా’లు వాహనాలో, ఎవరు ‘త్రికంచ’ములు ధరించే హస్తాలు కలవారో, ‘పాసల’లతో కూడుకొన్నవారో ఆ దేవుళ్ళు నీయింట సదా నిలుతురు గాక!


అర్థాలు
యేషాం = ఏ త్రిమూర్తులకు
(విహంగాః)
వి = పక్షి (గరుత్మంతుడు)
హం = హంస
గాః = నంది
వాహనం = వాహనాలో;
(త్రికంచ)
త్రి = త్రిశూలాన్ని
కం = కంబువు (శంఖం)ను
చ = చక్రాన్ని
ధర = ధరించిన
పాణయః = హస్తాలు కలవారు;
(పాసల)
పా = పార్వతితో
స = సరస్వతితో
ల = లక్ష్మితో
సహితాః = కూడుకొన్న
దేవాః = దేవుళ్ళు (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు)
తే గృహే = నీ యింట
సదా తిష్ఠంతు = ఎల్లకాలం నిలుతురు గాక!


(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

8 కామెంట్‌లు:

  1. ఓం నమశ్శివాయ ,శివాయ నమః

    ఓం కారము బ్రహ్మాయెను
    హ్రీం కారము విష్ణు వయ్యె నిజముగ నిలలో
    ఐం కారము శ ర్వా ణిగ
    శ్రీం కారము లక్ష్మి గాగ శ్రేయం బయ్యెన్ .

    రిప్లయితొలగించండి
  2. ఓం నమశ్శివాయ ,శివాయ నమః

    ఓం కారము బ్రహ్మాయెను
    హ్రీం కారము విష్ణు వయ్యె నిజముగ నిలలో
    ఐం కారము శ ర్వా ణిగ
    శ్రీం కారము లక్ష్మి గాగ శ్రేయం బయ్యెన్ .

    రిప్లయితొలగించండి
  3. సుబ్బారావు గారూ,
    చక్కని పద్యం చెప్పారు. ధన్యవాదాలు.
    ‘బ్రహ్మ + ఆయెను’ అన్నప్పుడు సంధి జరుగదు కదా!
    రెండవ పాదంలో యతి తప్పింది. ‘నిజముగ’కు బదులు ‘హితముగ’ అంటే సరి!

    రిప్లయితొలగించండి
  4. నమస్కారములు
    సోదరులు ఏమి అనుకోక పొతే ఈ చమత్కారం చూడండి.
    కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు
    పశువు శిశువు తోడ పలుక నేర్చు
    వనిత వేదములను వల్లించు చుండును
    బ్రాహ్మ ణుండు కాకి పలలము దిను.

    ఎవరిదో తెలియదు బాగుంద వ్రాసాను అంతే

    రిప్లయితొలగించండి
  5. గురువు గారికి మరియు శ్రీమతి రాజేశ్వరి గారికి నమస్సులు. ఒకానొక సందర్భములో గరికపాటి వారు ఈ పద్యము గురించి ప్రస్తావించినారు. సాధారణముగా చిన్నపిల్లలు పద్యాలను కంఠస్థము చేసే సమయములో పదాలను ఎక్కడ ఆపాలి, వేరేచోట ఆపితే వచ్చే చెడు అర్థాలను వివరించడానికి ఈ పద్యాన్ని ఉటంకించారు. మొదటి పద్యానికి, రెండవ పద్యానికి ఎంత భేధము ఉన్నదో కామా (,) లను అనుసరిస్తూ చదివితే మనకు తెలుస్తుంది.

    కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు,
    పశువు శిశువు తోడ పలుక నేర్చు,
    వనిత వేదములను వల్లించు చుండును,
    బ్రాహ్మ ణుండు కాకి పలలము దిను.

    కొండ నుండు నెమలి, కోరిన పాలిచ్చు
    పశువు, శిశువు తోడ పలుక నేర్చు
    వనిత, వేదములను వల్లించు చుండును
    బ్రాహ్మ ణుండు, కాకి పలలము దిను.

    రిప్లయితొలగించండి
  6. " సృష్టి , స్థితి , లయ " కారకు లైన " బ్రహ్మ , విష్ణు , మహేశ్వరులను " చక్కగా వివరించారు. చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  7. రాజేశ్వరి అక్కయ్యా,
    మంచి పద్యాన్ని ప్రస్తావించారు. ధన్యవాదాలు.
    మీరు పేర్కొన్న చమత్కార పద్యాన్ని నేను 11వ తరగతిలో ఉండగా మా గురువు గారు శ్రీ చిలుకమఱ్ఱి రామానుజాచార్యులు తెలిపారు.
    *
    సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    అక్కయ్య గారి పద్యాన్ని చూడగానే వివరణతో ఈరోజు ప్రత్యేకంగా పోస్ట్ చేయాలనుకున్నాను. ఈలోగా మీరే చక్కని వివరణ తెలియజేసారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి