13, జనవరి 2012, శుక్రవారం

సమస్యాపూరణం - 590(తమ్ములను నుతింతు)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
తమ్ములను నుతింతు నెమ్మనమున
ఈ సమస్యను సూచించిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

37 కామెంట్‌లు:

  1. శ్రద్ధ తోడ సలుప సత్య దేవు వ్రతము
    పిలచినాడ నేను ప్రియము గాను
    అక్క చెల్లి మరియు నగ్రజు నిద్దరు
    తమ్ములను, నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  2. నాదు పుణ్య ఫలమొ నా భాగ్యమో సీత
    నన్ను మించు ధీరు లెన్న గాను
    వారు లక్ష్మణుండు భరత శత్రుఘ్నులు
    తమ్ములను నుతింతు నెమ్మనమున.

    రిప్లయితొలగించండి
  3. వంకలేక సాగు ‘శంకరాభరణమ్ము’
    మీ సహాయ మంది మిత్రులార!
    సహకరించుచున్న సత్కవివరుల వ్రా
    తమ్ములను నుతింతు నెమ్మనమున.

    రిప్లయితొలగించండి
  4. వచ్చె నిదిగొ కనుఁడు వాసంత మవనిపై
    పరవశింపఁ జేసె ప్రకృతిశోభ;
    పచ్చదనముతోడ ముచ్చటగొల్పు చూ
    తమ్ములను నుతింతు నెమ్మనమున.

    రిప్లయితొలగించండి
  5. గురువుగారూ వైవిధ్యాన్ని అద్భుతంగా చూపించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. తమ్ము లనగ నాకు తనయుల మించిన
    ప్రీతి నిడగ నేను సంత సించి
    అన్న దమ్ము లున్న అదృష్ట దేవతై
    తమ్ముల నుతింతు నెమ్మనమున !

    రిప్లయితొలగించండి
  7. శ్రీగురుభ్యోనమ:

    కష్టములకు నోర్చి కట్టుబడినవారు
    పాండుసుతులు ధర్మపథము నెరిగి
    ధర్మమునకె జయము ధరణిపై, యా యన్న
    తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  8. తమ్మిచూలి సంతతమ్మును ధ్యానించు
    నమ్మ పాదములు రసాన్వితములు
    అమృతమయములైన ఆ పాదములను నె
    త్తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  9. పూర్వకాలమందు పొరుగూరిలో నున్న
    వారి కడకు లేఖ పంపినపుడు
    చిత్రగతుల నేగి చేరవేసిన కపో
    తమ్ములను నుతింతు నెమ్మనమున.

    రిప్లయితొలగించండి
  10. శంకరయ్య గారి 'శంకరా భరణమ్ము'
    కల్ప వృక్ష మాయె కవి వరులకు
    కదలి చేరి పలుకు కవికోకిలల కూజి
    తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బోయ చలిని బాపి పోగొట్టి యాకలి
      మంటలోన దూకి మాడి పోయె
      భారతీయ ధర్మ ప్రతినిధులౌ కపో-
      తమ్ములను నుతింతు నెమ్మనమున.

      తొలగించండి
  11. ఆదిదంపతుల దయామృతమూర్తుల
    హిమనగేంద్రజా మహేశ్వరులను
    సకల భక్త బృంద సందోహ పారిజా
    తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  12. చెవుల కింపు గవిత జెప్పగా నిటు జేరు
    కవి వతంసములకు సవినయముగ
    నాదరమ్ము నిచ్చి, యక్క చెల్లెళ్ళన్న
    దమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  13. స్వాగతాంజలి


    రథోద్ధతము:
    స్వాగతాంజలిదె పర్వరాజమా!
    రాగమూర్తి శుభలక్షణాన్వితా!
    భోగితోడ మరి మూడు పండువుల్
    యోగదమ్ములగు నో ప్రియంకరీ!

    శంకరాభరణమ్ము స్వాగతమ్మనుచుండె
    రావమ్మ మకర సంక్రాంతి లక్ష్మి!
    శబ్దార్థ వైచిత్ర్య సత్కళా కుసుమ గు
    ఛ్ఛమ్ముల నర్పింతు మమ్మ! నీకు
    సరస సాహిత్య విజ్ఞానసారమ్ముతో
    నాహ్లాదమును గూర్తు మమ్మ! నీకు
    చిత్ర చిత్ర కవిత్వ శిష్ట ప్రక్రియలతో
    ననురక్తి కలిగింతు మమ్మ! నీకు
    కంది శంకరయ్య గారు మా గురువులు
    విజ్ఞులైన సభ్య వితతి వేడ్క
    నీదు రాక గోరి నిర్మల చిత్తాల
    వేచియుంటి మమ్మ! వేగ రమ్మ

    రిప్లయితొలగించండి
  14. ఆద రింతు నఖిల బంధు జనంబుల
    తమ్ములను ,నుతింతు నెమ్మనమున
    ఆది దేవు శివుని నారాధ్య దేవుగ
    అర్ధి జనుల భార మతని దౌను.

    రిప్లయితొలగించండి
  15. వాంఛితముగఁ బాయక జయపంచకంబు
    లలిఁ “నమోస్తు రామాయ సలక్ష్మణాయ”
    తీరునన్నదమ్ములను నుతింతు నెమ్మ
    నమున నిత్యము నీమంబున రఘురామ!

    రిప్లయితొలగించండి
  16. నిదుర లేచిన క్షణమది వక్రతుండుని
    తల్లి దండ్రులఁ గురు దైవములను
    భక్తిఁ వ్యాస రచిత భారత భాగవ
    తమ్ములను నుతింతు నెమ్మనమున!

    రిప్లయితొలగించండి
  17. ధనమె మూలమనుచు ధారుణి పేరొంది
    మనుజ జాతి యంత మన్నననిడు
    చున్న , జగము లేలు చున్నట్టి కాసు, విత్
    త్తమ్ములను నుతింతు నెమ్మనమున.

    రిప్లయితొలగించండి
  18. ధనమె మూలమనుచు ధారుణి పేరొంది
    మనుజ జాతి యంత మన్నననిడు
    చున్న , జగము లేలు చున్నట్టి కాసు, వి
    త్తమ్ములను నుతింతు నెమ్మనమున.

    రిప్లయితొలగించండి
  19. జీవ రాశి దేహ మావహించుటె గాక
    ప్రాణ దాత లగుచు బరగు చున్న
    మన్ను నీరు నిప్పు మిన్నుగాలి యను భూ
    తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  20. కలిమి లేము లందు కష్ట సుఖములందు
    కలసియుండు వారు ఘనులు భువిన
    ధర్మ పథము నెపుడు దప్పని తనతండ్రి
    తమ్ములను నుతింతు నెమ్మనమున !!!

    రిప్లయితొలగించండి
  21. భారతమ్ము భాగవతము రామచరిత్ర
    గీత పూర్వ కవుల కృతులు భక్తి
    శతక తతులు మనకు సంపద లట్టి పొ-
    త్తమ్ములను, నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  22. ఈనాటి పూరణలు అన్నియునూ మేలైనవే. తమ్ములు, పొత్తమ్ములు, కపోతమ్ములు, చూతమ్ములు, విత్తమ్ములు, భారత భాగవతమ్ములు, పారిజాతమ్ములు, నెత్తమ్ములు, పంచ భూతమ్ములు, వ్రతమ్ములు ఇలాగ సాగేయి వైవిధ్య భరితముగా. అందరికీ అభినందనలు.

    వసు చరిత్రలో చివరిలో నొక పద్యము ఉన్నది:
    తమ్ముల బంపుదున్, మణిశతమ్ముల బంపుదు, రాజ హంస పో
    తమ్ముల బంపుదున్, పరిచితమ్ముల కానన దేవతాళి జా
    తమ్ముల బంపుదున్ గత ద్రుతమ్ముగ నేనును సారణిన్ ప్రపా
    తమ్ముగ వత్తు విశ్వ విదితా ముదితా మది తాప మేటికిన్

    అనే పద్యము గుర్తుకు తెచ్చుకోవచ్చును.

    సోదరి శ్రీమతి రాజేశ్వరి గారి పద్యము 2వ పాదమును యతి కొరకు సరిజేసుకోవలెను.
    అలాగే శ్రీ సుబ్బారావు గారు కూడా వారి పద్యము 1వ పాదమును యతి కొరకు సరిజేసుకోవలెను. శ్రీ పీతాంబర్ గారు 2వ పాదములో భువిన ధర్మ పథమ్ము అని వాడేరు. అన్వయములో అధర్మ పథము అని వినిపించుచున్నది. అన్వయము కొరకు జాగ్రత్తగా సరిజేసుకోవాలి.

    అందరికీ మరొక్క మారు శుభాభినందనలు. సంక్రాంతి శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  23. నేల నీరు నిప్పు గాలి ఆకసములు
    కలసి రూపమొందు కాయమొండు ;
    ధరణి మిథ్య , శాశ్వతమ్మగు పంచ భూ
    తమ్ములను నుతింతు నెమ్మనమున !!!

    రిప్లయితొలగించండి
  24. అయ్యా! డా. విష్ణు నందన్ గారూ!
    శుభాకాంక్షలు. మీ పద్యము బాగున్నది. అందులో పంచ భూతములు శాశ్వతము అన్నారు -- అలా కాదు. ఆత్మ ఒక్కటియే శాశ్వతము. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అనే ఆర్యోక్తి ఉన్నది కదా!

    రిప్లయితొలగించండి
  25. నేమాని గారూ , బ్రహ్మ సూత్రాలలోని " తదంతర ప్రతిపత్తౌ రంహతి సంపరిష్వక్తః ప్రశ్న నిరూపణాభ్యాం " -ఐనా లేక శంకర ప్రతిపాదిత - బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నా పరః - ఐనా ఈ రెండూ తెలియజేసే విషయమొక్కటే ! దేహి శాశ్వతం కాని దేహం శాశ్వతం కాదు ! పంచభూతాలు శాశ్వతాలు కాని పాంచభౌతికమైన శరీరం శాశ్వతం కాదని కూడ ! సాహిత్య సల్లాపమే కాని , ఆధ్యాత్మిక ప్రసంగానికిది తావు కాదు కాని నీరు , నింగి , గాలి , నిప్పు , నేల ఇవి శాశ్వతాలే ! ఇదైనా అద్వైతుల వరకే ! మరి ద్వైతుల , విశిష్టాద్వైతుల విషయమో ? అన్వయమే మారుతుంది . కనుక యద్భావం తద్భవతి ! అంతే !!!

    రిప్లయితొలగించండి
  26. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    అందరినీ ప్రతానికి పిలిచి మనస్సులో సత్యదేవుని తలచుకున్నాడా? బాగుంది. మంచి విరుపు.
    శంకరాభరణాన్ని కవికోకిలల కలకూజితమ్ములతో నింపిన మీ రెండవ పూరణ మనోహరంగా ఉంది.
    అభినందనలు.
    *
    మిస్సన్న గారూ,
    రాముని చేత తమ్ముల నుతి! బాగుంది. చక్కని పూరణ.
    బోయవాణ్ణి మార్చిన కపోతమ్ముల కథను ప్రస్తావించిన మీ పూరణ బాగుంది.
    పొత్తమ్ములనే విత్తమ్ములను నుతించిన మీ మూడవ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ఈ తమ్ముల పైన మీ ఆదరానికి, అభిమానానికి ధన్యవాదాలు. మంచి పూరణ. అభినందనలు.
    రెండవపాదంలో యతి తప్పింది. ‘సంతసించి’కి బదులు ‘ప్రియము నంది’ అంటే సరి! ‘దేవత + ఐ’ అన్నప్పుడు యడాగమం వచ్చి ‘దేవతయై’ అవుతుంది. అక్కడ ‘అదృష్టదేవినై/మూర్తినై’ అందాం.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు. ‘పథము నెరిగి’ని ‘పథము విడరు’ అంటే?
    *
    పండిత నేమాని వారూ,
    పలుకుబోటి అడుగుదమ్ములను నుతించిన మీ పూరణ మనోహరంగా ఉంది.
    భక్తపారిజాతమ్ములైన ఆదిదంపతుల నుతితో మీ రెండవ పూరణ అద్భుతంగా ఉంది. అభినందనలు.
    సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలికిన మ్ కవితకు ధన్యవాదాలు. దీనిని రేపు ప్రత్యేక పోస్టుగా ప్రకటిస్తాను.
    వసుచరిత్రలోని రసవత్తరమైన పద్యాన్ని ప్రస్తావించారు. ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    బ్లాగు మిత్రులను అన్నదమ్ములు, అక్కచెల్లెండ్రను చేసిన మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    చక్కని విరుపుతో అందమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    మొదటి పాదాన్ని ‘ఆదరింతు నెప్పు డఖిల బంధుల నన్న/ దమ్ములను ...’ అంటే యతిదోషం తొలగిపోతుంది.
    *
    చంద్రశేఖర్ గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
    ముఖ్యంగా ఆటవెలది పాదాన్ని తేటగీతిలో ఇమిడ్చడం చక్కగా ఉంది.
    *
    మందాకిని గారూ,
    ‘విత్తమ్మును’ నుతించిన మీ పూరణ వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    పంచభూతమ్ముల నుతితో మీ పూరణ అలరించింది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    మీరు నుతించింది ‘బాబాయిలను’ అనుకుంటున్నాను. ఆస్తిపంపకాల గొడవలు లేకుండా అండదండలుగా ఉండే బాబాయిలు దొరకడం అదృష్టమే. మంచి పూరణ. అభినందనలు.
    రెండవ పాదం చివర ‘భువిన’ అనకుండా ‘భువిని’ అంటే సరి!
    *
    డా. విష్ణునందన్ గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  27. డా. విష్ణునందన్ గారి పంచభూతమ్ముల ప్రస్తావనతో ఈరోజు బ్రహ్మ సూత్రమ్ములను కూడా గుర్తు చేసుకొనే భాగ్యము కలిగినది. అందుకు వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  28. డా. విష్ణునందన్ గారి పంచభూతమ్ముల ప్రస్తావనతో ఈరోజు బ్రహ్మ సూత్రమ్ములను కూడా గుర్తు చేసుకొనే భాగ్యము కలిగినది. అందుకు వారికి ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  29. సకల జీవ తతుల చైతన్య వంతమై
    పెంపునొంద జేయు పృథ్వి, నీరు,
    ఆకసమ్ము, వాయువగ్నులౌ పంచభూ
    తమ్ములను నుతింతు నెమ్మనమున.

    రిప్లయితొలగించండి
  30. మంది మార్బలమ్ము మందు వ్యాపారమ్ము
    కొల్లలుగ గడించి యెల్ల యెడల
    నాశ పెరుగుచుండ నా యాస్తి పాస్తి మొ
    త్తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  31. గురువులు , పూజ్యులు , అభిమానులు , ఐన సోదరు లంద రికీ , సోదరి మందాకిని గారికీ " హృదయ పూర్వక సంక్రాంతి శుభా కాంక్షలు. "

    నేను మళ్ళీ " స్వీట్ సిక్స్ టీన్ " కి వెళ్ళి పోతున్నాను. ఇక పనేం ఉంది ? సిక్స టీ ఫైవ్ లు వెళ్ళ వలసిందేగా ? బై.

    రిప్లయితొలగించండి
  32. చెట్టు కొమ్మలందు పిట్టల కువకువల్
    మలయ పవన వీచి పలుకరింపు
    బాల భాను కిరణ జాలము సుప్రభా-
    తమ్ములను నుతింతు నెమ్మనమున.

    అమ్మ మేలు కొలుపు లన్నయ్య పాఠాలు
    నాన్న జప తపాలు నన్ను లేపె
    చిన్న నాటి స్మృతుల నెన్నుదు సుప్రభా-
    తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  33. శంకరార్యా, మీతో కూడా నేను బ్లాగు ముఖంగా మాట్లాడాలనుకుంటున్నాను. అనుమతించమనవి.

    రిప్లయితొలగించండి
  34. ప్రోగు బెట్టి కలప భోగి మంటను జేసి
    పిన్న పెద్ద జేరి వెచ్చగాను
    చలిని కాగు వేళ సంక్రాంతి సుప్రభా-
    తమ్ములను నుతింతు నెమ్మనమున

    రిప్లయితొలగించండి
  35. సంపత్ కుమార్ శాస్త్రి గారూ,
    పంచభూతమ్ములను నుతించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    అక్రమార్జనాల విత్తమ్మును నుతించడమా? పూరణలోని వ్యంగ్యం అలరించింది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    ‘సిక్స టీ ఫైవ్ లు వెళ్ళ వలసిందేగా ? బై.’ అనడంలో ఏదో అపశ్రుతి ధ్వనిస్తున్నది. ఏమిటి విషయం?
    *
    మిస్సన్న గారూ,
    సుప్రభాతమ్ముల మూడు పూరణలతో నిజంగానే ఈరోజు సుప్రభాత మయింది. చక్కని పూరణలు. ధన్యవాదాలు.
    *
    భాస్కర రామిరెడ్డి గారూ,
    ‘బ్లాగు ముఖంగా మాట్లాడడం’ అంటే అర్థం కాలేదు. అయినా మీకు అనుమతి అవసరమా? నా బ్లాగు ‘ఓపెన్ టు ఆల్!’

    రిప్లయితొలగించండి