14, జనవరి 2012, శనివారం

చమత్కార పద్యాలు - 175

ప్రహేళిక

వాయు మిత్ర సుత బంధు వాహనా
రాతి భూషణ శిరోవలంబినీ |
తజ్జ వైరి భగినీ పతే స్సఖా
సాతు మాం *(సుజనలోకబాంధవః) ||


* కుండలీకరణంలో ఉన్నది నేను మార్చినది. 
వాస్తవంగా ఉన్న పదాన్ని ఇస్తే ఎవరైనా సమాధానాన్ని వెంటనే చెప్పగలరు.

పవను చెలికాని సుతు బంధు వాహమునకు
శత్రువే నగయైన యా స్వామి తలను
నిలిచినట్టి దాని సుతు వైరి నిజసహోద
రీపతి సఖుండు బ్రోవ నర్థింతు నెపుడు.


భావాన్ని వివరించవలసిందిగా మిత్రులకు మనవి.

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

3 కామెంట్‌లు:

  1. గరుత్మంతుని శత్రువులు పాములు భూషణములు గాగల శివుని తలమీది గంగమ్మకొడుకు భీష్ముని వైరి శిఖండి సోదరి ద్రౌపది పతి అర్డునుని సఖుడు కృష్ణుడు - ఆజగద్గురులికీ , ఈ బ్లాగు గురునికీ నమస్సులు .

    రిప్లయితొలగించండి
  2. రాజారావు గారూ,
    చాలా వరకు సరిగానే చెప్పారు. అభినందనలు.
    గరుత్మంతుడు కాదు ... ఆలోచించండి.

    రిప్లయితొలగించండి
  3. సమాధానం ........
    (ప్రహేళికలో ‘కమలలోచనో హరిః’ అన్నదానిని నిన్న ‘సుజనలోకబాంధవః’ అని మార్చాను)
    వాయు మిత్ర = గాలి చెలికాడైన అగ్నియొక్క
    సుత = కుమారుడైన షడాననునకు బంధువు (సోదరుడు) అయిన వినాయకుని
    వాహన = వాహనమైన ఎలుకకు
    అరాతి = శత్రువైన సర్పం
    భూషణ = భూషణంగా కల శివుని యొక్క
    శిరః = మౌళిని
    అవలంబినీ = అవలంబించిన దెవరో
    తత్ = ఆ గంగయందు
    జ = పుట్టిన భీష్ముని
    వైరి = శత్రువైన శిఖండి యొక్క
    భగినీ = చెల్లెలైన ద్రౌపది యొక్క
    పతేః = భర్త యైన అర్జునునకు
    సఖా = మిత్రుడైన
    కమలలోచనః = తమ్మికంటి యైన
    హరిః = కృష్ణుడు
    మాం = నన్ను
    పాతు = రక్షించు గాక!
    లక్కాకుల వెంకట రాజారావు గారు దాదాపుగా సరియైన సమాధానం చెప్పారు. వారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి