20, జనవరి 2012, శుక్రవారం

చమత్కార పద్యాలు - 177/A

ప్రహేళిక సమాధానం

రామం వానరవాహినీం పురరిపుం రాహుం రవేస్సారథిం
కుంభీగర్భసముద్భవం మురరిపుం మారస్య మౌర్వీరవమ్ |
తన్వీ నూతనపల్లవై ర్విరచితే శయ్యాతలే శాయినీ
సఖ్యా వీజితతాలవృంతపవనా బాలా ముహు ర్నిందతి ||

భావం
క్రొత్త చిగురుటాకులతో చేసిన శయ్యపై పడుకుని, చెలికత్తెచేత విసనకఱ్ఱచేత వీచబడుతున్న లేబ్రాయపు నాయిక ప్రియుని విరహంతో కృశించి, కోకిల జాతిని పెంచే కాకిని (కాకాసురుణ్ణి) చంపకుండా విడిచినందుకు రాముణ్ణి, సేతుబంధనంలో మలయపర్వతాన్ని పెకలించి తీసుకుపోనందుకు వానరసైన్యాన్ని, మన్మథుని ప్రాణావశిష్టుని చేసినందుకు శివుణ్ణి, చంద్రుణ్ణి పూర్తిగా మ్రింగనందుకు రాహువును, సూర్యుణ్ణి పశ్చిమపర్వతానికి చేర్చి రాత్రి రాకకు అవకాశమిచ్చినందుకు సూర్యుని సారథిని, చంద్రుని పుట్టుటకు కారణమైన సముద్రాన్ని త్రాగి విడవడం వల్ల అగస్త్యుణ్ణి, మన్మథుణ్ణి కన్నందుకు విష్ణువును, మరులు రేపుతున్నందుకు మన్మథుని వింటి శబ్దాన్ని మాటిమాటికి నిందించింది. 

(శ్రీ శ్రీభాష్యం విజయసారథి గారు సేకరించిన ‘ప్రహేళికలు’ గ్రంథం నుండి)

1 కామెంట్‌:

  1. నమస్కారములు
    ఒక కావ్య నాయకి యొక్క విరహ వేదనని రస రమ్యం గా వర్ణించారు . మంచి ప్రహేళిక చాలా బాగుంది.

    రిప్లయితొలగించు