17, జనవరి 2012, మంగళవారం

లక్కాకుల వారి కవిత

భక్తి  కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము

పరగు విశ్వ మనంతము , భ్రమణ రూప
చలన చాలన సంవృత్త శక్తి మయము
అందుగల కోట్ల గ్రహ తారకాది కములు
తగ నసంఖ్యాక మయ్యును దారి విడవు


‘భార్య బిడ్డలు తాను' యీ పగిది గల్గు
చిన్న సంసార బాధ్యతే చేత గాని
మనిషి తనయంత కడు శక్తి మంతుడ నని
విర్ర వీగుట యది యెంత వెర్రి తనము ?


తాను నివ సించు విశ్వమే , తనకు సుంత
యైన బోధ పడుట లేదు , తాను శక్తి
మంతు డెట్లగు? విశ్వనియంత కన్న
నధికు డెట్లగు? నల్పాయువగు మనుజుడు


ఆవరించిన గాలి , సూర్య కిరణాలు,
పుడమిపై నీరు ప్రాణుల పుట్టుక లకు
బ్రతుకుటకు ప్రాపు - లిందెట్టి భాగ్య మైన
తొలుగ - సృష్ఠించ నేర్చునే మలిగి తేర ?


ప్రకృతి పరమైన భాగ్యాలు బావు కొనుచు
దాతనే మరచు కృతఘ్నతా విధాన
భావనలు గల్గు మానవా! పతన మవకు
భక్తి కైమోడ్చి పరమాత్మ ప్రాపు గనుము


రచన
శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారు

7 కామెంట్‌లు:

  1. గర్వాన్ని వర్జించి పరమాత్మ శక్తిని గుర్తించమని చెప్పిన మీ కవిత ప్రబోధాత్మకంగా ఉంది. ఇంత చక్కని కవిత్వం చెప్పిన మీకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. లక్కాకుల వారూ! చక్కగా చెప్పారు.. మీరు చెప్పినది నిజమే...

    ఇసుక రేణు వంత ఇల పైన నీ నరుడు
    నలుసు కాదె, వినగ నలుసు చేయ
    తగునె విశ్వ విభుని తలయందు దలచక
    విర్ర వీగ నదియ వెర్రి తనమె.

    రిప్లయితొలగించండి
  3. చక్కని కవిత రూపములో మానవుని అల్పత్వమును నిరూపించిన శ్రీ లక్కాకుల వెంకట రాజారావు గారికి అభినందనలు.

    రిప్లయితొలగించండి
  4. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    పద్యం బాగుంది. అభినందనలు.
    ‘ఇలపైన నీ నరుడు’ అన్నప్పుడు గణదోషం.
    ‘ఇలపైన మనుజుఁడు’ అంటే సరి!
    *
    చీకోటి జగన్ మోహన్ గారూ,
    తోట భరత్ గారూ,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    ..... లక్కాకుల వారి పక్షాన మీకు ధన్యవాదలు.

    రిప్లయితొలగించండి
  5. శంకరార్యా ! తొందరలో జరిగిన గణ దోషము.
    చక్కని సవరణకు ధన్యవాదములు.
    సవరణతో...

    ఇసుక రేణు వంత ఇల పైన మనుజుడు
    నలుసు కాదె, వినగ నలుసు చేయ
    తగునె విశ్వ విభుని తలయందు దలచక
    విర్ర వీగ నదియ వెర్రి తనమె.

    రిప్లయితొలగించండి