18, జనవరి 2012, బుధవారం

సమస్యాపూరణం - 595 (పాపులను బ్రోచులే)

కవిమిత్రులారా,
ఈ రోజు పూరించవలసిన సమస్య ఇది
పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు.

25 కామెంట్‌లు:

  1. ' కంస శిశుపాల దంతవక్త్రాది యఘుల
    కీయడే ముక్తి తుదకీత డేమి హరియొ
    పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు '
    పాప యిట్లన నేనంటి వైర భక్తి
    వారి దెంచగ రాదమ్మ హారి నంటి.

    రిప్లయితొలగించండి
  2. పాపులను బ్రోచులే భగవంతు డెపుడు
    ననుచు దుష్కృతి నూనుటనర్థకమ్ము
    ఎవ్వరేవిధి గొలిచిన నేని బ్రోచు
    నా జగత్త్రాత సర్వ సహాయకుండు

    రిప్లయితొలగించండి
  3. శ్రీపతిశాస్త్రిబుధవారం, జనవరి 18, 2012 8:34:00 AM

    శ్రీగురుభ్యోనమ:

    విశ్వమంతయు తానుగా విస్తరించె
    పాపపుణ్యము లెంచక భక్తి తోన
    మ్రొక్కువారికి చూపించు మోక్షపథము
    దుష్టశిక్షణ నెపమున దునుమువాడు
    పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  4. మాట విననట్టి కొడుకును మందలించి
    చేరి కొట్టుచు తగినట్టి శిక్ష వేసి
    అనున యించును గద తండ్రి, యటులె చూడ
    పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు

    రిప్లయితొలగించండి
  5. సర్వ జీవులందు కొలువై జగము నేలు
    పరమ పావనుడాతడు,భక్తి మీర
    కొలుచు పుణ్యమూర్తులతోడ, కోరినంత
    పాపులను బ్రోచులే భగవంతుడెపుడు.

    భగవంతుడెపుడు దయతో
    తగురీతిని కాచుచుండు దరిజేరినచో,
    నగధారిగ నిలిచెను కా
    వగ గోకులమును సురేంద్రు వంచన విరుగన్.

    రిప్లయితొలగించండి
  6. వెంకట రాజారావు . లక్కాకులబుధవారం, జనవరి 18, 2012 9:43:00 AM

    దారి తప్పిన బిడ్డలే తల్లి దండ్రి
    మదిని మెదులుట జూడగా మనుజులందు
    దారి తప్పిన వారిని దరికి జేర్చి
    పాపులను బ్రోచులే భగవంతు డెపుడు

    రిప్లయితొలగించండి
  7. కార్యకారణ సంబంధ కథనమెరుఁగ
    నగునె గుణనిధి పుండరీ కాదులెట్లు
    నిర్మల మనస్కులై క్షేత్రిని గనిరనఁగ
    పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు!

    రిప్లయితొలగించండి
  8. పాపులను బ్రోచులే భగ వంతు డెపుడు
    అనెడు మాటలు సరి యగు నయ్య ? స్వామి !
    భక్తు లెవ రైన భజి యించ భక్తి మీ ర
    రక్ష సేయును నిరతము రక్తి తోడ .

    రిప్లయితొలగించండి
  9. పాల కడలిన పవళించు పద్మనాభు
    డేలుపేక్షించు దుష్టుల నేలవిడుచు
    పాపులను? బ్రోచులే భగవంతుడెపుడు
    సాదు సంతుల సుజనుల సత్య హితుల !!!

    రిప్లయితొలగించండి
  10. శాపవశమున నీ జన్మ పాపులైన
    కర్మఫలములు దీఱగఁ గష్టు లైన
    మంచి కార్యము లొక్కింత మనముఁ దలచ
    పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు

    రిప్లయితొలగించండి
  11. శ్రీ పీతాంబర్ గారూ, మీ పద్యము చాలా బాగుంది. ఏలను + ఉపేక్షించు ఏల నుపేక్షించు అనాలని గురువు గారు చెబుతారేమో !

    రిప్లయితొలగించండి
  12. సరదాగా ఇంకొకటి

    'పా' యనగ పాప రహితుడు శ్రీ యుతుడును
    'పు' యన గను పుణ్య శీలు డరయగ వినుమ
    పా పు లీరీతి యనఘులై పరిఢవిల్ల
    పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు

    రిప్లయితొలగించండి
  13. శ్రీ నరసింహ మూర్తి గారు నమస్కారం .ధన్యవాదాలు మీరన్నది నిజమే "....పద్మ నాభు డేల రక్షించు/పద్మ నాభు డేల కాపాడు " అంటే సరి పోతుందనుకొంటాను .

    రిప్లయితొలగించండి
  14. డి.నిరంజన్ కుమార్బుధవారం, జనవరి 18, 2012 11:29:00 PM

    భక్తి మీరగ గొలిచిన వారినైన
    ముక్తి కోరుచు గొలిచెడు వ్యక్తి నైన
    వారువీరని యెంచక భావమందు
    పాపులను బ్రోచులే భగవంతుడెపుడు

    రిప్లయితొలగించండి
  15. డి.నిరంజన్ కుమార్గురువారం, జనవరి 19, 2012 12:00:00 AM

    దుష్ట కార్యములనుజేయు దుష్టుడైన
    పాప పుణ్యము లెరుగని పాపి యైన
    క్రూర మానస వృత్తితో కుటిలుడైన
    పాపులను బ్రోచులే భగవంతుడెపుడు

    రిప్లయితొలగించండి
  16. శ్రీ పీతాంబర్ గారూ నమస్కారములు. చక్కగా సరిపోతాయి.

    రిప్లయితొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    దుష్ట శిక్షణాయ శిష్ట రక్షణాయ
    సంభవామి యుగే యుగే !
    యనిగదా భగవానువాచ:

    01)
    ___________________________________

    పాపులను కాచునా ? భగ - వంతు డెపుడు ?
    పాపులను కాచుటే వాని - పనియె యహహ !!!
    పాపమున కైన యిటువంటి - పలుకు పలుక
    పాలనంతయు యవినీతి - పాల బడును !

    పాపులను బ్రోవ , పుణ్యంపు - ఫలమికేమి ?
    పాప పుణ్యంబు లకు తగ్గ - ఫలితమిచ్చు
    ప్రజల జీవన సరళిచే - వరము లిచ్చు
    పాప కర్ముల పైననే - కోప పడును !

    పాపులను బ్రోచుచో భగ - వంతు డెపుడు
    పాప కర్ములు ,పెరుగును - పాపమవని !
    పాపములె చేయు చుందురు - ప్రజలు భువిని !
    పాపకర్ముల వలననే - భారమవని !

    భారమును తగ్గింపగ యవ - తార మెత్తి
    పట్టి శిక్షించు తప్పక - ప్రబలమైన
    పాపులను ! బ్రోచునే భగ - వంతుడెపుడు
    పాప కర్మలు చేయని - ప్రజల గనిన !
    పరమ కరుణను పుణ్యుల - పంచ నుండు !
    ___________________________________

    రిప్లయితొలగించండి
  18. తీర్థయాత్రల పాపముల్ తీరు నండ్రు
    పుణ్య భూముల మరణింప ముక్తి యండ్రు
    హరిని తలచిన కలుగదే యతని రక్ష
    పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు .

    రిప్లయితొలగించండి
  19. తల్లిదండ్రుల గురువుల నుల్ల మందు
    భక్తి విలసిల్లఁ బూజించి, ముక్తి నొసఁగు
    కార్యములఁ జేసి, దీనులఁ గాచు విగత
    పాపులను బ్రోచులే భగవంతుఁ డెపుడు.

    రిప్లయితొలగించండి
  20. మిస్సన్న గారూ,
    వైరభక్తిని ప్రస్తావించిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    ‘అది + అఘుల’ అన్నప్పుడు యణాదేశం రావాలి కదా! ‘శిశుపాల దంతవక్త్రాద్యధముల’ అంటే?
    ‘హారి’ ..?
    మీ రెండవ పూరణ చమత్కారభరితమై అలరిస్తున్నది.
    వెనుకటి కెవరో ‘వెధవ’ అంటే ‘వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు’ అని అర్థం చెప్పారట! ‘పాపి’కి మీ వివరణ అలాగే ఉంది.
    *

    *
    పండిత నేమాని వారూ,
    ఉత్తమంగా ఉంది మీ పూరణ. అభినందనలు.
    *
    శ్రీపతి శాస్త్రి గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పూరణ చక్కగా ఉంది. అభినందనలు.
    *
    మందాకిని గారూ,
    మంచి పూరణ. అభినందనలు.
    మీ కొసరు పద్యం బాగుంది.
    *
    లక్కాకుల వెంకట రాజారావు గారూ,
    మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.
    *
    ‘మనతెలుగు’ చంద్రశేఖర్ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభనందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పూరణ వైవిధ్యంగా చక్కగా ఉంది. అభినందనలు.
    *
    మంద పీతాంబర్ గారూ,
    చక్కని విరుపుతో మంచి పూరణ చెప్పారు. బాగుంది. అభినందనలు.
    ‘ఏలన్ + ఉపేక్షించు’ అన్నప్పుడు సంధి లేదు కదా!‘ఏల కనడించు’ అందాం. కనడించు = ఉపేక్షించు.
    ఓహ్! .. మీరే సవరించారు కదా! బాగుంది.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మంద వారి విషయంలో మీ వ్యాఖ్య సరియైనదే. ధన్యవాదాలు.
    *
    నిరంజన్ కుమార్ గారూ,
    మీ రెండు పూరణలూ ప్రశస్తంగా ఉన్నాయి. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  21. గురువుగారూ ధన్యవాదాలు.
    సవరణకు కృతజ్ఞతలు.
    హారి అంటే కౌస్తుభహారి అని పెద్దలి చెప్పగా విన్నాను.

    రిప్లయితొలగించండి
  22. శంకరార్యా ! నన్నుపేక్షించితిరేలనో ?!

    రిప్లయితొలగించండి
  23. వసంత కిశోర్ గారూ,
    నిజమే! మౌజ్‍ను పైకీ క్రిందికీ ఆడిస్తున్నప్పుడు మీ పూరణ తప్పిపోయింది. చూడలేదు. మన్నించాలి.
    ఇంతకాలం ఒక్క సమస్యకు ఎనో పూరణలు పంపేవారు. ఇప్పుడు ఒక్క పూరణకోసం ఎన్నో పద్యాలు వ్రాసి దానికొక ఖండకావ్య రూపాన్ని ఇచ్చేట్లు ఉన్నారు. మీరు దేనికైనా సమర్థులే!
    మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.
    మూడవ పద్యం మొదటి పాదంలో ‘భారమును తగ్గింప’ అన్నప్పుడు గణదోషం. అక్కడ ఇంద్రగణం ఉండాలి కదా! కాని ‘మునుతగ్గిం’ సగం (IIUU) అవుతుంది. ‘భారమును కుదించగ’ అందాం.

    రిప్లయితొలగించండి