24, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 105

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య రవి గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
ఆ సమస్య ఇది ...........

చందమామను ముద్దాడసాగె చీమ.

16 కామెంట్‌లు:

  1. అంతు లెరుగని విశ్వము నందు మనుజు
    డెంత? తలచి చూడను చీమ యంత! కాని
    బుద్ధి బలమున ఘనుడేను! భువిఁ జయించి
    చందమామను ముద్దాడ, సాగె చీమ!

    రిప్లయితొలగించండి
  2. నమస్కారములండీ. రుద్రాభిషేక సమయములో,

    పాలు పెరుగులు తేనెల ఫాలనేత్రుఁ
    జలకమాడెడి తరుణముఁ జటలఁ దూరి
    మధుర రసముల నిచ్చెనె మామ యనుచు
    చందమామను ముద్దాడసాగె చీమ.

    రిప్లయితొలగించండి
  3. చిన్న మనుమడు గీసిన చిత్రమందు

    పరమ పావను ముద్దాడె పార్వతమ్మ

    పంచదారను సిగ పైన వంచెనేమొ

    చందమామను ముద్దాడ సాగె చీమ

    రిప్లయితొలగించండి
  4. క్షీర సాగర మధనాన చీర నంటి
    వచ్చె లచ్చివెంట నొకచీమ చ్చెరువున
    వరుస బుట్టిన తమ్ముని జేరి వగల
    చంద మామను ముద్దాడ సాగె చీమ.

    విన్నపము: ప్రాసాక్షర యతి పాటించటానికి ప్రయత్నించాను.
    విధేయుడు,

    రిప్లయితొలగించండి
  5. చందమామను చదువుచు చంటిగాడు
    జాంగిరీలను తిన, చుక్క జారి పడెను
    ఎట్లు కనుగొన్నదొగాని, ఇంతలోనె
    చందమామను ముద్దాడ సాగె- చీమ!

    రిప్లయితొలగించండి
  6. బాగున్నాయి పూరణలు!
    దీనికి మూలం సంస్కృత సమస్య అనుకుంటాను, కదా?

    రిప్లయితొలగించండి
  7. అంద మంతయు నాతని సొంత మనుచు
    నింగి నుండియు వెలయును నగవు లెన్నొ
    వందనమ్మని మురియుచు మంద గమన
    చంద మామను ముద్దాడ సాగె చీమ

    రిప్లయితొలగించండి
  8. ఆహా ఏమి నా భాగ్యము? ఇంతమంది నిర్దోషంగా, చక్కని భావాలతో పూరణలను పంపి నా బ్లాలును శోభాయమానం చేస్తున్నారు.
    రవి గారు, గన్నవరపు నరసింహ మూర్తి గారు, మందా పీతాంబర్ (అంబర్ 50) గారు, నారాయణ గారు, నేదునూరి రాజేశ్వరి గారు, చంద్రశేఖర్ గారు అందరూ ఒకరిని మించి మరొకరు మనోహర పూరణలు పంపించారు. అందరికీ వందనాలు, అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. చంద్రశేఖర్ గారూ,
    మూడవ పాదంలో ప్రాసయతి తప్పింది. దానిని "వరుస బుట్టిన తమ్ముని దరిని జేరి" అంటే సరిపోతుంది కదా?

    రిప్లయితొలగించండి
  10. భైరవభట్ల కామేశ్వర రావు గారూ,
    పూరణ పద్యాలు మీకు నచ్చుతున్నందుకు సంతోషం. ధన్యవాదాలు.
    ఈనాటి సమస్యకు సంస్కృత మూలం ఉందన్నారు. నిజమే కావచ్చు. నేనైతే ఎప్పుడూ వినలేదు. ఈ సమస్యను రవి గారు పంపించారు.

    రిప్లయితొలగించండి
  11. @కామేశ్వరరావుగారు, శంకరయ్య గారు:
    ఏమోనండి, సంస్కృతమూలం ఉందేమో, కానీ ఈ సమస్య శాంతినారాయణ గారనే అవధాని (అనంతపురం) పూరించారు. పృచ్ఛకులు ఎవరో తెలీదు. అవధాని పూరణ ఇది.

    శివజటాజూటమందున్న శ్రీకరమ్ము
    లగు విరులమధువులగ్రోలి ఆసదీర
    ఆ నళిన శత్రువిభూషితుపైన నుండు
    చందమామను ముద్దాడసాగె చీమ.

    రిప్లయితొలగించండి
  12. మీ బ్లాగు చదివాను, బాగుంది.నాకు తెలుగు భాష అంటే చాలా అభిమానం..అయితే ఛందస్సు మీద పెద్దగా పట్టు లేదు, కంద పద్య లక్షణాలు, మీరు మీ బ్లాగులో రాయగలిగితే ధన్యురాలను. మీరన్నట్టుగానే,అందరూ ఒకరిని మించి మరొకరు మనోహర పూరణలు పంపించారు.చంద్రశేఖర్ గారి ఊహ అద్భుతం.

    రిప్లయితొలగించండి
  13. ఆకసంబున జూచితి నర్ధ రాత్రి
    నల్లమబ్బులు సాగుచు నచట నిండు
    చందమామను ముద్దాడసాగె; చీమ
    లట్లు తోచెను చుక్కల రాశి జూడ .

    రిప్లయితొలగించండి
  14. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మనోహరంగా ఉంది మీ పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. నాటి రాత్రిన గిన్నెలో నావు పాల
    లోన ప్రతిబింబము గాంచి తాను వలచి
    చందమామను ముద్దాడసాగె చీమ...
    శాప వశమున చీమలు పాప మయ్యొ!
    పుట్టి స్వర్గము జేరవె కుట్ట గానె!

    రిప్లయితొలగించండి