7, సెప్టెంబర్ 2010, మంగళవారం

చమత్కార పద్యాలు - 17

దశవతార స్తుతి - 1 (మత్స్యావతారం)
శా||
సాధీయో ముఖ పూరితోద్వమిత తాసత్యోర్ధ్వ గోదన్వ ద
ర్ణో ధారాంతర టత్తిమింగిలగిల ప్రోద్ధాన నిధ్యాన ల
బ్ధాధీశ ప్రభుతా స్వభాగ హరణార్థాయాయి నాథానుజ
ప్రాధాన్యాంక విలోల వాగ్ధృగభట బ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్.

( ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్ది )
భావం -
మత్స్యావతారా! నీవు అతి విశాలమైన ముఖంలో నింపి పైకి ఎగజిమ్మడంతో సత్యలోకం దాకా పైకి వెళ్తున్న సముద్ర జలాల మధ్య సంచరిస్తున్న తిమింగిలగిలాల ఎగరడాన్ని చూచి, తన భర్తయైన బ్రహ్మ నుండి తనకు రావలసిన సోదర భాగాన్ని తీసికొనడానికి వస్తున్న మన్మథుని ధ్వజం మీద ఉన్న మీనం అనే భ్రాంతితో సరస్వతి చూపులు చలించాయి. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

వివరణ -
విష్ణువు మత్స్యావతారాన్ని ధరించాడు. తన విశాలమైన నోటిలో సముద్ర జలాలను నింపి పైకి ఎగజిమ్మాడు. ఆ జలాలు బ్రహ్మదేవుని సత్యలోకం దాకా పైకి వెళ్ళాయి. ఆ జలాలలో తిమింగిలాలున్నాయి. అవి మాటిమాటికి ఎగురుతున్నాయి. వాటిని సరస్వతి చూచింది. రెపరెపలాడుతున్న ధ్వజం మీది చేప గుర్తుగా భ్రమించింది. మీన ధ్వజుడైన మన్మథుడు బ్రహ్మకు సోదరుడు కదా! ఆ మన్మథుడు తన భర్తను ఆస్తిలో వాటా అడగడానికి వస్తున్నాడనుకొని ఆమె చూపులు చలించాయి. ఆ విధంగా సరస్వతికి భ్రాంతిని కలిగించిన మత్స్యావతారుడైన విష్ణుదేవుని స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి