19, సెప్టెంబర్ 2010, ఆదివారం

చమత్కార పద్యాలు - 27

అష్ట దిక్పాలక స్తుతి
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రి సేకరించిన ఈ చాటుపద్యాలను రచించిన కవి పేరు కాని, అతని కాలం కాని తెలియవు.
చం.
హరి శిఖి ధర్మ దైత్య వరుణానిల యక్ష శివుల్, గజాజ కా
సర నర నక్రకైణ హయ శక్వర యానులు, వజ్ర శక్తి ము
ద్గర శర పాశ కుంత సృణి కార్ముక హస్తులు, భోగ శుద్ధి సం
గరజయ శౌర్య సత్త్వ జవ కావ్య విభూతులు మాకు నీవుతన్.

ప్రతి పదార్థాలు -
హరి = ఇంద్రుడు, శిఖి = అగ్ని, ధర్మ = యమధర్మరాజు, దైత్య = నిరృతి, వరుణ = వరుణుడు, అనిల = వాయువు, యక్ష = కుబేరుడు, శివుల్ = ఈశానుడు అనే అష్ట దిక్పాలకులు, గజ = ఏనుగు, అజ = పొట్టేలు, కాసర = దున్నపోతు, నర = మానవుడు, నక్రక = మొసలి, ఏణ = జింక, హయ = గుఱ్ఱం, శక్వర = ఎద్దు, యానులు = వాహనాలుగా గలవారు, వజ్ర = వజ్రం, శక్తి = బల్లెం, ముద్గర = గద, శర = బాణం, పాశ = త్రాడు, కుంత = ఈటె, సృణి = అంకుశం, కార్ముక = విల్లు, హస్తులు = చేతిలో ధరించేవారు, భోగ = సుఖం, శుద్ధి = పవిత్రత, సంగరజయ = యుద్ధంలో విజయం, శౌర్య = శూరత్వం, సత్త్వ = బలం, జవ = వేగం, కావ్య = క్షేమం, విభూతులు = సంపదలను, మాకున్ + ఈవుతన్ = మాకు ఇచ్చెదరు గాక!
వివరణ -
ఐరావతమనే ఏనుగు వాహనంగా, వజ్రం ఆయుధంగా గలిగి తూర్పు దిక్కును పాలించే ఇంద్రుడు మాకు సుఖాన్ని, మేషం వాహనంగా, బల్లెం ఆయుధంగా గలిగి ఆగ్నేయ దిక్కును పాలించే అగ్ని మాకు పవిత్రతను, మహిషం వాహనంగా, గద ఆయుధంగా గలిగి దక్షిణ దిక్కును పాలించే యముడు మాకు యుద్ధాలలో విజయాన్ని, మానవుడు వాహనంగా, బాణం ఆయుధంగా గలిగి నైరృతి దిక్కును పాలించే నిరృతి మాకు శూరత్వాన్ని, మకరం వాహనంగా, నాగపాశం ఆయుధంగా గలిగి పశ్చిమ దిక్కును పాలించే వరుణుడు మాకు బలాన్ని, మృగం వాహనంగా, ఈటె ఆయుధంగా గలిగి వాయవ్య దిక్కును పాలించే వాయువు మాకు వేగాన్ని, అశ్వం వాహనంగా, అంకుశం ఆయుధంగా గలిగి ఉత్తర దిక్కును పాలించే కుబేరుడు మాకు క్షేమాన్ని, వృషభం వాహనంగా, విల్లు ఆయుధంగా గలిగి ఈశాన్య దిక్కును పాలించే ఈశానుడు మాకు సంపదను ప్రసాదింతురు గాక!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి