15, సెప్టెంబర్ 2010, బుధవారం

చమత్కార పద్యాలు - 24

దశావతార స్తుతి - (బలరామావతారం)
మ.
కరిపూరుద్ధరణేద్ధ లాంగల విభగ్నక్ష్మా భరాదక్ష ది
క్కరి పాదప్రహతిస్ఫుటస్ఫుటిత భాగవ్యాపృతగ్రీవ సూ
కర పీఠీకృత పృష్ఠతాహిత మహా గాఢాధి కూర్మాధి రా
ట్పరిక్లుప్తప్రళయాంబుగాహన హలిబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్దం)
భావం -
బలరామావతారుడవైన ఓ పరమాత్మా! నీవు హస్తినాపురాన్ని పెకలించే వేళ నీ నాగలిచే భగ్నమైన భూమిని భరించలేక దిగ్గజాలు ఆదిశేషుని పడగలపై పడ్డాయి. అప్పుడు ఆదిశేషుడు తన శరీరంతో వరాహమూర్తి కరాన్ని చుట్టినాడు. ఆ వరాహమూర్తి ఆదికూర్మం పీఠం మీద పడ్డాడు. ఈ అందరి బరువు మోయలేక ఆ కూర్మం ప్రళయ సముద్రపు జలంలో ప్రవేశించింది. దీనికంతటికీ కారణమైన నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి