25, సెప్టెంబర్ 2010, శనివారం

సమస్యా పూరణం - 106

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసినను సమస్య చంద్రశేఖర్ గారు పంపించారు. వారికి ధన్యవాదాలు.
ఆ సమస్య ఇది ...........

జ్వరపీడితుఁ డచటినుండి జారుకొనెఁ గదా!

17 కామెంట్‌లు:

 1. అందరికీ వందనాలు:

  త్వరిత పడి వైదు డొక్కఁడు
  వరహాలపు మూట వదలి వరరోగి కిడన్
  చిరుసూది కోసమేగెను
  జ్వరపీడితుఁ డచటి నుండి జారుకొనెఁ గదా (వరహాల మూటతో )

  రిప్లయితొలగించండి
 2. అందరికీ వందనాలు: క్షమించాలి, అచ్చుతప్పు సవరణ ,

  త్వరిత పడి వైద్యు డొక్కఁడు
  వరహాలపు మూట వదలి వరరోగి కిడన్
  చిరుసూది కోస మేగెను
  జ్వరపీడితుఁ డచటి నుండి జారుకొనెఁ గదా (వరహాల మూటతో )

  రిప్లయితొలగించండి
 3. మరో పూరణండీ :

  వెరచుచు వైద్యుని చేరగ
  నరయక నా రోగి యందుటవలక్షణముల్
  పరుగిడ రుక్మము వెంబడి
  జ్వర పీడితుఁ డచటి నుండి జారుకొనెఁ గదా!

  రుక్మము = బంగారము

  రిప్లయితొలగించండి
 4. బిరబిర ఇలు చేరెదమని
  పరుగిడు లత కొంగులాగె బండడొకండా
  సురదన గరువున ఒకటిడ,
  జ్వరపీడితుడచటినుండి జారుకొనె గదా!

  జ్వరపీడితుడంటే మోహజ్వరపీడితుడని నా భావం.
  బిరబిర= తొందరగా బండడు=పోకిరి, గరువు=దవడ.

  రిప్లయితొలగించండి
 5. శ్రీ శంకరయ్య గారు, నమస్కారం .

  ఎంతో సహనంతో ,వినయంతో,నా పూరణలను
  సవరిస్తూ వాటికి మరింత వన్నె గూర్చుతున్న మీకు ధన్యవాదములు.పద్య లక్షణాలు తెలిసీ,తెలియక కేవలం పూరించాలనే
  ఉత్సాహంలో దొర్లుతున్న తప్పులను సరిచేస్తూ,చక్కగా ప్రోత్సహిస్తున్న మీకు కృతఙ్ఞతలు .


  మీకు అభివాదం,

  మీ సేవకు ధన్యవాదం,

  కావాలి ఉపకారమే అందరి వాదం ,

  అనేకదా అంటుంది మన వేదం.

  -భవదీయుడు మంద పీతాంబర్.

  రిప్లయితొలగించండి
 6. స్వరపేటిక చెడి పోయెను,

  సరిగమలను పలికి పలికి సాధన లోనే

  బరిలో నిలువక, రాగ

  జ్వర పీడితుడచటి నుండి జారుకొనె గదా

  రిప్లయితొలగించండి
 7. సొంఠి మిరియములు నూరి
  వంటికి మేలని మ్రింగమనుచు అవ్వ పోరగ
  సూది మందే నయమని దలచి
  జ్వరపీడితుఁ డచటి నుండి జారుకొనెఁ గదా

  నేను ఎప్పుడో పాఠశాలకు వెళ్ళే రోజుల్లో తెలుగు చదువుకున్నా, నేను ఇంజినీరింగు చేసి, ఇంకా పై చదువుకి కూడా వెళ్ళా, అందుకు ఛందస్సు మీద పెద్దగా పట్టు లేదు. మక్కువ చేత ప్రయత్నం చేశాను గానీ, తప్పులుంటే మన్నించగలరు.

  రిప్లయితొలగించండి
 8. అరకొర సదుపాయాలూ
  సరియగు వైద్యము దొరకదు, చాలవు పడకల్
  సరుకారు దవా ఖానలొ
  జ్వరపీడితుఁ డచటి నుండి జారుకొనెఁ గదా !!

  రిప్లయితొలగించండి
 9. అచ్చు తప్పులకు నింద మరొకరి మీద మోపే అవకాశమే లేదు.

  లేఖిని ఘంటముఁ బట్టుచుఁ
  లేఖకుడను నేను నౌట లెక్కకు మించెన్
  లేఖకు డిచ్చెడి తప్పులు
  రేఖావృతమయ్యి తలగె రిక్తపు గవితల్ !

  నరసింహ మూర్తి.

  రిప్లయితొలగించండి
 10. కరమున మల్లెలు జుట్టి
  త్వర చింతామణి సదనము దూరెబొ పోలీ
  సరవగ చల్లగ కామ
  జ్వరపీడితుఁ డచటినుండి జారుకొనెఁ గదా!

  రిప్లయితొలగించండి
 11. సిరంజిని గని నంతనె
  పిరంగియై కబడెను గనుక శిరతెగినట్లై
  జరిగిన గుండెను వదలక
  జ్వర పీడితుడచటి నుండి జారుకొనె గదా !

  రిప్లయితొలగించండి
 12. సిరంజిని గని నంతనె
  పిరంగియై కనబడెను గనుక శిరతెగినట్లై
  జరిగిన గుండెను వదలక
  జ్వర పీడితుడచటి నుండి జారుకొనె గదా !

  క్షమించాలి అక్షర దోషం వచ్చింది గనుక మళ్ళీ రాసాను

  రిప్లయితొలగించండి
 13. శ్రీ చంద్రశేఖర్ గారిచ్చిన సమస్యకు పూరణ


  సిగన నెలరాశి చిద్విలాసి, జడ సుడిన
  పరుగుల తరంగ గంగ,సగాన పారు,
  విలయ కారుని విలక్షణ విశ్వరూప,
  రూప్యమున కారు డాలర్లు గోప్యమనర.

  రిప్లయితొలగించండి
 14. అందరికీ నమస్కృతులు.
  నిన్న తప్పని సరిగా ఊరికి వెళ్ళవలసి వచ్చింది. అందులోను ఇంట్లో మోడెం చెడిపోయింది. నేను వెళ్ళిన పల్లెటూరిలో నెట్ సౌకర్యం లేదు. అందు వల్ల నిన్న పోస్ట్ పెట్టలేక పోయాను. మిత్రులకు కలిగిన అసౌకర్యానికి మన్నించాలి.
  ఇప్పుడే వరంగల్లో బస్ దిగి ఎదురుగా ఉన్న నెట్ సెంటర్లో కూర్చుని మయిల్ చెక్ చేస్తున్నాను. మీ మీ పూరణలు కేవలం చదివాను. ఇప్పటికైతే విశ్లేషించే సమయం లేదు. సాయంత్రం వరకు వాటికి వివరంగా వ్యాఖ్యలు వ్రాస్తాను.

  రిప్లయితొలగించండి
 15. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  రెండు పూరణలూ బాగున్నాయి. అభినందనలు.
  మొదటి పూరణలో "వరహాలపు మూట" అన్నారు. వరహాల మూట అనడమే కరెక్ట్. దానిని "వరహా ల్గల మూట" అనవచ్చు.

  రిప్లయితొలగించండి
 16. నారాయణ గారూ,
  మీ పూరణ చాలా బాగుంది. అభినందనలు.

  మంద పీతాంబర్ గారూ,
  ధన్యవాదాలు.
  మీ పూరణ నిర్దోషంగా, అద్భుతంగా ఉంది. అభీనందనలు.

  శ్రీ గారూ,
  మీ ఉత్సాహం, ప్రయత్నం అభినందనీయం.
  అయితే మీ పద్యంలో గణ యతి ప్రాసలు తప్పాయి. దానిని ఇలా సవరించాను.

  మిరియములు శొంఠి నూరియు
  మురిపెమ్మునఁ ద్రాగు మనుచు ముసలవ్వ యిడన్
  నెఱి సూది మందె నయమని
  జ్వర పీడితుఁ డచటినుండి జారుకొనెఁ గదా!

  నచికేత్ గారూ,
  మీ పూరణ ఉత్తమంగా ఉంది. అభినందనలు.

  గన్నవరపు వారూ,
  "ప్రమాదో ధీమతామపి"

  చంద్రశేఖర్ గారూ,
  మంచి భావంతో సమస్యను పూరించారు. అభినందనలు.
  రెండవ పాదంలో యతి తప్పింది. దానిని ఇలా సవరించాను.

  కరమున మల్లెలు జుట్టియు
  త్వర చింతామణి వసతికి వచ్చెను పోలీ
  సరవఁగ చల్లఁగ కామ
  జ్వర పీడితుఁ డచటినుండి జారుకొనెఁ గదా!

  నేదునూరి రాజేశ్వరి గారూ,
  భావం బాగుంది. కాని గణ యతి దోషాలున్నాయి. నా సవరణ.....

  నరసమ్మ సిరంజినిఁ గొన
  ఫిరంగి వలెఁ గనఁబడినను భీతాత్ముడై
  జరిగిన గుండెను వదలక
  జ్వర పీడితుఁ డచటినుండి జారుకొనెఁ గదా!

  పీతాంబర్ గారూ,
  చంద్రశేఖర్ గారీ సమస్యకు మీ పూరణ పద్యం బాగున్నా, భావం మాత్రం సందిగ్ధంగా ఉంది.
  రెండవ పాదంలో గణదోషం ఉంది. దానిని " విలయకారుని" కంటే "విలయకరుని" అంటే సరిపోతుంది.

  రిప్లయితొలగించండి
 17. అరవము చదువుట రాకయె...
  అరుగుచు చెన్నై నగరిని హాస్పిటలొకటిన్...
  అరయగ ప్రసూతి గృహమని...
  జ్వరపీడితుఁ డచటినుండి జారుకొనెఁ గదా! :)

  రిప్లయితొలగించండి