17, సెప్టెంబర్ 2010, శుక్రవారం

సమస్యా పూరణం - 98

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
మూగ గొంతెత్తి పాడును రాగ మలర.

9 కామెంట్‌లు:

  1. నమస్కారమండీ, నా పూరణ:

    నీలి మొయిల రాశి నింగి జాఱినఁ దఱి
    వెలుగు చుక్కలు మాగి వెలితిఁ బోవ
    నిదుర సరియు లేక నిశయంత తఱుగంగ
    కాళ రాత్రియు నందుఁ గలలు చెదుర
    నిక్కుచు వెలిగిన నిండు చందురుమామ
    ప్రక్క కెక్కడొ పోవఁ బలుకు లేక
    సొక్కుచు సూర్యుండు సూపు కందని వేళ
    గ్రక్కున చేరకఁ గాంతు లుండ

    సంధ్య రాగము పొడవగఁ జదల యందు
    వేణు గానము మ్రోగగ వీనులందు
    హృదయ తంత్రులు మీటగ మదిని మురియు
    మూగ గొంతెత్తి పాడును రాగ మలర.

    నరసింహ మూర్తి.

    రిప్లయితొలగించండి
  2. చిన్ని పాపలు పశువులు చిందులేయ
    పరవశమ్మున నాడంగ ఫణి తన ఫణ
    మూగ గొంతెత్తి పాడును రాగ మలర
    గానమందు బాలుకు సాటి కానమెందు.

    రిప్లయితొలగించండి
  3. నిండు మబ్బులు గూడగ నింగిలోన
    నమిలి యొక్కటి జేరెను నకులములను
    తగులమున వెఱ్ఱి పుచ్చులు దాని చుట్టు-
    మూగ, గొంతెత్తి పాడును రాగ మలర!

    మా ఊళ్ళో నిజంగానే ఒక నెమలి, కోళ్ల గుంపులోకి వచ్చి చేరుకున్నది. కోళ్ళు దాని చుట్టూ మూగితేనే దానికి ఉత్సాహం. శ్రమ అనుకోకపోతే ఈ వీడియోలింకును చూడండి: http://www.archive.org/details/NemaliNemaliNatyamadave

    రిప్లయితొలగించండి
  4. తన్వి మెలమెల్ల కుసుమలతానికుంజ
    మూగ గొంతెత్తి పాడును రాగ మలర!
    ఆమె యెవరు?గంధర్వ లలామ?కాదు.
    మేడ పైన తిరిగెడి నా మేనిసగము :-)

    (మేనిసగము - అర్ధాంగి)

    రిప్లయితొలగించండి
  5. నరసింహ మూర్తి గారూ,
    మనోహరమైన సీసపద్యంతో అలరించారు. ధన్యవాదాలు.

    ఫణి ప్రసన్న కుమార్ గారూ,
    "శిశుర్వేత్తి పశుర్వేత్తి" శ్లోక భావాన్ని చక్కగా పద్యంలోకి దించారు. బాగుంది. ధన్యవాదాలు.

    నారాయణ గారూ,
    మంచి పూరణ. అభినందనలు. వీడియో లింకు ఇచ్చినందుకు ధన్యవాదాలు.

    రవి గారూ,
    ముగ్ధ మనోహరమైన పద్యంతో ప్రబంధ రీతిని తలపించారు. నా బ్లాగులోకి చేరిన ఉత్తమ పద్యాలలో నిస్సందేహంగా ఇది ఒకటి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. నా పూరణ .......

    అపరిమితమైన దేవుని కృప గలిగిన
    నంధుఁడైనను వీక్షించు నందములను
    కుంటివాఁడైనఁ దాఁ బరుగులను తీయు
    మూగ గొతెత్తి పాడును రాగ మలర.

    రిప్లయితొలగించండి
  7. శంకరయ్య గారూ
    నాకు ఫణిప్రసన్నగారు,నారాయణగారు,రవిగారు వ్రాసిన పద్యాలు బాగా నచ్చాయి. మీ పూరణము అమోఘము. మనస్సును ఆకట్టుకొనేట్టు ఉన్నది. నారాయణ గారి పుణ్యము వలన నెమలి నృత్యము చూడడమే కాక నమిలి వంటి పర్యాయ పదాలను నేర్చుకొన్నాను.

    రిప్లయితొలగించండి
  8. శంకరయ్య మాస్టారు, నా పద్యం చూసి ఏదో నవ్వుకుంటారనుకుంటే, మోయలేనంత పెద్ద కితాబునిచ్చారు. మీ వంటి పెద్దలు నేర్పించిన విద్య కాబట్టి, మీకూ చెందుతాయి,

    నారాయణ గారు, నకులము అంటే ముంగిస కదండి?కోళ్ళు అన్న అర్థం కూడా ఉందా?

    రిప్లయితొలగించండి
  9. నకులి అంటే కోడిపెట్ట అని అర్థం, నాట్యం చేసేది మగ నెమలి కనుక, బానే ఉంటుందిలెమ్మని ప్రయోగించాను. తప్పైతే క్షమించాలి.

    రిప్లయితొలగించండి