10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

చమత్కార పద్యాలు - 19

దశావతార స్తుతి - 3 (వరాహావతారం)
శా.
ఆద్యాలోకన భక్తి సంభ్రమదనేహః పూరుషత్యక్త స
త్పాద్యాంభస్తులసీ భ్రమప్రద ఖురప్రక్షాళనా మాత్ర జా
గ్రద్యోగాంబుధి దంష్ట్రికాగ్ర రిపు హృత్కాలామిషప్రాయ శుం
భద్యాదోనిధి సప్తకీస్థలి కిటిబ్రహ్మం స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్ది)
భావం -
వరాహ రూపుడవైన పరమాత్మా! సముద్ర జలం నీ డెక్కలు కడుగుకొనడానికే సరిపోతుంది. నీ దంష్ట్రాగ్రం పైన నిలిచిన సముద్రమే మొలత్రాడుగా గల భూమి శత్రువు హృదయాన్ని చీల్చగా అంటుకొన్న నల్లని మాంసపు ముక్క వలె ఉంది. ఈ రెండూ (సముద్ర జలం, భూమి) నిన్ను ఆకస్మికంగా చూడగానే భక్తి సంభ్రమాలతో కాలపురుషుడు సమర్పించిన పాద్యం, తులసీ దళాల వలె ఉన్నాయి. అటువంటి నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.
వివరణ -
విష్ణువు వరాహావతారాన్ని ధరించాడు. హిరణ్యాక్షుణ్ణి సంహరించి భూమిని ఉద్ధరించాడు. ఆ సమయంలో సముద్రం ఆ వరాహం డెక్కలు కడుగుకొనడానికి (డెక్కలు మాత్రమే మునగడానికి) సరిపోయింది. సముద్రమే మొలనూలుగా గల భుమిని తన దంష్ట్ర పైన నిలిపాడు. శత్రువు హృదయాన్ని చీల్చగా ఆ కోరకు అంటుకున్న నల్లని మాంసం ముక్క లాగా భూమి ఉంది. ఆ సముద్ర జలం, ఆ భూమి రెండూ ఎలా ఉన్నాయంటే, విష్ణువు యొక్క వరాహ రూపాన్ని అకస్మాత్తుగా చూడగానే భక్తి, సంభ్రమాలతో కాలపురుషుడు అతన్ని పూజించి సమర్పించిన పాద్యం, తులసీదళం వలె ఉన్నాయి. అటువంటి వరాహరూపుడవైన ఓ పరమాత్మా! నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి