30, సెప్టెంబర్ 2010, గురువారం

సమస్యా పూరణం - 110

కవి మిత్రులారా,
ఈ రోజు పూరించ వలసిన సమస్య ఇది ...........
కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు.
( 'వరవిక్రయం' నాటకంలోని ఈ పద్య పాదాన్ని సమస్యగా ఇవ్వమని సూచించిన నేదునూరి రాజేశ్వరి గారికి ధన్యవాదాలు )

15 కామెంట్‌లు:

 1. శంకరయ్య గారూ నమస్కారములు, నా పూరణ :


  తరణి మధియింపఁ వెలుగులు ధరణి కొచ్చె
  జలధి మధియింపఁ జల్లని చంద్రు డొచ్చె
  కట్టె మధియింపఁ మధియింపఁ గలుగు నిప్పు
  బుధ్ధి మధియింపఁ జ్ఞానముఁ బుణ్యు నొచ్చెఁ.

  రిప్లయితొలగించండి
 2. ఈ రోజు బాబ్రి మసీదు తీర్పు గావున, దేవుని శాంతి ప్రసాదింప గోరుతూ...

  యాగమయెను భరత భూమి
  కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు
  చందమున! మనసు గల్గని
  మతమేది దేవ? కనువిప్పు నిడు మాకున్!

  రిప్లయితొలగించండి
 3. రాముడేబుట్టి యుండెనో రాజ్య మేల!
  లేక బాబరే కట్టేనో యొక మసీదు!
  పాత విషయముల్ చర్చించి ఫలిత మేల?
  కట్టె మధియింపఁ మధియింపఁ గలుగు నిప్పు.

  రిప్లయితొలగించండి
 4. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  ఎంత చక్కని పూరణ! బాగుంది. అభినందనలు.
  మీ పద్యంలో మూడుసార్లు "వచ్చె" అనడానికి బదులు "ఒచ్చె" అని ప్రయోగించారు. ఒచ్చె సాధుప్రయోగం కాదు.
  నా సవరణతో మీ పద్యం ...
  తరణి మధియింప వెలుఁగులు ధరణి కొనరె
  జలధి మధియింపఁ జల్లని చంద్రుఁ డెసఁగె
  కట్టె మధియింప మధియింపఁ గలుఁగు నిప్పు
  బుద్ధి మధియింప జ్ఞానము పూర్ణ మగును.

  శ్రీ గారూ,
  సమయోచితమైన భావంతో పూరణ పంపారు. అభినందనలు. కాని ఎప్పటిలాగే పద్యం విలక్షణంగా ఉంది. దానిని ఇలా సవరించాను.
  ఆగ మయ్యె భరతభూమి హద్దు లేక
  కట్టె మధియింప మధియింపఁ గలుఁగు నిప్పు
  చందమున; మనసులఁ గల్పు చక్కని మత
  మేది? పరమాత్మ! కనువిప్పు నిడుము మాకు.

  హరి గారూ,
  ప్రస్తుత ప్రసంగంతో పూరణ రక్తి కట్టింది. అభినందనలు.
  కాని రండవ పాదంలో యతి తప్పింది. ఆ పాదాన్ని ఇలా సవరించాను.
  రాముఁడే పుట్టి యుండెనో; రాజ్య మేలు
  బాబరు మసీదు కట్టెనో బాగుగాను
  పాత విషయముల్ చర్చింప ఫలిత మేమి?
  కట్టె మధియింప మధియింపఁ గలుఁగు నిప్పు

  రిప్లయితొలగించండి
 5. నాకు తెలిసిన దాంట్లో తప్పులు సవరించగలరని మనవి...
  గ ల ల; ల ల ల ల; ల గ ల;
  గ ల ల; ల గ ల; ల ల గ; ల ల ల ల ; గ గ;
  గ ల ల; ల ల ల ల; గ ల ల
  ల ల గ; ల గ ల; ల ల గ; ల ల ల ల; గ గ

  యాగమయెను భరత భూమి
  కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు
  చందమున! మనసు గల్గని
  మతమేల దేవ? కనువిప్పునిడు మాకున్!

  రిప్లయితొలగించండి
 6. శంకరయ్యగారూ నమస్కారములు. ఒచ్చె అనే పదము కలుపుతున్నపుడు తప్పేమో నని అనుమానము "వచ్చింది". సరే తప్పయితే గురువులు దిద్దుతారు చూద్దాము, ఒకవేళ మీరు దిద్దని యెడల మరల అడుగుదామని తలచాను. తప్పు చెప్పినందులకు కృతజ్ఞతలు. మీ సవరణ బాగుంది. ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి
 7. నమస్కారములు.
  తెలిసీ తెలియని నేను " ఇచ్చిన సమస్యలకు " అందరు స్పందించి మంచి మంచి పూరణలు ఇనుమడించిన ఉత్సాహంతొ రాసి పాల్గొంటున్నందుకు చాలా చాలా ఆనందం గా ఉంది.అందరికి ధన్య వాదములు + కృతజ్ఞతలు.

  రిప్లయితొలగించండి
 8. కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు
  వనము లెల్లను ఘోరాగ్ని వ్రేలు నటులె
  తిరిగి చిగురించి పెరుగును తీరు గాను
  లయము సృష్టిస్థితులవెల్ల గూడి యుండు.

  సూచన: కాలిఫోర్నియా వైల్డ్ ఫారెస్ట్ ఫైర్ ప్రతి సంవత్సరము చూసిన మీదట అదెంత సత్యం అనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 9. బాగా రాకున్నా పట్టు వదలక కూర్చొని చేసిన పూరణ- చిత్తగించండి:
  తే.
  సంఘమాయె రొచ్చిక దాని సంగతి వద
  లుమనబోకు;పోరాడ గెలుపె ఘటిల్లు
  కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు
  మాడు మ్రోడును గూల్చుట కడు సలీసు!

  రిప్లయితొలగించండి
 10. మట్టి పెకలించ పెకలించ మణులు పుట్టు.
  తమసు తరిగించి తరిగించి తనరు వెలుగు
  జలము మరుగంగ మరుగంగ జలద మలర
  కట్టె మధియింప మధియింప గలుగు నిప్పు.

  రిప్లయితొలగించండి
 11. అందరికీ నమస్కారములు. అయోధ్య తీర్పు వచ్చిన సందర్భమున శాంతిభధ్రతలకు భంగము కలుగక పోవడము ముదావహము. రామజన్మ భూమి దగ్గఱ ఇస్లాము మతస్థులు కూడా ప్రార్ధనలు చేయదలవడము దేముని గొప్పతనము.మన పెద్దలు చెప్పారు ,

  ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం
  సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి .

  దీనికి నా అనువాదము

  జలధర పతిత జలంబులు
  గలగల సెలయేళ్ళఁ బాఱి కడలిని జేరున్
  గొలిచెడి వేల్పుల మ్రొక్కులు
  వెలయంగాఁ బ్రీతిఁ జేరు విశ్వంభరునిన్.

  రిప్లయితొలగించండి
 12. శ్రీ గారూ,
  మీరిచ్చిన లక్షణం కందపద్యానిది. అందులోను లోపాలున్నాయి. నేనిచ్చిన సమస్య తేటగీతి. త్వరలోనే నేను మొదలు పెట్టబోతున్న "ఛందస్సు నేర్చుకుందామా?" శీర్షికను అనుసరించండి.

  రిప్లయితొలగించండి
 13. చంద్రశేఖర్ గారూ,
  మంచి భావంతో పద్యం చెప్పారు. బాగుంది. మూడవ పాదంలో యతి తప్పింది. దాని సవరణ ...
  "లయము సృష్టిస్థితుల నొందు నయముగాను"

  నారాయణ గారూ,
  భావం కొద్దిగ క్లిష్టంగా ఉన్నట్టు అనిపిస్తున్నది. నాల్గవ పాదంలో యతి తప్పింది.

  నేదునూరి రాజేశ్వరి గారూ,
  మీ పూరణ అద్భుతం. ధన్యవాదాలు.

  నరసింహ మూర్తి గారూ,
  ఎంత చక్కని శ్లోకాన్ని గుర్తు చేసారు? అనువాదం కూడా బాగుంది. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 14. గురువుగారు, నాలుగో పాదంలో ప్రాసయతి- డు-డు..? తప్పేనా..?:(

  రిప్లయితొలగించండి
 15. నారాయణ గారూ,
  అవును. తప్పే! ఎందుకంటే ప్రాసాక్షరానికి ముందు లఘువు, గురువులలో ఏది ఉంటే మిగిలిన చోట్ల కూడ అదే ఉండాలి.
  మీ నాల్గవ పాదంలో మొదట "మాడు" అని ప్రాసాక్షరానికి ముందు గురువు ఉంది. ప్రాసయతి స్థానంలో "కడు" అని లఘువు ఉంది. సందేహం తీరిందనుకుంటాను.

  రిప్లయితొలగించండి