8, సెప్టెంబర్ 2010, బుధవారం

చమత్కార పద్యాలు - 18

దశావతార స్తుతి - 2 (కూర్మావతారం)
శా.
ద్యూత్తంభద్గిరి కల్పితావతరణ ద్యోవాహినీ సంగమో
పాత్తేందూదయ నిష్పితౄణ జలధి ప్రారబ్ధ పుత్రోత్సవో
దాత్తత్పాత్త గజాశ్వ వన్యశన కన్యా గో మణీ దాన సం
పత్తి ప్రీణిత దేవఢుల్యధిపతి బ్రహ్మన్ స్తుమ స్త్వా మనున్.

(ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్ది)
భావం -
ఆకాశాన్ని అంటుతూ నిలిచిన మందర పర్వతం మీదనుండి దిగి వచ్చిన ఆకాశగంగతో సంగమించడం వల్ల చంద్రుడు జన్మించగా పితృ ఋణాన్ని తీర్చుకొన్న సముద్రుడు పుత్రోత్సవాన్ని ప్రారంభించి, ఏనుగు, గుఱ్ఱం, వనం, ఆహారం, కన్య, గోవు, మణులను దానం చేశాడు. ఈ విధంగా దేవతలను సంతోషపెట్టిన కమఠప్రభూ! నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.
వివరణ -
విష్ణువు కూర్మావతారాన్ని ధరించాడు. సముద్రమథనం సమయంలో మందర పర్వతం భూమిలో కూరుకుపోకుండా దానిని తన వీపున మోసాడు. దానివల్ల సముద్ర మథనం నిరాటంగా సఫలమయింది. ఆ సమయంలో ఆకాశగంగ మందర పర్వతం మీదుగా క్రిందికి దిగివచ్చి సముద్రునితో సంగమించింది. ఆ కారణంగా చంద్రుడు జన్మించాడు. పితృ ఋణాన్ని తీర్చుకున్న సముద్రుడు పుత్రోత్సవాన్ని జరిపించాడు. ఆ ఉత్సవానికి వచ్చిన దేవతలకు సముద్ర మథనం వల్ల లభించిన ఏనుగు (ఐరావతం), అశ్వం (ఉచ్చైఃశ్రవం), వనం (కల్పవృక్ష వనం), ఆహారం (అమృతం), కన్య (లక్ష్మి), గోవు (కామధేనువు), మణి (చింతామణి) మొదలైన వాటిని దానం చేసాడు. ఆ విధంగా సముద్రుడు దానం చేయడానికి మూల కారకుడై దేవతలను సంతోష పెట్టిన కూర్మావతారుడైన విష్ణుదేవుని స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి