18, సెప్టెంబర్ 2010, శనివారం

చమత్కార పద్యాలు - 26

దశావతార స్తుతి ( కల్క్యవతారం )
మ.
స్వమహాబాహు కృపాణకృత్త గళ తుచ్చ మ్లేచ్చ వీరచ్ఛటో
త్క్రమదాపాదిత పద్మినీ రమణ మధ్యచ్ఛిద్రఖస్వామికా
గమనానాస్ర పయఃపరాగ మథితక్ష్మా సౌర గంగా నదీ
భ్రమకృత్కీర్తిక కల్కిమూర్తిక పరబ్రహ్మం స్తుమస్త్వా మనున్.

( ఎలకూచి బాలసరస్వతి - 17 వ శతాబ్దం )
భావం -
కల్కిమూర్తివైన ఓ పరమాత్మా! నీ మహా బాహువు నందున్న ఖడ్గం చేత ఛేదింపబడిన కంఠ గుచ్ఛాలు గల మ్లేచ్చుల సముదాయం సూర్య మండలాన్ని ఛేదించుకొని వెళ్ళడం వల్ల మధ్యలో ఏర్పడ్డ ఛిద్రంలో కనబడే ఆకాశ నైల్యాన్ని చూచి ఆ సమయంలో గ్రహణం పట్టినదని అనుకొన్న వారికి భూమిపైన అంతటా స్నానార్థం గంగానది వచ్చిందనే భ్రాంతిని కలిగించేవాడా! నిన్ను స్తుతిస్తున్నాను - అంటున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి