3, మే 2013, శుక్రవారం

సమస్యాపూరణం – 1042 (కరమొప్పారెను వాని దేహము)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదములు.

16 కామెంట్‌లు:

  1. మిత్రులకు శుభాశీస్సులు.
    డా. ఫణీంద్ర గారు చెప్పినట్లు అందరి పద్యములను నిశితముగా కాకపోయినా కొంత వరకైనా సమీక్షించి గుణదోషములను తెలియజేయ వలసియున్నది. ఈ విషయములో అశ్రద్ధ జరుగుచున్న సంగతి నిజమే. మిత్రుల పద్యములను నేను అప్పుడప్పుడు చూస్తూ ఒక కొద్ది మందికి మాత్రమే సూచనలు ఇచ్చుచున్నాను. అందరి స్పందనలు ఒక లాగ ఉండవు. ఎవరి గుణము/దోషము చూపితే వారు ఏలాగున స్పందిస్తారో తెలియదు. అందుచేత కొందరి విషయములో నాకెందుకులే అనే యుంటున్నాను. అన్నీ శ్రీ శంకరయ్య మాస్టారు చూచుకుంటారులే అని. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  2. హరివర్యుండు రఘుప్రవీరునకు వాహంబై మహోత్సాహియై
    యరివీరాతి భయంకరుండునయి యొప్పారన్ దశగ్రీవుడ
    త్తరి శస్త్రంబుల వేసె వర్షము వలెన్ సామీరిపై నంతటన్
    కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్

    రిప్లయితొలగించండి
  3. ఎరుగంబోవక పుత్రియంచు నపుడా యిందీవరాక్షుండు భీ
    కరుడై దానవశక్తితో సుతను వేగన్ జేరె భక్షించగా
    నరయంబోయి స్వరోచి శస్త్రహతుజేయన్ నవ్యతేజంబుతో
    కరమొప్పారెను వానిదేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.

    రిప్లయితొలగించండి
  4. కరముల్ మోడ్చెను తా శిఖండి నిలిపెన్ కన్పట్ట నా పార్థుడే
    కరముల్ రెండిటి తోడ వైచె నపుడే కాఠిన్యమౌ బాణముల్
    హరినే దల్చుచు భీష్ము డప్పు డటనే హా యంచు తా గూలగా
    కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.

    రిప్లయితొలగించండి
  5. పండిత నేమానివారు మన్నించాలి. సమస్యలో శరాఘాతమ్ము అని చెప్పటం జరిగింది కాబట్టి ఒక్క శరము యొక్క ఆఘాతము అనే చెప్పుకోవాలి. అందుచేత "శస్త్రంబుల వేసె వర్షము వలెన్" అని అనేకములను ప్రస్తావించచ్చునా అని నా శంక. (అలాగే గోలివారుకూడా బాణముల్ అన్నారు) పైగా శరాఘాతం అని చెప్పాక శస్త్రంబుల వేసె అని కన్న బాణంబుల వేసె అనటం ఉచితం కదా అని మరొక శంక. ఒక బాణానికే కూలిన వాలిని లక్స్యంగా పూరించి ఉంటే బాగుండేదేమో యోచించండి.

    రిప్లయితొలగించండి
  6. శ్రీ శ్యామలరావు గారు అప్పుడప్పుడు ఈ బ్లాగు తెరమీదకు వస్తున్నారు. సంతోషము. వారికి శుభాశీస్సులు. శరమును శస్త్రము అని హాయిగా అనవచ్చును. శస్త్రము లన్నియు శరములు కావు కానీ శరములు శస్త్రములే. ఒక బాణము వేసెనా బాణ వర్షము చేసెనా అనే లఘు శంక ప్రధానము కాదు. ఆ దెబ్బకి/దెబ్బలకి ఆంజనేయుని శరీరము మరింత తేజస్సుతో ప్రకాశించినది అని సారాంశము. భావము బాగుగ నున్నప్పుడు అంతా బాగుగనే ఉన్నట్లే. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  7. శరణంబంచును వేడ నంబకయి నశ్రాంతమ్ముగా భీష్ముతో
    డ రణంబున్ పగ లేకయే సలిపె, దా డస్సెన్ విశేషమ్ముగా;
    శరముల్ భీష్మునిఁ గూల్చగా విడిచెనా శస్త్రంబునే గాంచుమా
    కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.


    రిప్లయితొలగించండి
  8. మ. హరివీరాగ్రణి దీర్ఘబాహుడు మహాహంకారసంభారపా
    మరతాంధకృశబుధ్ధియై యనుజునిన్ మ్రందింప నుంకించ స
    త్వరమే రామశరంబు వాలినొక గోత్రంబట్లుగా కూల్చినన్
    కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్

    రిప్లయితొలగించండి
  9. శ్రీ శ్యామల రావు గారూ! శుభాశీస్సులు.
    మీ భావముతో మంచి ధారాశుద్ధితో పద్యమును వ్రాసేరు. అభినందనలు. 3వ పాదములో చిన్న పొరపాటు దొరలినది. పామరతాంధకృశ బుద్ధియై అని అన్నారు. కృ ముందునున్న ధ గురువు కాలేదు. అందుచేత గణభంగము ఐనది. సరిచేయండి. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  10. శరవర్షమ్మున స్వర్ఝరీ సుతుడు ముంచన్ పార్థు నవ్వేళలో
    కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్
    విరులన్నిండిన మోదుగై క్షణమునన్! వివ్వచ్చునిన్ జూచి శ్రీ
    హరి చక్రమ్మున భీష్ము జంప నురికెన్ హర్యక్షమై యుగ్రతన్!

    రిప్లయితొలగించండి
  11. నేమాని వారన్నట్లు మూడవపాదంలో‌ గణభంగం దొర్లింది కదా. సరిజేసిన పాఠం క్రింద యిస్తున్నాను:

    మ. హరివీరాగ్రణి దీర్ఘబాహుడు మహాహంకారసంభారపా
    మరతాంధత్వవిమోహబుధ్ధి ననుజున్ మ్రందింప నుంకించ స
    త్వరమే రామశరంబు వాలినొక గోత్రంబట్లుగా కూల్చినన్
    కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్

    రిప్లయితొలగించండి



  12. అరివీరుల్ తన చుట్టుముట్టుచు,సహస్రాస్త్రమ్ములన్ వేయగా ,
    తురగంబుల్,గజముల్,రథమ్ములను నత్యుగ్రాస్త్రశస్త్రమ్ములన్
    బరిమార్చన్,గుపితాత్ములై నరునితో వారెల్లపోరాడగా,
    కరమొప్పారెను వానిదేహము శరాఘాతమ్ముచే నాజిలోన్.

    రిప్లయితొలగించండి
  13. శ్యామలీయం గారు!
    "శరాఘాతమ్ము అని చెప్పటం జరిగింది కాబట్టి ఒక్క శరము యొక్క ఆఘాతము అనే చెప్పుకోవాలి." అన్నది తప్పుడు వ్యాఖ్యానం అవుతుంది.
    ’బిల్వ పత్రార్చన’ అంటే ఒక్క బిల్వ పత్రంతోనే చేసే అర్చన కాదు గదా!

    రిప్లయితొలగించండి
  14. కవిమిత్రులు మన్నించాలి. కొన్ని ఈతిబాధల కారణంగా మిత్రుల పూరణలపై, పద్యాలపై వెంటవెంటనే స్పందించలేకపోతున్నాను. అందుకే పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి చేస్తున్నాను.
    చక్కని పూరణ లందించిన కవిమిత్రులు...
    పండిత నేమాని వారికి,
    హరి వేంకట సత్యనారాయణ మూర్తి గారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    శ్యామల రావు గారికి,
    మిసన్న గారికి,
    కమనీయం గారికి
    అభినందనలు, ధన్యవాదాల

    రిప్లయితొలగించండి
  15. సరసుండాతడు రాహులుండు వడిగా సామ్రాజ్యమున్ కోరుచున్
    విరసంబొప్పెడు శాపనార్థములతో వెంటాడగా మోడినిన్
    దరహాసోక్తుల బాణసంచు లిడుచున్ దండింపనా శూరుడే
    కరమొప్పారెను వాని దేహము శరాఘాతమ్ముచే నాజిలోన్

    రిప్లయితొలగించండి