27, మే 2013, సోమవారం

పద్య రచన - 354 (నస్యము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“నస్యము”
సీ.
పడిసెమ్ము పట్టినప్పటివేళ నీటిని
          హరియింప నెద్ది దివ్యౌషధమ్ము
హరికథల్ వినువేళ నరుదెంచు నిద్రయన్
          వ్యాధికై యెద్ది తుపాకి దెబ్బ
మఱచిపోయినయట్టి మాట తెల్పుటకునై
          యెయ్యది దేవీనిభృతవరంబు
రాజరాజులకైన రమణ యాచన సేయ
          జేయఁగా నెద్ది జేజేల చెట్టు
తే.గీ.
గట్టి లంకాకు కమ్మగా గాచి నూఱి
సుధయు హయ్యంగవీనంబు జనిపి పొగపు
పెట్టి బొబ్బిలికాయలో వేసినట్టి
పొడుము బీల్చనివార లీపుడమి గలరె?

(అజ్ఞాతకవి - 'శతావధాన సారము' నుండి)

6 కామెంట్‌లు:

  1. ధూమ పత్రంబులు దోహదపడునట
    ....అతి భయంకరములౌ వ్యాథులకిల
    ఆరోగ్యమునకు మహా హాని గలిగించు
    ....నలవాటులందు నస్యంబు నొకటి
    నస్యంబు సూరిజనములకు లక్షణ
    ....మ్మను పల్కులందు సత్యంబు డుల్ల
    మేనికే కాదది మానసమ్మునకేని
    ....నత్యంత భీకరమైన వైరి
    మతుల బోగొట్టు బట్టలన్ మరకలిడును
    దానమిడువాని చేయి క్రిందనయి యుండు
    నస్యదానంబునందు, జన్మజన్మములకేని
    ముక్కు పొడి నిషేధించుడీ ముదము గనుడి

    రిప్లయితొలగించండి
  2. ధూమ పత్రంబు పొయి మీద దోరగాను
    చూచి వేయించి నెయి వేసి చూర్ణముగను
    సున్నమింతయు గలుపుచు సొగసుగాను
    చేసి పీల్చిన స్వర్గమ్ము చేరువగును.

    రిప్లయితొలగించండి
  3. పట్టిన నశ్యపు పట్టును
    బట్టలు పాడౌను చేర భార్యయు తిట్టున్
    పట్టును తిత్తుల క్యాన్సరు
    పట్టును వీడుచును దాని పడవేయవలెన్.

    రిప్లయితొలగించండి
  4. ముక్కు పొ డుమును బీ ల్చగ ముక్కు నుండి
    కారు చుండును నల్లటి మురుగు ద్రవము
    చీ ద రింతురు జనములు చీ కొటుదురు
    పీ ల్చ బోకుడు నస్యము మీ ర లెపుడు .

    రిప్లయితొలగించండి
  5. లంక పొగాకు పొడిని
    పొంకముగా పీల్చి నంత పొంగును కవితల్
    జంకక మోదము నొందుచు
    సంకటములు లేక మున్ను సౌఖ్యము నొందెన్ !

    రిప్లయితొలగించండి
  6. కవిమిత్రులకు నమస్కృతులు.
    నస్యాన్ని పొగడి, తెగడి చక్కని పద్యాలను రచించారు. ధన్యవాదాలు.
    నా మట్టుకు నస్యం మంచిదే.. ఎందుకంటే మూడు తరాలుగా మూడు నాలుగు కుటుంబాలను నస్యం పోషించింది. అందులో మా కుటుంబం ఒకటి. ప్రస్తుతం మేము నస్యం వ్యాపారం చేయకున్నా అందరూ మమ్మల్ని 'నశపోళ్ళు' (నశ్యంవారు) అనే పిలుస్తారు.
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    సుబ్బారావు గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి