20, మే 2013, సోమవారం

పద్య రచన - 347 (బైరాగి)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
బైరాగి

15 కామెంట్‌లు:

  1. వైరాగ్యము గలిగినచో
    బైరాగిగ మారు జగము పట్టదు చూడన్
    వారని వీరని యుండదు
    వారిజ నాభునె మదినిడి భక్తిని గొలుచున్.

    రిప్లయితొలగించండి
  2. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  3. వైరాగ్యము నొంది యొకడు
    బైరాగిగ మారె నంట బాధలు మరువన్ !
    సైరంద్రిని గాంచి మనసు
    నైరాశ్యము వీడి మరలె నవ్యత కోరన్ !

    రిప్లయితొలగించండి
  4. వైరాగ్యమ్మె ధరించె రూపమనగా భాసిల్లుచున్ బూదియున్
    శ్రీరుద్రాక్షలు రుండమాలలు ఫణుల్ చెన్నొంద గాత్రంబుపై
    స్మేరాస్యుండును చిద్విలాసుడగు స్వామిన్ ధ్యాన నిష్ఠాపరున్
    బైరాగిన్ నగజాపతిన్ గొలిచెదన్ భక్త్యంజలిన్ గూర్చుచున్

    రిప్లయితొలగించండి
  5. రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    మీ పద్యం అద్భుతంగా ఉంది. అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. వైరాగ్యమ్ము కలుగుచో
    మారక యుండగ వలయును మనుజుని లోనన్
    మారిన స్థితిలో నటుయిటు
    మారుచు నున్న యెడ నెటుల మర్మముఁ దెలియున్?

    రిప్లయితొలగించండి
  7. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  8. వివిధ పురాణాల విషయాల వినగనే
    ....వైరాగ్య మొదవును స్వాంతమందు
    శవమును గొనిపోవు సమయాన కాటిలో
    ....వైరాగ్య మొదవు సంసారము పయి
    ప్రసవ వేదన చేత వనితల కక్కటా
    ....వైరాగ్య మొదవును పతిని గనిన
    అవెకాక క్షణికమౌనట్టి ఆవేశాల
    ....వైరాగ్య మొదవును వారి వారి
    స్థితి గతుల బట్టి యివి కావు స్థిరములెందు
    తీవ్ర వైరాగ్య మొదవుచో దీక్ష బూని
    ఆత్మ తత్త్వ నిష్ఠాపరు లగుచు తగిన
    సాధనమ్మున గనవలె సత్పదమ్ము

    రిప్లయితొలగించండి
  9. బైరాగి యనగ బిలుతురు
    వైరాగ్యము బూనుచుండు వారును బుడమిన్
    బైరాగులలో మోసపు
    బైరాగులు గూడ గలరు భద్రము మీ రల్ .

    రిప్లయితొలగించండి




  10. కలడు 'బైరాగి 'యనియెడి కవివరుండు
    ' నూతిలో గొంతుకలు ' వ్రాసె నూత్న రీతి ;
    రచన యధివాస్తవికత చే రంజనమ్ము
    సలుపు,పాఠకులను గాన జదువవలయు.

    రిప్లయితొలగించండి
  11. పండిత నేమాని వారూ,
    నిజమైన వైరాగ్యమేదో వివరిస్తూ చక్కని పద్యాన్ని చెప్పారు. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    ఆలూరి బైరాగిని గురించిన మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    1978లో “ఆలూరి బైరాగి సంస్మరణ సంచిక”ను శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు, శ్రీ ఆవుల సాంబశివరావు గారు, మా నాన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారల సంపాదకత్వంలో ఉపసంపాదకునిగా రూపొందించే సదవకాశం నాకు కలిగింది. అందులో “చీకటి నీడల్లో బైరాగి జాడ” అనే వ్యాసాన్నికూడా వ్రాశాను. అప్పుడు చెప్పిన పద్యం:

    నీ గళఘంటికాశ్రుతి వినిర్మలమై మధుమంగళార్థమై
    యాగువుఁ గొల్ప నార్తజనతాభ్యుదయాధ్వవినిర్మిమీషతో
    స్వాగతగీతికార్ద్రకృతి నాలురి వంశసుధాబ్ధిచంద్ర! బై
    రాగి మహాకవీ! హృదయరాగమునం దనియింపు మాంధ్రులన్.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  13. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ఉదయం ఈ అంశాన్ని ఇస్తున్నప్పుడు ఎవరైనా 'ఆలూరి బైరాగి'ని ప్రస్తావిస్తారో లేదో అని సందేహించాను. కమనీయం గారు ముందుగా ఆ ప్రసక్తి తెచ్చారు. ఇప్పుడు మీరు..
    ఎప్పడో వ్రాసిన ఇంత మంచి పద్యాన్ని చెప్పి అందరికీ ఆనందాన్ని కలిగించారు. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. ఏరాయైతే నేమని
    బీరాలు పలికి యెరుగని బిజినెస్ జేయన్
    జీరోకిఁ జేరి మిగలరె?
    బైరాగిగ! నెవ్వ రైన వైరాగ్యముగన్!

    రిప్లయితొలగించండి