12, మే 2013, ఆదివారం

సమస్యాపూరణం – 1050 (సింహమునకుఁ గరికి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.
ఈ సమస్యను పంపిన కవిమిత్రునకు ధన్యవాదాలు.

34 కామెంట్‌లు:

  1. బొచ్చు కుక్క నొకటి ముచ్చటగా పెంచె
    మదగజమును పెంచె మావటీడు
    ఏన్గు వీపు పైకి నెక్కుచు దిగు గ్రామ
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.

    రిప్లయితొలగించండి
  2. పార్వతిని భరించు వాహనమ్మని, గజ
    ముఖుని వదనమనెడు బుద్ధితోడ
    యొక్క కానలోన యొద్దిక గలుగగా
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.

    రిప్లయితొలగించండి
  3. ఆ తల్లీకొడుకులకు నమస్సులతో.........

    పార్వతిని భరించు వాహనమ్మని, గజ
    ముఖుని వదనమనెడు బుద్ధితోడ
    యొక్క కానలోన యొద్దిక గలుగగా
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.

    రిప్లయితొలగించండి
  4. ఉత్సవముల యందు నూరేగు శ్రీపతి
    తానె వైభవముగ నేను గెక్కి
    కుదిరె దేవళమున క్రొత్త మావటి - నర
    సింహమునకు గరికి జెలిమి కుదిరె

    రిప్లయితొలగించండి
  5. హరి నృసింహ రూపుడై యొప్పు చుండగ
    కరిముఖుండు చేర కరము కరము
    నురము నురము జేర్చి యొందిరి సుఖమట్లు
    సింహమునకు గరికి జెలిమి కుదిరె

    రిప్లయితొలగించండి
  6. ఆశ్రమంబున గల యడవి జంతువులగు
    సింహమునకు గరికి జెలిమి కుదిరె
    కర్కశత్వమునకు మారు పేరైనవి
    కూడ శాంత గుణము కూడి యుండు .

    రిప్లయితొలగించండి
  7. వనము లన్ని గొట్టి పట్టణమ్ములు జేయ
    వన్యజీవులు కడు వగపు నొందె
    మూగజీవు లప్డు మూకయై కెరలగ
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె !

    రిప్లయితొలగించండి
  8. మైత్రి కుదిరె ఫణికి మండూకమునకును
    సింహమునకు గరికి జెలిమి కుదిరె
    చెలగు నిదియె గదుర సృష్టి వైచిత్ర్యము
    మునుల యాశ్రమమున మున్ను జరిగె

    రిప్లయితొలగించండి
  9. శ్రీ సుబ్బారావు గారి స్ఫూర్తి తోనే ;

    కాంచు మదియె నౌర కణ్వమునీంద్రుని
    యారు పగఱు లేని యాశ్రమంబు
    వర్గ భేదము నెడఁ బచరింప జంతువుల్
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె !

    రిప్లయితొలగించండి
  10. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    ‘గ్రామసింహానికి, ఏనుగుకు’ స్నేహం కలిపారు. బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    మూడవ పాదంలో రెండు యడాగమాలూ దోషాలే.. ‘బుద్ధితోడ/నొక్క కానలోన నొద్దిక గలుగగా...’ అనండి.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    ‘నరసింహం’ అనే మావటిని ఉద్దేశించి మీరు చెప్పిన పూరణ బాగుంది. అభినందనలు.
    మున్యాశ్రమాలను ఉద్దేశించిన మీ రెండవ పూరణ కూడా బాగుంది. అభినందనలు.
    *
    పండిత నేమాని వారూ,
    నృసింహునకు, గజముఖునకు సఖ్యం కూర్చిన మీ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మీ రెండు పూరణలూ బాగున్నవి. అభినందనలు.
    రెండవ పూరణ మొదటి పాదంలో ‘అదియే యౌర’ అవుతుంది.

    రిప్లయితొలగించండి
  11. జంతువులను బట్టి జనరంజ కమ్ముగ
    నాట లాడఁ జేయు దీటు గాడు
    మద గజమ్మఁ దీర్చు విధిని పురుష
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె

    రిప్లయితొలగించండి
  12. మావటీడు రోజు మత్తేభమునకు తా
    నాకులలములనిడి సాకు చుండె
    భిన్న జాతియైన ప్రేమతో గల నర
    సింహమునకు గరికి జెలిమి కుదిరె .

    రిప్లయితొలగించండి
  13. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
    నమస్కృతులతో,

    అతివ మోము సొగసుఁ బ్రతిభటింపఁగఁ గోరి
    కమల చంద్రములకుఁ గలహ మొదవె;
    నడుము కతన నామె నడక కతము గాఁగ
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  14. ఏమి ఏల్చూరి వారి యూహ!
    సింహమధ్యను గజగమనను ఒకటి చేసినారు.

    రిప్లయితొలగించండి




  15. చిన్ననాటినుండి శిక్షణ బొందిన
    ' సర్కసందు 'గలవు జంతువులును,
    ఆటపాటలాడు నలవాటు చొప్పున
    సింహమునకు గరికి జెలిమి కుదిరె.

    రిప్లయితొలగించండి
  16. అవని యందు గజము యాజన్మ శత్రువు
    సింహమునకు ; గరికి జెలిమి కుదిరె
    నన్య హస్తితోడ ననుటయే భావ్యము ;
    హరికి కరికి నడుమ యంటు కల్ల

    రిప్లయితొలగించండి
  17. మునులు తపియించి పొందిన పుణ్య భూమి
    పాము కప్పకు రక్షణ పడగ నీడ
    మైత్రి మెలగుచు మృగములు చిత్ర ముగను
    సిం హము నకు గరికిఁ జెలిమి కుదిరె !

    రిప్లయితొలగించండి
  18. సహదేవుడు గారూ,
    మీ పూరణ బాగుంది. అభినందనలు.
    గజమ్ము టైపాటు వల్ల గజమ్మ అయింది.
    *
    గండూరి లక్ష్మినారాయణ గారూ,
    బాగుంది మీ పూరణ. అభినందనలు.
    *
    ఏల్చూరి మురళీధర రావు గారూ,
    అమోఘమైన ఊహతో ప్రశస్తమైన పూరణ చెప్పారు. అభినందనలు.
    పూర్వార్ధంలో కమల చంద్రములకు వైరం సహజమే కదా! అక్కడ కూడా మైత్రిని ప్రతిపాదిస్తే యుక్తంగా ఉండేదేమో?
    క్రింది నా సాహసాన్ని అన్యధా భావించకుండా మన్నించాలి.
    అతివ మోము సొగసు లవి యొక్కయెడఁ దోచి
    కమల చంద్రములకుఁ గలిగెఁ జెలిమి....
    *
    కమనీయం గారూ,
    మీ సర్కస్ పూరణ బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    విరుపుతో చక్కని పూరణ చెప్పారు. అభినందనలు.
    ‘గజము + ఆగర్భ..’ అన్నప్పుడు యడాగమం రాదు. సంధి నిత్యం. ‘గజమె యాగర్భ...’ అనండి.

    రిప్లయితొలగించండి
  19. రాజేశ్వరి అక్కయ్యా,
    సమస్య ఆటవెలది అయితే మీరు తేటగీతి వ్రాసారు.. ఫరవాలేదు. ఈ విధంగా సవరిస్తున్నాను.....
    మునులు తపియించి పొందిన పుణ్య భూమి
    పాము కప్పకు రక్షణ పడగ నీడ
    చెలగి చరియించు మృగములు సింహమునకు
    గరికి జెలిమి కుదిరె వింతగా వనమున.

    రిప్లయితొలగించండి
  20. రాయలబిరుదగును "రాజకంఠీరవ"
    తెలియ పెద్దన "కవిదిగ్గజమ్మె"
    ఆదరించెను కవి నాంధ్రభోజు డనగ
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.

    రిప్లయితొలగించండి
  21. రామకృష్ణ గారూ,
    మీ పూరణ ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ఒకసారి రాజేశ్వరి అక్కయ్య గారి పూరణపై నా వ్యాఖ్యను గమనించండి.

    రిప్లయితొలగించండి
  22. గురువు గారూ ! సూచనకు ధన్యవాదములు.

    అవని యందు గజమె యాగర్భ శత్రువు
    సింహమునకు ; గరికి జెలిమి కుదిరె
    నన్య హస్తితోడ ననుటయే భావ్యము ;
    హరికి కరికి నడుమ యంటు కల్ల

    రిప్లయితొలగించండి
  23. గురువు గారూ ధన్యవాదములు.శ్రీ ఏల్చూరి వారి పూరణ అద్భుతము.

    రిప్లయితొలగించండి





  24. అందరి పూరణలూ బాగున్నవి,అలరిస్తున్నవి.కాని,ఏల్చూరివారి,ఊకదంపుడు గారి పూరణలు విలక్షణంగా,ఇంకా అలరిస్తున్నవి.

    రిప్లయితొలగించండి
  25. మాన్య శ్రీమతి లక్ష్మీదేవి గారికి,
    మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారికి,
    మాన్యులు శ్రీ “కమనీయం” గారికి,
    మీ అభిమానాదరాలకు నమఃపూర్వక ధన్యవాదాలను తెలియజేసికొంటున్నాను.

    మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,

    పూరణను సహృదయంతో ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు.

    నేను పద్యంలో ఒక దళంలో వైషమ్యమూ, ఒక దళంలో సామరస్యమూ చిత్రీకరింపబడాలని భావించాను. మొదటి దళంలో కమలానికి, చంద్రునికి వైరం ప్రకృతిధర్మమే అయినా, ముఖసౌందర్యంతో ప్రతిభటించటం వల్ల పారస్పరికమైనదని ఉపమానుప్రాణితమైన హేతూద్ధారంతో తుల్యయోగం సంఘటింపబడుతున్నది. వైరసామ్యం ఉన్నప్పటికీ కమల చంద్రముల మైత్రీసాధనకు గమ్యమానత్వం లోకవిరుద్ధమూ, కల్పనలో అననుగతమూ కాబట్టి సాధ్యం కాదని ఆ చిత్రణను విడిచివేశాను. రెండవ దళంలో సింహానికి, కరికి వైరం ప్రకృతిధర్మమే అయినా మధ్యము తోనూ, గమనము తోనూ ఔపమ్యసామ్యం వల్ల విరుద్ధకార్యోద్భవమైన మైత్రీఘటన చెప్పబడింది. ఇది కాంతావర్ణనలో ఉద్దిష్టమైన అలంకారసమావేశం.

    అనుభవజ్ఞులు, సహృదయులు అయిన మీరు సూచించిన పరివృత్తికి ధన్యవాదాలు. ఎల్లెడల చెలిమిని కోరేవారు కనుక మీరు కలహాన్ని కూడా మైత్రిగా తీర్చిదిద్దారు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

    రిప్లయితొలగించండి
  26. ఏల్చూరి మురళీధర రావు గారూ,
    ధన్యవాదాలు.
    నేను మరీ అంత లోతుగా ఆలోచించలేదు. ఏదో చిత్తచాపల్యం అనుకోండి. మీ సహృదయతకు, సంస్కారానికి ప్రణామాలు.
    ఈ విషయంలో మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించమని హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  27. మిత్రులకు శుభాశీస్సులు.
    ఈ నాటి సమస్యకు అందరూ సందర్భోచితమయిన పూరణలు చేసిరి. మంచి విషయమునకు మంచి స్పందన. అందరిలోను డా. ఏల్చూరి వారి భావము మరియు శ్రీ రామకృష్ణ గారి భావము ప్రశంసనీయములు. అందరికి శుభాభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  28. అవును కదా ఈ రోజు ఉన్నమతి కుడా పోయింది [ అసలుంటేగా ? ] ధన్య వాదములు తమ్ముడూ !

    రిప్లయితొలగించండి
  29. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
    శ్రీ ఏల్చూరి వారి పూరణ శ్రీ రామకృష్ణగారి పూరణ విలక్షణముగా.. సలక్షణముగా నున్నవి.

    రిప్లయితొలగించండి
  30. ఊకదంపుడు రామకృష్ణగారి పూరణ పసందుగా నుంది.ఈ మధ్య దర్శన మివ్వలేదేమిటీ అని ఈ మధ్యనే తలచుకొన్నాను వారిని.

    రిప్లయితొలగించండి
  31. శునకమునకు పాలు సూకరంబిచ్చెను
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె.
    సఖ్యత గనరాదు సాటివారలమద్య
    జాతి మతను కులము జంపెజనుల !!!

    రిప్లయితొలగించండి
  32. గురువు గారికి,
    పండిత నేమాని వారికి,
    “కమనీయం” వారికి,
    నరసింహమూర్తి గారికి,
    హనుమచ్ఛాస్త్రి గారికి,

    ధన్యవాదాలను తెలియజేసికొంటున్నాను.

    రిప్లయితొలగించండి
  33. ఊరి సర్కసందు దూరదూరము నున్న
    రాము కరిగ నొప్ప సోము హరిగ
    ఆట విడుపు కాగ మూటలెత్తు నపుడు
    సింహమునకుఁ గరికిఁ జెలిమి కుదిరె

    హరి = సింహము

    రిప్లయితొలగించండి