12, మే 2013, ఆదివారం

పద్య రచన - 339 (మాతృదేవత)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“మాతృదేవత”
నేఁడు ప్రపంచ మాతృదినోత్సవము.

21 కామెంట్‌లు:

  1. బిడ్డ బాధను తనదను పెద్ద మనసు
    తనదు యాయువు బిడ్డకు ధారపోయు
    శక్తి గలిగిన దామెకు సాటియేది?
    తల్లి ప్రేమకు పోలిక ధరణి గలదె?

    రిప్లయితొలగించండి
  2. బిడ్డ బాధను తనదను పెద్ద మనసు
    తనదు యాయువు బిడ్డకు ధారపోయు
    శక్తి గలిగిన దామెకు సాటియేది?
    తల్లి ప్రేమకు పోలిక ధరణి నేది?

    రిప్లయితొలగించండి
  3. మాతృ మూర్తులకు నమస్సులతో...

    ఇల జేరు ప్రాణి కోటికి
    తొలి వాకిలి తల్లి తాను తొలి గురువేరా
    వెలుగిచ్చు తాను కాలుచు
    మలిగేవరకెపుడు సంతు మనుగడ కొరకై.

    రిప్లయితొలగించండి

  4. అమ్మను మించిన దైవము
    ఇమ్మహిలో గానరాదు నెందున వెతకన్
    అమ్మయె తొలి గురువాయెను
    అమ్మకు జేజేలు గొట్ట హాయిని నిచ్చున్ .

    రిప్లయితొలగించండి
  5. నా కృతి సర్వమంగళా స్తోత్రము నుండి:

    అమ్మను రెండు వర్ణముల కద్భుత రూపము, భావ సౌకుమా
    ర్యమ్మును గల్గ జేసిన మహా మహిమాన్విత వందు నాది వ
    ర్ణమ్ము సృజించు లోకముల రంజిల జేయు లయింప జేయు నం
    త్యమ్ము ననూహ్య శక్తిమయమై వెలుగొందును సర్వమంగళా!

    అమ్మను రెండు వర్ణమ్ముల యందలి యద్భుత తత్త్వ వైభవం
    బిమ్ముగ బేర్కొనందరమె? యేరికి నేనియు నిండు ప్రెమలో
    నమ్మధురానుభూతియును నయ్యనుబంధము నమ్మహత్త్వమో
    అమ్మరొ మేమెరుంగుగలమా? జగదీశ్వరి సర్వమంగళా!

    అమ్మరొ! నీ కృపంగని మహత్త్వ కవిత్వ పటుత్వ సంపదల్
    సమ్మతి పొందుచుందురట సాదకు లవ్విధి నేను నీదు పా
    దమ్ములు నమ్మి కొల్తును ముదమ్మున నన్ను ననుగ్రహించి మా
    యమ్మ మహాఫలమ్మిడి కృతార్థుని జేయుము సర్వమంగళా!

    రిప్లయితొలగించండి
  6. నా 2వ పద్యములో ఒక చిన్న టైపు పొరపాటునకు సవరణ:
    నిండు ప్రేమలో అని సవరించ వలెను.

    రిప్లయితొలగించండి
  7. తల్లు లందఱికీ ప్రణామములు !

    తన తనువుఁ దనువు నిలుపుచుఁ
    దన రక్తముఁ బంచి యిచ్చి ధరణికిఁ దెచ్చున్
    తన సౌభాగ్యము సంతను
    దన తల్లిని మించునట్టి దైవము గలదే !

    రిప్లయితొలగించండి
  8. లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    *
    సుబ్బారావు గారూ,
    బాగుంది మీ పద్యం. అభినందనలు.
    మీ పద్యానికి కొన్ని సవరణలు.....
    అమ్మను మించిన దైవం
    బిమ్మహిలో గానగలమె యెందును వెతకన్
    అమ్మయె మన తొలి గురువగు
    నమ్మకు జేజేలు గొట్ట హాయి నొసంగున్.
    *
    పండిత నేమాని వారూ,
    అమ్మ యొక్క అద్భుత తత్త్వ వైభవాన్ని ఆవిష్కరించారు. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    మంచి పద్యాన్ని రచించారు. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  9. అమృత భాండము సురలకు హరియె పంచి
    మిగత జీవుల కెల్లను మేలు గూర్చ
    అమ్మ యనురాగ సుధలను అంద జేసె
    సృష్టి పోషణఁ జేసెడు శ్రేష్టు డైన
    మాతృ మూర్తుల రూపమ్ము మాధవుండె

    రిప్లయితొలగించండి
  10. అమ్మను రెండక్షరములు
    యిమ్ముగ విలసిల్లుచుండు నిలలో ; పలు లో
    కమ్ముల కమ్మయె యూతము;
    అమ్మను మించిన యమృతము యవనిన్ గలదే !?

    రిప్లయితొలగించండి
  11. సహదేవుడు గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    నాగరాజు రవీందర్ గారూ,
    చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
    కానీ ‘అమ్మ + అను’ అన్నప్పుడు యడాగమం వస్తుంది. ‘అక్షరములు + ఇమ్ముగ’ అన్నప్పుడు సంధి నిత్యం, యడాగమం రాదు. నా సవరణ...
    అమ్మ యనెడి రెండగు వ
    ర్ణమ్ములు విలసిల్లు గద ధర నిటు పలు లో.....

    రిప్లయితొలగించండి
  12. గురువు గారూ ! సూచనకు ధన్యవాదములు.

    అమ్మ యనెడి రెండగు వ
    ర్ణమ్ములు విలసిల్లు గద ధర నిటుల ; పలు లో
    కమ్ముల కమ్మయె యూతము;
    అమ్మను మించిన యమృతము యవనిన్ గలదే !

    రిప్లయితొలగించండి
  13. తల్లి మించు నట్టి దైవమ్ము లేదిల,
    జన్మ నీయ మనకు జన్మనెత్తు
    మరల, మొదటి గురువు మహిని, దేవుడు తన
    బదులు తల్లి జేసె బంచ సుధను.

    రిప్లయితొలగించండి
  14. మిస్సన్న గారూ,
    మీ పద్యం చాలా బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  15. అవని యందున దైవము అమ్మయెకటె
    అమ్మమించిన దైవమీ అవనిలేదు
    తనకు తానుగ బ్రహ్మయే తరలి వచ్చి
    అమ్మ రూపాన మనయింట నమరుకొనియె.

    కడుపునిండుగ నినుమోసి కనిననాడు
    తనదు స్తన్యంబు నందించి తనివిదీర
    మురిసిపోవును కష్టంబు మరచిపోవు
    తనదు సుఖములు మరచితా త్రాతయగును.

    చిన్నిపూవుల చేతుల చేరదీసి
    పొదివి కసుగాయలౌనట్లు పొదువుకొనెడు
    తనదు బిడ్డల భవితకై తల్లడిల్లు
    తరువు జూడగ తల్లియే తలపుకొచ్చు.

    అమ్మ నీచేతి ముద్దయే కమ్మనౌను
    అమ్మ నీప్రేమనాకెంతొ నాత్మబలము
    అమ్మ నీనోటి మాటయే ఆశయమ్ము
    అమ్మ నెరనమ్మి కొలిచెడి అంబనాకు.

    నిదురలేచిన దాదిగా నిన్ను తలచి
    నిలచియుండదు తానొక్క నిముసమైన
    నిజము బిడ్డలయాకలి నెరుగు నామె
    ఇలను పరికింప త్యాగాల నిలయమామె.

    మాతృ సంసేవనాభాగ్యమబ్బినట్టి
    సుతుల కిలలేదు కలిమికి శూన్యతెపుడు
    సకల శుభముల నందించు శక్తియామె
    సర్వ క్షేమంబు నరయునాసక్తియామె.

    ఆడపుట్టుకలోననే అందముంది
    ఆడపడుచటంచునుకొనియాడబడుచు
    ముద్దుమురిపాల పెరుగుచు ముదితతాను
    అమ్మచెంతనె నేర్చును అమ్మదనము.

    ఆదివిష్ణువు తనుగూడ అమ్మకొరకు
    పుడమిపడతుల గర్భాన పుట్టలేదె
    అమ్మగోర్ముద్దలందలి కమ్మదనము
    చాలు చాలంచు పల్కెడు చవట యెవడు.

    బుడుతచేతులుపట్టుకు బుల్లిబుల్లి
    మాటలనునేర్పు, నేర్పును మంచిమాట
    నడకనేర్పును మురిపాన నడతనేర్పు
    ఆదిగురువన అమ్మయే అవనిలోన.

    ఆదిగురువైన అమ్మను ఆదరించి
    పిదప పితరులు,గురువులు పేర్మిమీర
    నేర్పు జీవితపాఠాల నెమరువేసి
    ప్రీతి నడతుము విశ్వవిఖ్యాతినంద.

    రిప్లయితొలగించండి
  16. పొట్టను రూపమిచ్చి, పలు పోటుల నోర్చుచు తొమ్మిదిన్ నెలల్,
    గట్టిగ వచ్చు నొప్పులను కాదనకుండ సహించి, బిడ్డకున్
    పెట్టియు జన్మ భిక్ష, తగు పేరిడి, ప్రేముడి పంచి పెంచి తా
    పట్టుచు పాలు, బువ్వ, గుణవంతుగ దీర్చెడి తల్లి! నీకు జై!

    రిప్లయితొలగించండి
  17. పింగళి శశిధర్ గారూ,
    ‘అమ్మ’ పైన అద్భుతమైన ఖండికను రచించి అలరింపజేసారు. అభినందనలు.
    మీ ఖండికలో అటనట అచ్చుల ప్రయోగం కనిపించింది. యడాగమ, నుగాగమాలు రావలసిన చోట అచ్చును ప్రయోగించటం దోషంగా పరిగణించడం లేదు. కాని తప్పక (ఉత్త్వ)సంధి జరుగవలసిన చోట అచ్చును ప్రయోగించడం దోషమే. అటువంటి ప్రయోగాలు ‘దైవము అమ్మ’, ‘నేర్చును అమ్మదనము’
    ‘తలపుకొచ్చు’ అన్నచోట ‘ఒచ్చు’ గ్రామ్యం.
    ‘ఎంతొ యాత్మ’ అనవలసిన చోట ‘ఎంతొ నాత్మ’ అన్నారు.
    ‘శూన్యత యెపుడు’ అని యడామమం రావలసిన చోట సంధి చేసారు.
    *
    డా. ఆచార్య ఫణీంద్ర గారూ,
    మాతృమూర్తికి జైకొట్టిన మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    ఈ మధ్య తరచుగా బ్లాగును దర్శిస్తూ, సరసమైన పూరణలు చేస్తూ, జ్ఞానదాయకమైన చర్చల్లో పాల్గొంటూ ప్రేరణను కలిగిస్తున్నందుకు కృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి
  18. గురువు గారికి ధన్యవాదాలు. దోషాలు దిద్దుకొంటాను.

    రిప్లయితొలగించండి
  19. ప్రియ్ మిత్రులు శ్రీ శంకరయ్య గారు!
    తెలుగు భాషా మతల్లికి మీరు చేస్తున్న సేవ ముందు నా కృషి ఏపాటిది చెప్పండి. మీకు నా ధన్యవాదాలు!

    రిప్లయితొలగించండి
  20. @డా.ఆచార్య ఫణీంద్ర గారూ "మాతృదేవత" మీద మీ పద్యం చాలా బాగుంది.

    పొట్టను రూపమిచ్చి, పలు పోటుల నోర్చుచు తొమ్మిదిన్ నెలల్,
    గట్టిగ వచ్చు నొప్పులను కాదనకుండ సహించి, బిడ్డకున్

    రిప్లయితొలగించండి