29, మే 2013, బుధవారం

దత్తపది - 33 (తమ్ములు)

కవిమిత్రులారా!
"తమ్ములు"
పై శబ్దాన్ని ప్రతి పాదాదిలో నిల్పుతూ
భారతార్థంలో కందపద్యాన్ని కాని, ఉత్పలమాలను కాని వ్రాయండి.

(ఆశావాది వారి 'అవధాన కౌముది' నుండి)

23 కామెంట్‌లు:

  1. ద్రౌపది ధర్మరాజుతో..

    తమ్ములు పోవరులే పం
    తమ్ములు తమ మాట వినును తగ నైదగు భూ
    తమ్ములు మీరే కన నా
    తమ్ములు నూరైన గాని తమసరి రారే !

    రిప్లయితొలగించండి
  2. తమ్ములు నల్వురున్ సముచితమ్ముగ సేవలు చేయుచుండ వి
    త్తమ్ములు కోశమందు నమితమ్ముగ నిత్యము జేరుచుండ నే
    స్తమ్ములు భేషనన్ జనహితమ్ముగ రాజ్యమునేలె సాధు వ్రా
    తమ్ముల కాప్తుడై నృపతి ధర్మతనూజుడు ప్రాభవమ్ముతో

    రిప్లయితొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  4. తమ్ములు ద్రౌపది కన్నులు
    తమ్ములు భీమాదులు గద ధర్మేంద్రు నకున్
    తమ్ములు ధృతరాష్ట్ర సుతులు
    తమ్ములతో పోరు సలిపె ధర్మము కొఱకై

    రిప్లయితొలగించండి
  5. సంధికై దూతగఁ బంపుచు ధర్మరాజు కృష్ణునితోఁ బలికిన మాటలు-

    తమ్ములు కౌరవులను, జే
    తమ్ములు సంధిని వరించు దారి నడిపి, పం
    తమ్ములు వీడెడు, సంగా
    తమ్ములు పెనుపొందు నుడులఁ దనుపుము కృష్ణా!

    రిప్లయితొలగించండి
  6. తమ్ములు నలుగురు కడును
    త్త మ్ములు గాదె మ ఱి ని యల ధర్ముజు నకునున్
    తమ్ములు గడు బలవంతులు
    తమ్ములు నా వారె ధరణి దగుదురు మిగులన్ .

    రిప్లయితొలగించండి
  7. తమ్ములతోడఁ గూడి చనె ధర్మజుడత్తరి జూదమాడగా
    తమ్ములతోడఁ గూడి చనె ధర్మముఁ దప్పక కానకైన నా
    తమ్ముల వీడకుండ చనె స్వర్గము కైనను తోడు తానుగా
    తమ్ములు భాగ్యమెంతదొకొ తండ్రిని మించిన యన్న నీడలో?

    రిప్లయితొలగించండి
  8. శ్రీ శంకరయ్య గురువర్యులకు, శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో ,
    శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాదములు
    =========*==========
    కర్ణునితో కుంతి వేడుకోలు

    తమ్ములు పాండవ పుత్రులు,
    తమ్ములు సేవకు నిలచిరి,తక్షణ ముననే
    తమ్ములు గల వీరుడ,పం
    తమ్ములు వలదిక,వదలక తమ్ముల కరమున్ .

    తమ్ములు పాండవుల్ నిలచె తక్షణ సేవలు జేయ కర్ణ పం
    తమ్ములు వీడి పాండవుల ద్రాసము ద్రుంచుము,జోలి బట్టితిన్
    తమ్ములు యుద్ధ రంగమున దప్పులు జేయ వధించ వద్దు రా
    తమ్ములు,వారి రాజ్యమును ధర్మము దప్పక నిచ్చు నాయనా ।

    రిప్లయితొలగించండి
  9. తమ్ములు కారె వారు? విహితమ్ములు కోరగ రాదె? ఐదు ప్రాం
    తమ్ములు మాకునివ్వ ముదితమ్ములు గావె మనంబులిట్లు? గో
    తమ్ములు నింపు విత్త సహితమ్ములు వచ్చునె వెంట? భీమ ఘా
    తమ్ములు పొంది పాప ఫలితమ్ములు కానరె యుద్ధమందునన్?

    రిప్లయితొలగించండి
  10. ఈ రోజు కవివర్యుల పూరణలు వైవిధ్యముగా, అద్భుతంగానున్నవి,
    శ్రీ నేమాని గురువర్యుల పూరణ మరియు శ్రీ జిగురు సత్యనారాయణ గారి పూరణ అద్భుతంగానున్నది

    రిప్లయితొలగించండి
  11. తమ్ములుఁ జేసినట్టి దురితమ్ములఁ సైచి విచిత్ర రీతి పం
    తమ్ములు జేరనీయక ధృతమ్ముగ సత్పురుషాళి సేవ శా
    స్త్రమ్ములు చెప్పురీతి మహితమ్ముగ సల్పుచు శాంతచిత్తుడై
    తమ్ములు సేవజేయ నుచితమ్ముగ నుండె యుధిష్ఠిరుండటన్.

    రిప్లయితొలగించండి
  12. అయ్యా! శ్రీ సంపత్కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులు.
    మీ పద్యము చాలా బాగుగ వచ్చినది. అభినందనలు. 3వ పాదాదిని శాస్త్రమ్ములు అని వాడుట వలన దత్తపది నియమము పాటింబడలేదు. ఆ పాదమునకు బదులుగా "పొత్తమ్ములు" అని వాడితే బాగుంటుందేమో పరిశీలించండి.

    అందరు కవి మిత్రులారా! శుభాశీస్సులు.
    మీ అందరి పూరణలు చాలా బాగుగ నున్నవి. మీ ప్రశంసలకు ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  13. జిగురువారి పూరణ చూత పూతమ్ముల వలె నున్నది.

    రిప్లయితొలగించండి
  14. తమ్ములు దోడు గాగ విహితమ్మగు ధర్మము దప్పబోక నే
    స్తమ్ముల వోలె నెల్లరను ధర్మజు డేలెను శాంతి మీర! నా
    తమ్ములు భ్రాత మాట జవ దాటక రాజ్యము గాచినారు కం-
    దమ్ముల వోలె భారతము తద్దయు వెల్గెను నాకమో యనన్.

    రిప్లయితొలగించండి
  15. శ్రీ నేమాని గురువర్యులకు ధన్యవాద శతము.

    మీరు చేసిన సూచన, సవరణ సర్వదా ఆమోదయోగ్యమే.

    ఎంతో కాలంగా నాకు ఒక సందేహము ఉండేది. ఉదాహరణకు, "గము" అనే దత్తపది ఇచ్చారనుకోండి. ఉగ్రము అని వ్రాయవచ్చా లేదా అని. మార్గము, వర్గము అనే పదములు సర్వదా ఆమోదయోగ్యమనుకొంటాను.

    ఇప్పుడు మీరు చేసిన సూచనతో "గము" అనే దత్తపదికి "ఉగ్రము" అని పూరణ చేయడము తప్పవుతుందనుకొంటాను. దయచేసి తెలుపవలసినదిగా ప్రార్థన.

    రిప్లయితొలగించండి
  16. అయ్యా! శ్రీ సంపత్ కుమార శాస్త్రి గారూ! శుభాశీస్సులుమీ ఊహ లెస్సగనే ఉన్నది. గము అని సమస్య ప్రారంభమగుచో గము వర్ణములకు ముందుగా ఏ విధములైన చేర్పులనైన చేయవచ్చును - కానీ గ్రము గ్లము వలె గ తరువాత ఏ మాత్రను కలుప రాదు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  17. మరొక ప్రయత్నం:

    తమ్ములు! ధర్మరాజు కనుదమ్ములు! లోకుల రెల్లవారి నే-
    స్తమ్ములు! సోయగాన విరిదమ్ములు! నెంచగ సాధ్వి కృష్ణ వి-
    త్తమ్ములు! కుంతి పుణ్య ఫలితమ్ములు! వర్తనమందు నీతి పొ-
    త్తమ్ములు! వాసుదేవుని హితమ్ములు! నిమ్ముగ పాండు నందనుల్.

    రిప్లయితొలగించండి
  18. తమ్ములవిందుని సుతునకు
    తమ్ములు నీ కైదుగురని తల్లియె దెల్పెన్
    తమ్ములని కర్ణు డెఱుగక
    తమ్ములు పాండవుల తోడ తగవును గోరెన్

    రిప్లయితొలగించండి
  19. తమ్ములు నలుగురు ధర్మజు
    తమ్ములు కడు వీరు లైన ధార్మిక నిరతిన్
    తమ్ములు వినయము నుందురు
    తమ్ములు తన వెంట చనిరి దండక మైనన్ !

    రిప్లయితొలగించండి
  20. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ!
    శుభాశీస్సులు,
    మీ పద్యములు చాల బాగుగ నున్నవి. కను + తమ్ములు = కందమ్ములు అని మీరు వేసేరు. వ్యాకరణపరముగా అది మంచిదే. కానీ దత్తపది నియమము ప్రకారము పాదాదిలో తమ్ములు అని మాత్రమే యుండాలి కదా. ఈ నియమమోల్లంఘన జరిగినది. విసంధిగా చేస్తే ఆ నియమోల్లంఘన ఉండదు కానీ ఏదో ఇబ్బంది కనిపిస్తుంది చదువుటలో కూడా. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  21. తమ్ములు దప్పిని వెడలిరి
    తమ్ములు రారయ్యె తిరిగి దారిన వెతలన్
    తమ్ములు యక్షుని బారిన
    తమ్ములు జిక్కెనొ యటంచు ధర్మజు డరిగెన్ !

    రిప్లయితొలగించండి




  22. అందరిలోకి,శ్రీజిగురు సత్యనారాయణ గారి పూరణ ఉత్తమంగా ఉన్నది.అభినందమలు.

    రిప్లయితొలగించండి
  23. కవిమితులకు నమస్కృతులు.
    అసలే అస్వస్థత... ఆపై తప్పనిసరిగా వెళ్ళవలసిన పెళ్ళిళ్ళు... బ్లాగుకోసం సమయం కేటాయించలేకపోతున్నాను. మన్నించండి.
    నిన్నటి దత్తపదిని సమర్థంగా పూరించిన ‘కవి కపోతమ్ములు’...
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    పండిత నేమాని వారికి,
    నాగరాజు రవీందర్ గారికి,
    గుండు మధుసూదన్ గారికి,
    సుబ్బారావు గారికి,
    లక్ష్మీదేవి గారికి,
    వరప్రసాద్ గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    మిస్సన్న గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి