15, మే 2013, బుధవారం

సమస్యాపూరణం – 1053 (కుందేలుకుఁ జూడఁ జూడ)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
కుందేలుకుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే.
(అరక్కోణంలో ఆశావాది వారి అష్టాధానము)

40 కామెంట్‌లు:

  1. ఇందేమి చిత్రమున్నది?
    అందముగా రెండు కొమ్ములట "క" "ల" లకవే
    విందగు నుత్త్వపు గుర్తులు
    కుందేలుకు జూడ జూడ కొమ్ములు రెండే

    రిప్లయితొలగించండి
  2. అయ్యా! శ్రీ శంకరయ్యగారూ!
    వ్యాకరణపరముగా కుందేలునకు అని ఉండవలెను కదా! స్వస్తి.

    రిప్లయితొలగించండి


  3. ' కందేల ' వ్రాసినావుర
    'కుందేలు ' ను వ్రాయలేవ కొమ్ములుదిద్దన్
    'మందుడ ' కాకును లాకును
    'కుందేలు ' కుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే.

    రిప్లయితొలగించండి
  4. ఆర్యా !
    కుందేలునకుండునుగద కొమ్ములు రెండే. ...అంటే సరి..

    రిప్లయితొలగించండి
  5. పొందికగ కొమ్ము లుండమి
    కందేలకు నందమేది కవివరులారా!
    అందముగ నాంధ్రమందున
    కుందేలుకుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే.

    రిప్లయితొలగించండి
  6. పొందికగ కొమ్ము లుండమి
    కందేలకు నందమేది కవివరులారా!
    అందముగ నాంధ్రమందున
    కుందేలున కుండు జూడఁ గొమ్ములు రెండే.

    రిప్లయితొలగించండి
  7. చందురుని కలంకారము
    నందములో సాటిలేనిదగు జంతువుగా
    బొందె యశమ్మను "కొమ్ములు"
    కుందేలునకుండు జూడ కొమ్ములు రెండే

    రిప్లయితొలగించండి
  8. అందరకూ నమస్సులు.

    ఈ రోజు మా మాతామహులు
    శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు, బాలా త్రిపుర సుందరి దంపతుల వైవాహిక దినోత్సవం.

    వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  9. కుందేటికనుట శుద్ధము
    కుందేలుకుననుట కొంత కొఱతయె నకటా
    యిందున దప్ప మరెందున
    కుందేలుకు జూడ జూడ కొమ్ములు రెండే??

    రిప్లయితొలగించండి
  10. అన్నయ్యగారు శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు గారికి, వదినమ్మగారు శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారికి వందనపూర్వకాభినందనలు.

    రిప్లయితొలగించండి
  11. ఆశీర్వాదము లాగమోక్తములు వేదాంత స్ఫురద్వైదుషీ
    ప్రాశస్త్యంబులు గార్హపత్య కలనా ప్రత్యగ్ర తేజఃఖనుల్
    రాశీభూత మహర్షి వాక్యకలనా రమ్యంబు లానంద వి
    ద్యాశాదంబులు మీకు, సంతతికి హృద్యశ్రీదముల్! వేదముల్!!

    రిప్లయితొలగించండి
  12. శ్రీ నేమాని రామజోగి సన్యాసిరావు, బాలా త్రిపుర సుందరి దంపతులకు వైవాహిక దినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  13. చందురిని సొగసు లన్నియు
    నందముగా దఱచి యుండు నా శశ ముఖమున్
    కుందనపు చంద మరయగ
    కుందేలుకుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే.

    రిప్లయితొలగించండి
  14. ఈనాడు శంకర జయంతి.
    **************************

    శాంభవి యొడిలోన సౌన్దర్యలహరియై
    ...........పవళించి యాడిన ద్రవిడ శిశువు!
    ఆనందహేల శివానందలహరీ త-
    ...........రంగభంగపు టబ్బురంపు దరువు!
    మూఢమతుల ఘన మోహ ముద్గరముచే
    ...........దారికి దెచ్చిన దండి గురువు!
    కరుణ చిప్పిల్లగా కనకధారై పేద
    ...........కాంతకు దొరికిన కల్ప తరువు!

    కాలడి గ్రామ దేవత కన్న బిడ్డ!
    అరయ నద్వైత దీప్తుల కాటపట్టు!
    భక్తి వేదాంత పటిమకు పట్టుగొమ్మ!
    శంకరుల కంజలి ఘటింతు సంస్మరింతు!

    రిప్లయితొలగించండి
  15. పందెము కట్టెనొకఁడిటుల:
    "పందికివలె కాళ్లుమూడు వచియింపఁ వనం
    బందునఁ గనినేఁ బట్టిన
    కుందేలుకు జూడ జూడ కొమ్ములు రెండే!"

    రిప్లయితొలగించండి
  16. పండిత నేమాని వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  17. నేమాని పండితార్యా!

    సీతారామ స్వరూపులైన
    మీకుభయులకును వైవాహికదినోత్సవ శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  18. ఈ వేళ వారి ధర్మదండం నుండి ఒకటి రెండు పద్యాలు డాక్టరు విష్ణునందన్ గారు పంచుకుంటారని ఆశిస్తున్నాను.

    రిప్లయితొలగించండి
  19. ఒకానొక అవధానములో శ్రీ మాడుగుల నాగఫణి శర్మగారు శ్రీ శంకరాచార్యుల కవిత్వము గురించి ఆశువుగా చెప్పిన పద్యము......

    వర రుచిరప్రకార గుణవార్ధి సమన్విత వృత్తరీతిలో
    స్ఫురదరుణప్రభావ పరిపూర్ణమనోహర వర్ణపర్ణమై
    నిరతనితాంతభక్తి భరణిన్ భలె తొల్కుచునున్నదైన శం
    కరగురు కావ్యఖండ రసఖండమఖండము ధర్మదండమున్.

    రిప్లయితొలగించండి
  20. గురుతుల్యులు శ్రీ నేమాని వారి పెళ్లి రోజు సందర్భముగా ...

    సకల శుభములు గలిగించు శంకరుండు
    ఆయు రారోగ్య సంపద లన్ని యిచ్చి
    కంటికిని రెప్ప యట్లయి కాచు గాత !
    తనర గురువులు నేమాని దంపతులను .

    రిప్లయితొలగించండి
  21. మా మనుమడు చి. రాంభట్ల పార్వతీశ్వర శర్మ (అష్టావధాని) ప్రస్తావించిన పద్యము "ఆశీర్వాదము లాగమోక్తములు........" మా గురువు గారు కీ.శే. రావూరి వేంకటేశ్వర్లు, శతావధాని గారు 15-5-1988 నాడు ఆశువుగా చెప్పి మమ్ము ఆశీర్వదించినది. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  22. శ్రీ మిస్సన్న గారి శైలి ధారాశుద్ధి భావనా పటిమ అమోఘములు. శంకరాచార్యులు గారి మీద రసజ్ఞమైన పద్యమును చెప్పి అందరినీ అలరించేరు. వారికి శుభాశీస్సులు అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  23. కుందేలును జూడ సరిగ ను
    ముందర భాగంబు నుండు బొ డి పులు తోడన్
    అందురు వానిని కొందఱు
    కుందేలుకు జూడ జూడ గొమ్ములు రెండే .

    రిప్లయితొలగించండి
  24. శ్రీయుత ' ఊకదంపుడు ' రామకృష్ణ గారికి నమస్కృతులు -

    "ముప్పది రెండేడుల యతి
    యిప్పుడమిని నేకధాటి నెటుల దిరిగెనో ?
    యెప్పుడెటుల బుధజనులను
    మెప్పించెనొ ? యెరుగ సాధ్యమే యితరులకున్ ?

    శైశవమ్ముననె భాషాప్రౌఢి జూపించి
    ప్రాజ్ఞుల నబ్బుర పరచినాడు ;
    ఒక పేదరాలి యార్తికి గుంది బంగారు
    తిష్య ఫలమ్ములందించినాడు ;
    తల్లి కష్టములకు దలడిల్లి పూర్ణా ఝ
    రిని నింటి ముందు పారించినాడు ;
    పోటెత్తు నర్మదా పూర్ణ ప్రవాహమ్ము
    నే యొక్క కడవ బంధించినాడు ;

    ఏన్గు నద్దములోన జూపించు రీతి
    నిగమ సారమ్ము దేటగా నిఖిల జగతి
    తెలిసికొనునట్లు భాష్యమ్ము నిలిపినాడు
    కువలయమున ధర్మము బాదు కొలిపినాడు !

    కవితల్లజుండయి కమనీయ రమణీయ
    సత్కావ్యముల బెక్కు సంతరించె ;
    బండిత ప్రవరుడై భాషా మహా ప్రౌఢి
    ద్రెళ్లు గ్రంథముల బరిష్కరించె ;
    భక్తవరేణ్యుడై పలు దేవతా స్తోత్ర
    సంచయమ్ముల బేర్మి సంఘటించె ;
    నుపదేష్ట యగుచు గీతోపనిషత్సూత్ర
    సార భాష్యమ్మును సంసృజించె ;

    మనుజ జన్మమ్ము నందు సామాన్యుడొకడు
    వేయి వేయేండ్లకైనను జేయలేని
    పనుల ముప్పది రెండేండ్ల ప్రాయమందె
    లీల సాధించి గురు పీఠి నేలగల్గె !

    కలి చెలరేగ లోకమున గాసట బీసటయై కృశించు ని
    ర్మల నిగమాంత వాక్యముల గ్రమ్మర నిల్పి సమస్త పాప పం
    కిలముల రూపుమాప గల కేవల శుద్ధ సనాతనార్ష వి
    ద్యల సమకూర్చె శంకరుడు తాత్వికపాళికి నొజ్జబంతియై "

    ( ధర్మదండం - అవతార సమాప్తి ఘట్టం నుండి )

    రిప్లయితొలగించండి
  25. శ్రీ విష్ణు నందనన్ గారి పద్యములు శ్రీ శంకరుల గురించి అద్భుతములు. మా హృదయపూర్వక అభినందనలు. స్వస్తి.

    రిప్లయితొలగించండి
  26. శ్రీ మిస్సన్న గారి ఆదిశంకర స్తుతి చిక్కని తెనుగు నుడికారాలతో అందముగా, పునః పునః పఠనానుకూలముగా రామణీయకముగా ఉంది . శివానంద లహరీ తరంగ భంగపు అన్న దగ్గర ఏదైనా వేరే పదము చేర్చితే బాగుంటుందేమో అని నా సూచన . తరంగం అభంగమైతే అందగిస్తుంది కదా !

    విద్వద్విద్యా వరిష్ఠులు - పండిత నేమాని గారికి సాదర కృతజ్ఞతాంజలులు .

    రిప్లయితొలగించండి
  27. మిస్సన్నగారూ మరొక్క విషయం - ' కనక ధారై ' , 'కనక ధారగ ' మారితే ఎలా ఉంటుంది ?!

    రిప్లయితొలగించండి
  28. శ్రీ శ్రీ శ్రీ గురువర్యులు నేమాని రామజోగి సన్యాసిరావు గారికి,శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారికి వందనపూర్వకాభినందనలు.

    రిప్లయితొలగించండి
  29. మిత్రులారా!
    శుభాశీస్సులు.
    చాలా సంతోషము - మీరందరు మా వివాహదిన సందర్భముగా మాకు శుభాకాంక్షలను దెలిపి మమ్మానందింప జేసిరి.

    అభిమానము పెంపొందగ
    శుభాభినందనలనిడిన సుగుణోత్తమస
    ద్విభవులగు హితులకెల్లను
    శుభమస్తని దీవెనలను జొక్కుచు గూర్తున్

    రిప్లయితొలగించండి
  30. శ్రీ శంకరయ్యగురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో.
    గురువు గారు క్షమించాలి అప్ లోడ్ జేయు సమయమున పద్య రచన అంశంలో జేసియుంటిని
    =========*==========
    అందరి చంద్రుని కందగ
    వందనములతోడుగ బహు బంధనపాశం
    కుందేలుగ మారెనతడు,
    కుందేలుకు జాడ జూడ గొమ్ములు రెండే ।
    (చంద్రుడు = మన్మోహన్,బహు బంధనపాశం = బహు విధముల కుంభకోణముల పాపము, గొమ్ములు= మార్గములు )

    రిప్లయితొలగించండి
  31. శ్రీ నేమాని గురువర్యులకు మీ దీవెనలు మాకు శ్రీరామ రక్ష,ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  32. వందే జ్ఞానమహానిధాన మమలం వందే యతీంద్రం సదా
    వందే చిన్మయ రూపిణం శుభమతిం వందే కృపాసాగరం
    వందే సర్వ తమోఘ్న భాస్కర మహం వందే వివేకప్రదం
    వందే శంకర దేశికం బుధనుతం వందే జగఛ్ఛంకరం

    రిప్లయితొలగించండి
  33. డా. విష్ణునందనులకు ధన్యవాదములు.
    వారి ఆదిగురువుల స్తుతి అద్భుతం.
    వారి సూచనానుసారము క్రింది విధంగా మారుస్తున్నాను.

    శాంభవి యొడిలోన సౌన్దర్యలహరియై
    ...........పవళించి యాడిన ద్రవిడ శిశువు!
    ఆనందహేల శివానందలహరీ త-
    ...........రంగమాలికల తోరణపు మురువు!
    మూఢమతుల ఘన మోహ ముద్గరముచే
    ...........దారికి దెచ్చిన దండి గురువు!
    కరుణ చిప్పిల్లగా కనకధారగ పేద
    ...........కాంతకు దొరికిన కల్ప తరువు!

    కాలడి గ్రామ దేవత కన్న బిడ్డ!
    అరయ నద్వైత దీప్తుల కాటపట్టు!
    భక్తి వేదాంత పటిమకు పట్టుగొమ్మ!
    శంకరుల కంజలి ఘటింతు సంస్మరింతు!

    రిప్లయితొలగించండి
  34. ఆది దంపతుల వలె పూజ్య గురువులు , పండితోత్తములు , అవధాన సరస్వతి ఐన శ్రీ పండిత నేమాని రామ జోగి సన్యాసి రావుగారికి , వారి సతీమణి లక్ష్మీ సమాను రాలైన శ్రీమతి బాలా త్రిపుర సుందరి గారికి వివాహ దినోత్సవ సందర్భముగా హృదయ పూర్వక శుభాభి వందనములు .ప్రణామములతో

    అందముగా జెప్పెదరట
    చంద్రుని మోమందు గాంచ శశికమ్మునకే
    పొందుగ వెలయుచు నుండును
    కుందేలుకు జూడఁ జూడఁ గొమ్ములు రెండే !

    రిప్లయితొలగించండి
  35. ముందుగ నచ్చుల నేర్పెద
    కుందారపు మురళి! చెప్ప గొనకొను మిదిగో
    'కుందేలు' కెన్ని కొమ్ములు?
    కుందేలుకు జూడ జూడ కొమ్ములు రెండే

    రిప్లయితొలగించండి
  36. @శ్రీ పండిత నేమాని వారికి మీ వివాహ దినోత్సవ సందర్భముగా హృదయ పూర్వక శుభాకాంక్షలు.

    రిప్లయితొలగించండి
  37. శ్రీ శంకరాచార్యుల వారిని మిస్సన్న మహాశయులు చక్కగా ప్రస్తుతించారు.
    డా. విష్ణునందనుల వారి
    పద్యా లతి మధురముగా నున్నాయి. వారిరువురికీ మనఃపూర్వకాభినందనలు. తీరికగా మరోసారి చదువుకోవలసిన పద్యాలు.

    రిప్లయితొలగించండి
  38. కవిమిత్రులకు నమస్కృతులు.
    నిన్న బ్లాగులో పోస్ట్ చేసి ఊరికి వెళ్ళాను. ఈ తెల్లవారు జామున ఇల్లు చేరాను. అందువల్ల నిన్న బ్లాగు చూసి వ్యాఖ్యానించడానికి అవకాశం లేకపోయింది. మన్నించండి.
    *
    నిన్న పూజ్య నేమాని దంపతుల పెళ్ళిరోజు అని ఇంతకు ముందే తెలిసింది. నిన్న చెప్పలేక పోయాను. ఆలస్యంగానైనా ఆ పుణ్య దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతూ, వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీరామచంద్రుని వేడుకుంటున్నాను.
    ఈ సందర్భంగా వారికి బ్లాగు ముఖంగా శుభాకాంక్షలు తెలిపిన మిత్రులు... "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి, గన్నవరపు నరసింహ మూర్తి గారికి, గోలి హనుమచ్ఛాస్త్రి గారికి, రామకృష్ణ గారికి, మిస్సన్న గారికి, సుబ్బారావు గారికి, వరప్రసాద్ గారికి, రాజేశ్వరి అక్కయ్యకు, లక్కరాజు వారికి ధన్యవాదాలు.
    *
    ‘కుందేలుకు’ అన్న శబ్దం గురించిన నేమాని వారి, రాంభట్ల వారి వ్యాఖ్యలను చూసాను. ఆ సమస్యను ఆశావాది వారి ‘అవధాన కౌముది’ గ్రంధంలోనుండి స్వీకరించాను. ప్రయాణపు హడావుడిలో అందలి యుక్తాయుక్తవిచారణ చేయలేకపోయాను.
    *
    చక్కని పూరణలను అందించిన కవిమిత్రులు....
    పండిత నేమాని వారికి,
    గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
    గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
    "అష్టావధాని" రాంభట్ల పార్వతీశ్వర శర్మ గారికి,
    రామకృష్ణ గారికి,
    సుబ్బారావు గారికి,
    వరప్రసాద్ గారికి,
    రాజేశ్వరి అక్కయ్యకు,
    గండూరి లక్ష్మినారాయణ గారికి
    అభినందనలు, ధన్యవాదాలు.
    *
    శంకరాచార్యుల గురించి మంచి పద్యాలను రచించిన, పరిచయం చేసిన కవిమిత్రులు ....
    మిస్సన్న గారికి,
    సంపత్ కుమార్ శాస్త్రి గారికి,
    డా. విష్ణునందన్ గారికి,
    పండిత నేమాని వారికి,
    అభినందనలు, ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  39. డాక్టరు విష్ణునందన్ గారికి నమస్కృతులు -
    ఈ వ్యాఖ్య ఇంత ఆలస్యంగా వ్రాస్తున్నందుకు క్షమించవలసినది గా కోరుతున్నాను.
    ఆదిశంకరాచార్యుల వారి జీవితచరిత్రా సంగ్రహముగా - మీరు మీగ్రంధము నుంచి ఉటంకించిన పద్యాలు - అద్భుతాలు.

    అడిగినతడవున సమయం వెచ్చించి, శ్రమకోర్చి ఇచట మీ పద్యాలు ప్రచురించి, శంకర జయంతి నాడు మీ పద్యాలు చదివి ఆదిశంకరార్యులకు అంజలి ఘటించే అవకాశం కలిగించింనందులకు సర్వదా కృతజ్ఞుడను.

    భవదీయుడు
    ఊకదంపుడు

    రిప్లయితొలగించండి
  40. అందముగా రెండు చెవులు
    పొందికగా నుండు జూడ పొడవైనవిగా!
    మందును తెగ గ్రోలినచో
    కుందేలుకుఁ జూడఁ జూడఁ గొమ్ములు రెండే

    రిప్లయితొలగించండి