25, మే 2013, శనివారం

పద్య రచన - 352 (గోంగూర)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“గోంగూర”

12 కామెంట్‌లు:

 1. పరమ పావనమైన భరత ఖండమ్ములో
  ....నాంధ్ర ప్రదేశ మధ్యమున నొప్పు
  నగరమ్ము గుంటూరునకు మహాకీర్తిని
  ....దనరార జేసిన ఘనత నొప్పు
  శాకవిశేషమ్ము షడ్రసమ్ముల నదే
  ....యధిగమించుచునొప్పు నగ్రపీఠి
  గోంగూర పచ్చళ్ళు గోంగూర పులుసును
  ....బహువిధ పాక వైభవములలర
  నొకట వెల్లుల్లి, నీరుల్లి నొకట జేర్చి
  జన్మ జన్మలకు మరువజాలని గతి
  వెల్వరించుచు రుచులను విశ్వమందు
  నలరుచుండెడు గోంగూర నభినుతింతు

  అమరనాథుండు గొనిపోయె నమరపురికి
  సత్యభామ కోర్కెపై గొనిపోయె చక్రపాణి
  బళిర! మధురానగరికి, శాంభవియు చాల
  ప్రేమతొడ గోంగూరను పెంచు చుండె

  రిప్లయితొలగించండి
 2. రుబ్బి గోంగూర యాకులు రోటి యందు
  ఎండు మిర్చిని తాళింపు మెండు గాను
  పెట్టి కలుపగ పచ్చడి యట్టు లయ్యి
  తినుట మొదలిడ నోరూరి తిందు మెపుడు .


  రిప్లయితొలగించండి
 3. పుంటి కూరయంద్రు పుల్లగా నుండును
  పుల్లలన్ని దీసి పోసి యాకు
  పప్పు, పులుసు కూర, పచ్చడి యేదైన
  ఉల్లి గలిప చేయ నూరు నోరు.

  రిప్లయితొలగించండి
 4. ఈరోజు గోంగూర చెట్నీ మాయింట్లో.......

  ఆంధ్రమాతగా పేరొంది యమితమైన
  ఖ్యాతి గొనినట్టి గోంగూర కడుపు కాదు,
  మనము నింపును తృప్తిగ మనకునెపుడు,
  విందు నారగింపగ రండు పిలుచుచుంటి.

  రిప్లయితొలగించండి
 5. పండిత నేమాని వారూ,
  ఆంధుల అభిమాన శాకమైన గోంగూరను గురించి అద్భుతమైన పద్యాలను అందించారు అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  నిజంగానే మీ పద్యం నోరూరించింది. చాలా బాగుంది. అభినందనలు.
  *
  గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
  చాలా చక్కని పద్యం చెప్పారు. అభినందనలు.
  *
  లక్ష్మీదేవి గారూ,
  మనఃప్రీతిని కల్గించే పద్యం చెప్పారు. అభినందనలు.
  మీ ఆత్మీయ ఆహ్వానానికి ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి
 6. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ --- వావ్ ఏమి వర్ణన. గుంటూరు గోంగూర పద్యానికి కామెంట్ పెట్టకుండా ఉండలేను.
  పుంటి కూరయంద్రు పుల్లగా నుండును
  పుల్లలన్ని దీసి పోసి యాకు
  పప్పు, పులుసు కూర, పచ్చడి యేదైన
  ఉల్లి గలిప చేయ నూరు నోరు."

  రిప్లయితొలగించండి
 7. పుంటి కూర రుచిని పోల్చి చూడ తరమె
  నెంత వారి కైన వింత గాదె
  కవులు మెచ్చి తినుచు కావ్యమ్ము లల్లగ
  దివిజు లంత కలసి దివిని నాటె
  ---------------------------------
  పొంగారు రుచులు తెలిపిరి
  గోంగూరతొ పలురకములు కోరి తినంగా
  కంగారు పడక తినమని
  సింగారియె జేసె ముదముగ చెలువము మీరన్ !

  రిప్లయితొలగించండి
 8. గోంగూర పచ్చడిఁ దిని తా
  చెంగున బండిఁ దిగి బకుని చెండాడం గా
  బంగరు కొడుకన భీమునిఁ
  బొంగిన నుల్లంబుఁ గుంతి పురమున మెరసెన్!

  రిప్లయితొలగించండి
 9. మాస్టరు గారూ ! ధన్యవాదములు.
  లక్కరాజు గారూ ..గుంటూరు గోంగూర మీద నా పద్యము మీద మీకున్న అభిమానమునకు ధన్యవాదములు.
  సహదేవుడు గారూ... మీ గోంగూర పచ్చడిలో కొంచెం "తా " లింపు యెక్కువైనది. ' పచ్చడిని దిని ' అంటే సరిపోతుంది...
  నా పూరణ చిన్న సవరణ తో...

  పుంటి కూరయంద్రు పుల్లగా నుండును
  పుల్లలన్ని దీసి పోసి యాకు
  పప్పు, పులుసు కూర, పచ్చడి జేయంగ
  నుల్లి గలిపి చూడ నుల్ల మలరు.

  రిప్లయితొలగించండి
 10. లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ రెండు పద్యాలూ బాగున్నవి. అభినందనలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  గోలి వారి సవరణను గమనించారు కదా!

  రిప్లయితొలగించండి
 11. మిత్రులారా! శుభాశీస్సులు.
  గోంగూర 3 రకములుగా నుంటుంది మా ప్రాంతములో. (1) ఎర్ర గోంగూర - పుల్లగా నుండి రుచికరముగా నుంటుంది - ఇదే ఎక్కువగా వాడుకలో నుంటుంది. 2. తెల్ల గోంగూర - చిన్న చేదు చప్పదనము ఉండును - అయినా పచ్చడి బాగుంటుంది. 3. కాశీ గోంగూర - అంటే జనప నార కొరకు పంట. 10 - 12 అడుగుల ఎత్తువరకు మొక్కలు పెరుగుతాయి - చిన్న ముళ్ళు ఉంటాయి. దీనిని వంటలలో వాడరు ఈ నారతో గోనె బస్తాలు, త్రాళ్ళు తయారు చేస్తారు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 12. చిన్న సవరణ క్షమించండి శ్రీ పండిత నేమానివారూ ..."కాసి గోంగూర అంటే జనప నార కొరకు పంట" ...అన్నారు ...అది గోగునార కొరకు పంట .గోగు నార వేరు . జానప నార వేరు. .జనపనార జనుమునుంచే తీయబడుతుంది. ...శ్రేయోభిలాషి ...నూతక్కి రాఘవేంద్ర రావు.

  రిప్లయితొలగించండి