8, మే 2013, బుధవారం

పద్య రచన - 335 (అణో రణీయాన్ మహతో మహీయాన్)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“అణో రణీయాన్ మహతో మహీయాన్”

19 కామెంట్‌లు:


  1. అణో రణీయాన్ మహతో మహీయాన్
    ఏమిటో అనుకున్నా ! ఇప్పుడే తెలిసింది,
    ఈ నిమిషం ఆగితే మళ్ళీ ఆ మహత్
    అణో రణీయాన్ అవ్వాలని అదే అర్థమని !


    జిలేబి

    రిప్లయితొలగించండి
  2. అణువు నందణువునై యతిసూక్ష్మమై యొప్పు
    ....నా పరబ్రహ్మ మత్యద్భుతమ్ము
    అఖిలాండకోటి బ్రహ్మాండాల నేనియు
    ....నయ్యది మించి యొప్పారుచుండు
    సచ్చిదానంద లక్షణముల నలరు న
    ....య్యది వాఙ్మనోతీత మైన దండ్రు
    కర్తయు కాదు భోక్తయు కాదు పరమాత్మ
    ....అఖిల లోకమ్ముల కదియె సాక్షి
    దాని యంశలే జీవుల మానసమ్ము
    లందు దనరుచు చైతన్యమంద జేయు
    ఆత్మనే నేననెడు భావ మలరుచుండ
    శాంతి సుఖము లొందెదరు సుజ్ఞాను లెపుడు

    రిప్లయితొలగించండి
  3. అణువున దానణువగుచును
    కనరాక, మహత్తగునెడ ఘనమగుచుండున్
    వినినదె,బుధవరులందరు
    కనినదె నే జెప్పుచుంటి గద- బ్రహ్మమదే.

    రిప్లయితొలగించండి
  4. అమ్మా జిలేబీ,
    మీకు తెలిసింది కానీ మీ వ్యాఖ్యలోని భావం నాకర్థం కాలేదు సుమా! (ఏదో నవ్వులాటకి :-)
    *
    పండిత నేమాని వారూ,
    అధ్యాత్మరామాయణ కర్తగా అలవోకగా వేదాంతసారాన్ని ఒక్క పద్యంలో వివరించారు. ధన్యవాదాలు.
    *
    లక్ష్మీదేవి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.

    రిప్లయితొలగించండి

  5. పరమాత్మ యణువుకంటెను
    పరమాణువుకంటె జూడ బహుసూక్ష్మాంగుం
    డరసిన నాపరమాత్ముం
    డురుతర కాయుండు నౌచు నునికిన్ జూపున్.

    రిప్లయితొలగించండి
  6. కణ కణమ్ములఁ దోడ కాయమ్ము లేర్పడి
    పుడమిలో భూతముల్ ప్రోది నొంద
    అహిమాంశు కిరణాలు సహియించి లోకాలు
    తేజమ్ము నొందగా దివ్య రీతి
    పరమాణువులఁ జేతఁ బరగు పదార్ధముల్
    ప్రాణికోటులు భువిన్ వర్ధి నొంద
    అంబుకణమ్ముల నలరుచు నంభోధి
    జీవులన్నిట నవ జీవగఱ్ఱ

    ఆత్మ తత్వముఁ దెలిసిన నాద్యు డెవడొ ?
    అంతు లేనట్టి జగతికిఁ గాంతు డెవడొ ?
    నెఱయు బ్రహ్మాండ మంతయు నిండు నెవడొ ?
    ననుచు నర్ధింతు జ్ఞానమ్ము నరయ నేను !

    రిప్లయితొలగించండి
  7. అన్నయ్య గారు శ్రీ పండిత నేమాని వారు పరమాత్మ తత్వమును చక్కగా బోధించారు .

    రిప్లయితొలగించండి
  8. నేమాని పండితులు, వారి తమ్ములు నరసింహులు అద్భుతమైన రీతిలో అణుబ్రహ్మాండాలను సీసాల్లో బిగించారు.

    రిప్లయితొలగించండి
  9. నా పద్యములను మెచ్చిన సహృదయులు శ్రీ శంకరయ్య గారికి, శ్రీ మిస్సన్న గారికి, తమ్ముడు చి. డా. నరసింహమూర్తికి అనేక శుభాశీస్సులు - సమస్త సన్మంగళాని భవంతు. స్వస్తి.

    The poem composed by Dr.narasimhamoorti is equally good.
    congratulations.

    రిప్లయితొలగించండి
  10. అణువున కణువై చిన్నగ నలరు చుండి
    అండ బ్రహ్మాండ మందున నధిక మయ్యి
    భక్త కోటిని గావగ భద్ర ముగను
    కొండ పైనున్న వెంకన్న ! కోటి నతులు .

    రిప్లయితొలగించండి
  11. హరి వేంకట సత్యనారాయణ గారూ,
    అణువంత పద్యంలో బ్రహ్మాండమంత భావాన్ని చొప్పించారు. పద్యం చాలా బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    నోరారా ‘అన్నగారూ’ అని నేమాని వారిని పిలుస్తూ, వారికి అన్ని విధాల తగిన తమ్ముడు అనిపించుకున్నారు. నిజంగా ఈ పద్యం చాలా బాగుంది. మీ ఆధ్యాత్మిక జిజ్ఞాసను వెల్లడి చేస్తున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
    *
    సుబ్బారావు గారూ,
    మీ పద్యం బాగున్నది. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  12. అణువుల నిండియుండు పరమాణువు లందున వెల్గు శక్తియై
    కణముల నిర్మితంబయిన గర్భము లందలి పిండ రూపుడై
    గణనకు నందనట్టి పలు కార్యములందున చేతనంపు కా-
    రణమగు విశ్వరూపు మది రంజిలు భక్తిని నే స్మరించెదన్.

    రిప్లయితొలగించండి

  13. అదేమి రాస్తారో కానీ, జిలేబి టపాలే కాకుండా, ఆ కామెంట్లు కూడా అర్థం కావు మరి !! ఏం చేద్దా మంటా రు !!


    జిలేబి

    రిప్లయితొలగించండి
  14. అణువణువున తానై నిండియు
    గణముల కధిపతి యనగ గంగాధరునిన్
    గణ నీయ మైన సృష్టిని
    గణు తింపగ నెవరి తరము గౌరీ పతి నే !

    రిప్లయితొలగించండి
  15. మిస్సన్న గారూ,
    ‘చేతనంపు కారణమగు విశ్వరూపుని’ దర్శింపజేసిన మీ పద్యం ప్రశస్తంగా ఉంది. అభినందనలు.
    *
    రాజేశ్వరి అక్కయ్యా,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    మొదటి రెండు పాదాల్లో గణదోషం.. నా సవరణ...
    అణువణువు తానె నిండియు
    గణముల కధిపతి యనంగ గంగాధరునిన్

    రిప్లయితొలగించండి
  16. అణువణువున నిలచుచు తా
    గణనంబునకంద రాడు కలడో లేడో
    అణుమాత్రంబనుమానము
    క్షణమాత్రము గల్గ జేయు కలవానికి జై.

    రిప్లయితొలగించండి




  17. ప్రకృతి యంతయు బృహత్పర్వతమ్ములు,సూక్ష్మ
    జీవులన్ని యణువు చేరికలనె
    యేర్పడియున్నవి యిమ్మహిలోపల
    నన్నిగ్రహమ్ములు నన్ని తార
    లన్నిలోకమ్ములు నణు సముదాయమే


    పరమాత్మ రూపమే ప్రకృతియంత
    అటుల ' నణో రణీయాన్ మహతోమహీ
    యానను 'సూక్తి సత్యమ్ముగాదె

    సకలవేదాంత సారమ్ము,సర్వ శాస్త్ర
    సమ్మతమ్మును ,విబుధ విచారబోధ
    లన్నియును నిదే పూర్వులు ,నాధునికులు
    సమ్మతించు ప్రమాణమ్ము సత్యవాక్కు.




    రిప్లయితొలగించండి
  18. అన్నయ్యగారు శ్రీ పండిత నేమాని వారి ఆశీస్సులకు నమస్సులు, ధన్యవాదములు. మిస్సన్న గారి సహృదయతకు కృతజ్ఞతలు. అన్నయ్య గారి వలె మీరు, అక్కయ్య గారు, శ్రీ కమనీయము గారు నా ప్రశ్నలకు అద్భుతమైన పద్యాలతో సమాధాన మిచ్చారు. గురువు గారూ ! మీ కృపకు ధన్యవాదములు. నే నణువు నైతే అన్నయ్య గారు బ్రహ్మాండము !

    నా పద్యానికి కొద్ది సవరణలు చేసాను.

    కణ కణమ్ములఁ దోడ కాయమ్ము లేర్పడి
    పుడమిలో భూతముల్ ప్రోది నొంద
    అహిమాంశు కరములు గ్రహియించి లోకాలు
    తేజమ్ము నొందెడి తీరుఁ గనగ
    పరమాణువులఁ జేతఁ బరగు పదార్ధముల్
    ప్రాణికోటులు భువిన్ వర్ధి నొంద
    అంబు కణములతో నలరుచు నంభోధి
    జీవరాశికి నవ జీవగఱ్ఱ

    ఆత్మ తత్వము నెఱిగిన నాద్యు డెవడొ ?
    అంతు లేనట్టి జగతికిఁ గాంతు డెవడొ ?
    నెఱయు బ్రహ్మాండ మంతయు నిండు నెవడొ ?
    అనుచు నర్ధింతు జ్ఞానమ్ము నరయ నేను !

    రిప్లయితొలగించండి
  19. గోలి హనుమచ్ఛాస్త్రి గారూ,
    మీ పద్యం బాగుంది. అభినందనలు.
    *
    కమనీయం గారూ,
    మీ పద్యం సమగ్రంగా విషయ విశ్లేషణ చేసింది. బాగుంది. అభినందనలు.
    *
    గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
    సంతోషం!

    రిప్లయితొలగించండి