22, మే 2013, బుధవారం

సమస్యాపూరణం – 1060 (గ్రాసవాసమ్ములకు నేడ్చె)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది ...
గ్రాసవాసమ్ములకు నేడ్చెఁ గంసవైరి.

15 కామెంట్‌లు:

 1. బహులుటుంబ మహాధిక భార సహితు
  డగు సుదాముండు దారిద్ర్య మనుభవించి
  గ్రాస వాసమ్ములకు నేడ్చె; గంసవైరి
  కరుణతో భోగ భాగ్యముల్ కాంచి తనరె

  రిప్లయితొలగించండి
 2. నా పద్యము మొదటి పాదములో టైపు పొరపాటు దొరలినది -- బహు కుటుంబ కి బదులుగా బహు లుటుంబ అని పడినది. కుటుంబ అని దిద్దుకొందాము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 3. పిల్లవాండ్రకు తిండియు బెట్టలేక
  కృష్ణ సఖుడు కుచేలుండు కృంగి పోయి
  గ్రాసవాసమ్ములకు నేడ్చెఁ; గంసవైరి
  కరుణ నొసగెనపుడు ధనకనకములను.

  రిప్లయితొలగించండి
 4. కట్ట చేలములే లేక కడుపుకింత
  తినగ లేక కుచేలుడు తిరిగి తిరిగి
  గ్రాసవాసమ్ములకు నేడ్చెఁగంసవైరి
  బాల్య మిత్రుడు కద, యేగె భార్య పంప.

  రిప్లయితొలగించండి

 5. సత్య యిచ్చిన భృత్యుడై సంయమి గని
  సరసిజాక్షుడు సేవలు నెరపు చుండె
  భార మనగను దాసమ్ము భామ గనగ
  గ్రాసవాసమ్ములకు నేడ్చెఁ గంసవైరి

  రిప్లయితొలగించండి
 6. రాళ్ళ జడివాన గురియంగ వ్రజపురమున
  ప్రజయు పశువులు కటకటం బడియె కరము
  గ్రాసవాసమ్ములకు నేడ్చెఁ గంసవైరి
  గోట గిరినెత్తి కాపాడె గోకులమును.

  రిప్లయితొలగించండి
 7. శ్రీ శంకరయ్య గురువర్యులకు,శ్రీ నేమాని గురువర్యులకు పాదాభివందనములతో
  =========*==========

  పాపి యొకడు గ్రాస వాసమ్ములకు నేద్చె,
  గంస వైరి జూప కరుణ యతడు
  పాండు రంగ యనుచు పారవశ్యము నొంది
  భక్తి నందు మునిగె ముక్తి కోరి ।

  రిప్లయితొలగించండి
 8. అయ్యా! శ్రీ మిస్సన్న గారూ! మీరు ఒక మంచి వృత్తాంతమును ఎన్నుకొన్నారు గానీ - గోవర్ధన గిరి క్రింద శ్రీ కృష్ణుని అండలో హాయిగా నున్న వ్రజ కులమెల్ల గ్రాస వాసములకు నేడ్చె ననుట అనూహ్యముగా తోచుచున్నది. భగవంతుని సన్నిధిలో నుండే వారి స్థితిని ఊహించండి. పరిశీలించండి.

  రిప్లయితొలగించండి
 9. శ్రీ గురువులకు నమస్సులతో,

  మిస్సన్న గారు వ్రాసిన పద్యం సరిగానే ఉన్నదనుకొంటాను. గోకులం కటకటపడుతున్నప్పుడు గోవర్ధనోద్ధరణం జరిగిందని.

  రాళ్ళ జడివాన గురియంగ వ్రజపురమునఁ
  బ్రజయుఁ, బశువులుఁ గటకటం బడియెఁ, గరము
  గ్రాసవాసమ్ములకు నేడ్చెఁ; గంసవైరి
  గోట గిరినెత్తి కాపాడె గోకులమును.

  అని.

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 10. వ్యాసు డవిముక్త మునకేగి ద్యాస మఱచి
  మోక్ష మడుగుట మానియా బిక్ష లేక
  కోపమున శపియించ తా పాప హరుని
  గ్రాస వాసమ్ములకు నేడ్చెఁ గంస వైరి
  అన్న పూర్ణగ కరుణించి యార్తి దీర్చె

  రిప్లయితొలగించండి
 11. చిన్ననాటి స్నేహితుడైన శ్రీ సుధాము
  పేదరికముచే ప్రతి రోజు బాధ పడుచు
  గ్రాసవాసమ్ములకు నేడ్చె; గంసవైరి
  కాంచి కడు సంపదలనిచ్చి గాచె నతని .

  రిప్లయితొలగించండి
 12. శ్రీ మిస్సన్న గారు & డా. ఏల్చూరి మురళీధర్ గారు : శుభాశీస్సులు.
  లోక రక్షకుడైన శ్రీ కృష్ణుడు వ్రజపురములోని వారికి రక్షణ కల్పించుటలో కొంత జాప్యము జరిగె నని ఆ సమయములో పౌరులు కటకటం బడిరని నేను భావించుట లేదు. అయినను నా యొద్ద భాగవతము ప్రతి లేదు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 13. శ్రీ మహాభాగవతం దశమ స్కంధం లోని గోవర్ధనోద్ధరణ ఘట్టం:

  "... వానకొట్టునం బెట్టువడి ... మహాఘోషంబులతోడ నష్టం బయిన గోపవృద్ధులు కొందఱు ... పుండరీకాక్షునకు మ్రొక్కి యి ట్లనిరి.

  అక్కట! వానఁ దోగి వ్రజ మాకుల మయ్యెఁ గదయ్య! కృష్ణ! నీ
  వెక్కడ నుండి యింతతడ వేల సహించితి, నీ పదాబ్జముల్
  దిక్కుగ నున్న గోపకులు దీనతనొంద భయాపహారివై
  గ్రక్కున గావ కి ట్లునికి కారుణికోత్తమ! నీకుఁ బాడియే?

  రిప్లయితొలగించండి
 14. డా. ఏల్చూరి మురళీధర్ గారికి శుభాశీస్సులు.
  సందేహ నివృత్తి చేసినందుకు సంతోషము. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 15. నేమాని పండితార్యులకు, డా. ఏల్చూరి మురళీధరరావు గారికి ప్రణామములు, ధన్యవాదములు.

  రిప్లయితొలగించండి