21, మే 2013, మంగళవారం

పద్య రచన - 348 (కాకతాళీయము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“కాకతాళీయము”

18 కామెంట్‌లు:

 1. ఒక తాటిచెట్టుపై నున్నవి బాగుగా
  ....పండిన ఫలములా పండ్లలోన
  నొక దానిపై కేగ నొక కాకి యా కాకి
  ....కాలు తగిలి పండు రాలిపోయి
  పడె క్రింద నంత నా వాయసమునకు మ
  ....హాద్భుతంబనితోచె నా క్రమమ్ము
  తన కాలు తాకినంతనె బరువైన యా
  ....పండు రాలెను గాన బలము తనకు
  కలదు మెండుగానని మది దలచి పొంగి
  గర్వమధికంబు గాగ నా కరణి నెల్ల
  చెప్పుకొన సాగె గొప్పగా జెలుల తోడ
  కాక తాళీయ మీరీతి కంచి కేగె

  రిప్లయితొలగించండి
 2. ధరణి బనులెల్ల తమ దారి నొరుగు నపుడు
  ఆత్మబల మంచు గొప్పల నాడు చుండ్రు
  పనులు వికటించి పెఱదారి బట్టి నెడల
  కాకతాళీయ మందురు మూక లెపుడు !

  రిప్లయితొలగించండి
 3. బట్టతల వాడొకడు తాటిచెట్టు కింద
  కూరుచుండెను బడలిక తీర కొంత
  కాకి యొకటి వాలెను కావుకావు మనుచు
  పండు రాలి పడెను చచ్చె వాడు యటుల

  దారిన బోయే ఖర్వాటు డొకడు బడలి తాటిచెట్టు కింద కూర్చొనగా అప్పుడే ఒక కాకి వచ్చి తాటిచెట్టుపై వ్రాలడము విధి వశాత్తు గాలికి తాటిపండు రాలి ఖర్వాటుని తలపై పడడము - వాడు చావడము జరుగుతుంది. కాకతాళీయము అనే వాక్యము యిలా వచ్చిందని ఒక కాకమ్మ కథ ప్రచారంలో ఉంది.

  రిప్లయితొలగించండి
 4. లోకములో మనమంతా
  కాకులమే జరుగు ముఖ్య కార్యములన్నీ
  లోకేశుడు చేయించును
  తాకగనే జరుగు కాక తాళీయముగా !

  రిప్లయితొలగించండి
 5. అయ్యా! శ్రీ నాగరాజు రవీందర్ గారూ! శుభాశీస్సులు.
  బట్ట తలవానిపై తాటిపండు పడిన కథ వేరు అని నా భావము. దానిని గూర్చి సుభాషితములలో ఈ క్రింది పద్యమును చూడండి:

  ధర ఖర్వాటు డొకండు సూర్య కరసంతప్త ప్రధానాంగుడై
  త్వరి తోడన్ బరువెత్తి చేరి నిలిచెన్ దాళద్రుమఛ్ఛాయ తత్
  ఛ్ఛిరమున్ దత్ఫలపాత వేగమున విచ్చెన్ శబ్దయోగమ్ము దా
  బొరి దైవోపహతుండు పోవు కడకే పోవుంగదా యాపదల్

  ఈ పద్యములో కాకి గురించి ప్రస్తావన లేదు కదా. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 6. నేమాని వారు చెప్పిన కథ ఈ పదమునకు చక్కటి భాష్యమైనది.

  పద్య విద్య గొప్పగ నాకు పట్టుబడిన
  దనుచు పొంగి పోవుచునుండు తరుణమందు
  కాక తాళఫలమనెడు కథను వింటి,
  తెలుసుకొంటి నాదను శక్తి దేవి దంచు.

  రిప్లయితొలగించండి
 7. ఈ నాడు మిత్రులందరు మంచి మంచి పద్యములను వెల్వరించిరి. అందరికీ శుభాశీస్సులు. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి
 8. గుడికి బోయితి నొకనాడు కోరి మదిని
  పలుక రించెను మిత్రుడు కులుకు సతితొ
  నేను వలచిన ప్రేయసి నీకు దక్కె
  కాక తాళీయ మనుకొని కనులు మూస్తి

  రిప్లయితొలగించండి


 9. ప్రతిభ పర్విన లోకమున్ బ్రాభవమ్ము
  తమది యనుచును చాటరే బ్రమసి వారు
  ఒరులు వెలిగిన ప్రజ్ఞల నోర్వ లేక
  కాకతాళీయ మందురు లోకు లెల్ల

  రిప్లయితొలగించండి
 10. తమ్ముడు చి. డా. నరసింహమూర్తి పద్యము భావము బాగుగ నున్నవి. అభినందనలు. స్వస్తి.

  రిప్లయితొలగించండి 11. కాకతాళీయమైన సంఘటనలెన్నొ
  జీవితమ్మున గల్గును;చెప్పరాదు.
  స్వీయఘనతగ భావించి చెలగ వలదు.
  దైవసంకల్పమే కదా దాని మూల
  మందుచే నహంకారమ్ము నణచుకొనుము.

  రిప్లయితొలగించండి
 12. రాజేశ్వరి నేదునూరి గారూ నేనయితే తప్పించుకు వెళ్ళిపోతాను.
  గుడికి బోయితి నొకనాడు కోరి మదిని
  పలుక రించెను మిత్రుడు కులుకు సతితొ

  రిప్లయితొలగించండి
 13. కమనీయం గారూ గన్నవరపు నరసింహ మూర్తి గారి పద్యానికి మీ ప్రతి పద్య సమాధానం బాగుంది.

  కాకతాళీయమైన సంఘటనలెన్నొ
  జీవితమ్మున గల్గును;చెప్పరాదు.

  రిప్లయితొలగించండి
 14. ఎంత మేధావైనను దేశ మేల గలడె?
  మేటి పార్టీ కధిపతిగ మెప్పు లేక
  పీవి నర్సింహరావుకు పీఠ మన్న
  కాకతాళీయ ముగ జర్గు ఘటన గాక!

  రిప్లయితొలగించండి
 15. అన్నయ్యగారికి ,లక్కరాజుల వారికి నమస్సులు, ధన్యవాదములు. కమనీయము గారు తమ ఉపదేశాన్ని కమనీయముగా చెప్పారు.

  మూడవ పాదమునకు చిన్న సవరణ

  ' ఒరుల వెలసిన ప్రజ్ఞల కోర్వ లేక '

  రిప్లయితొలగించండి
 16. కవిమిత్రులకు నమస్కృతులు.
  రేపు మా తమ్ముని కూతురి పెళ్ళి. రెండు మూడు రోజులుగా పెళ్ళి పనులమీద తిరుగుతూ తీరిక లేకుండా ఉన్నాను. మరో రెండు రోజులవరకు ఇదే పరిస్థితి. దయచేసి మిత్రులు పరస్పర గుణదోష విచారణ చేసికొనవలసిందిగా మనవి. (కొందరు చేస్తున్నారు కూడా.) అందరికీ ధన్యవాదాలు.
  *
  ‘కాకతాళీయము’ అన్న అంశంపై మంచి పద్యాలను రచించిన కవిమిత్రులు...
  పండిత నేమాని వారికి,
  గన్నవరపు నరసింహ మూర్తి గారికి,
  నాగరాజు రవీందర్ గారికి,
  గోలి హనుమచ్ఛాస్త్రి గారికి,
  లక్ష్మీదేవి గారికి,
  రాజేశ్వరి అక్కయ్యకు,
  కమనీయం గారికి,
  సహదేవుడు గారికి,
  అభినందనలు, ధన్యవాదాలు.

  రిప్లయితొలగించండి 17. గన్నవరపువారి పద్యం కూడా బాగుంది.నేను మన జీవితంలో అనుకోకుండాఏదైనా మంచిపని జరుగుతే అది మన ఘనతే అనుకుంటామని చెప్పాను.వారు ,ఇతరుల ఘనతను అంగీకరించక ,కాకతాళీయమని అంటామని వ్రాసారు.రెండూ నిజమే కదా!

  రిప్లయితొలగించండి