14, మే 2013, మంగళవారం

పద్య రచన - 341 (పాద లేపనము)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
“పాద లేపనము”

21 కామెంట్‌లు:


 1. పాదములే మది సోమ పానముగా
  పాదములే సారస్వత జీవనముగా
  పాదములే సుమధుర సరసిజ గా
  పాదలేపనము గావించు శంకరాభరణము !  జిలేబి

  రిప్లయితొలగించండి
 2. సిద్ధుడు లేపన మీయగ
  వద్దనకను పూసు కొనెను పాదమ్ముల కున్
  బుద్ధిగ నేగెను ప్రవరుడు
  ముద్దుగ దరిజేరె నచ్చర మోహ మటంచున్ !

  రిప్లయితొలగించండి
 3. జిలేబీ గారూ,
  ఏమిటో... మీ భావాలు జిలేబీ చుట్టుల్లాగే గజిబిజిగా ఉంటాయి. అయినా మీ వ్యాఖ్యకు ధన్యవాదాలు.
  *
  రాజేశ్వరి అక్కయ్యా,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  చివరి పాదంలో గణదోషం.. సవరించండి.

  రిప్లయితొలగించండి
 4. పాదలేపనమ్ము పరదేశములు దెచ్చి
  కలువ కన్నుల గమిఁ గడగి వైచె !
  చిచ్చుపూజ లేమి చిక్కితి నయ్యరో !
  పులియు ప్రవరు డనగ ! జలధి ? యేను ?

  ( గురువు గారు నిఘంటువులను జత పఱచినారుగా !)

  రిప్లయితొలగించండి
 5. గన్నవరపు నరసింహ మూర్తి గారూ,
  నిఘంటువుల ‘హింట్’ ఇచ్చినా మీ పద్యం నాపట్ల ‘నారికేళ పాకమే’ అవుతున్నది. సంతోషం!

  రిప్లయితొలగించండి
 6. గురువు గారూ ! ప్రవరుడు పాదలేపన మహిమతో హిమాలయాల కేగి పాదలేపనము కరిగి పోయినా అగ్నిదేవుడిని స్మరించి తిరిగి తన గ్రామమునకు చేరుకొన్నాడు. నా పాదలేపనము కలువకన్నుల శ్వేత భామినులు మధ్య అమెరికాలో పడేసి కరిగిపోయింది. ప్రతిదినము అగ్నిహోత్రమును పూజచేయకపోవడము వలన అగ్నిహోత్రుడు సహకరించక ఇక్కడ చిక్కిపోయాను.ప్రవరాఖ్యుడు పులై తే నేను నక్కని ( జలధికి నక్క అనే అర్ధము కూడా నిఘంటువులో ఉంది, )పులిని చూచి నక్క వాతలు పెట్టుకోవడ మంటారుగా !
  నిజమే నారికేళమె ! పెద్ద వివరణ అవసరమే ! మన్నించండి !

  రిప్లయితొలగించండి

 7. పాదలేపన ప్రభావమ్ము ప్రవరుని
  దివ్య లోకమునకు దెచ్చెనచట
  నప్సరసల గూడి యానంద మొందక
  పారివచ్చె వెర్రి బాప డయ్యొ

  రిప్లయితొలగించండి
 8. సిద్ధుడు లేపన మీ యగ
  బుధ్ధిగ నా లేపనంబు పులిమెను బ్రవరున్
  ముద్దగ దన పాదములకు
  తద్దయు మఱి చేరె నతడు తపసుల వనమున్ .

  రిప్లయితొలగించండి
 9. గన్నవరపు వారూ,
  వివరణకు ధన్యవాదాలు.
  *
  కమనీయం గారూ,
  మీ పద్యం బాగుంది. అభినందనలు.
  *
  సుబ్బారావు గారూ,
  బాగుంది మీ పద్యం. అభినందనలు.
  ‘ బ్రవరుం/ డొద్దిక దన పాదములకు...’ అంటే బాగుంటుందని నా సూచన.

  రిప్లయితొలగించండి
 10. అనిదం పూర్వ శుభానుషంగమున దృప్యత్తుంగ గాంగేయ భం
  గ నిరాతంక ఝరీ విలాస రసవద్గంభీర నీహార భూ
  రి నగ శ్రేష్ఠము నిత్య నిర్మలము జేరెన్ బాపడా పాద లే
  పన మాహాత్మ్యము నెన్న ధాతకయినన్ భావింపగా శక్యమే ?

  రిప్లయితొలగించండి
 11. పాద లేపనా భాగ్యాన ప్రవరుడపుడు
  హిమగిరీంద్ర శిఖరాగ్ర క్రమముఁ జూసె!
  కొనెడు లేపనమ్ములు జేబుఁగొల్లకొట్ట
  లేని చర్మపు వ్యాధులు రేగు నేడు!

  రిప్లయితొలగించండి
 12. డా. విష్ణునందన్ గారూ,
  ఈనాటి మీ పద్యం అత్యుత్తమంగా భాసిస్తున్నది. అభినందనలు, ధన్యవాదాలు.
  *
  సహదేవుడు గారూ,
  మీ పద్యం వైవిధ్యంగా ఉంది. అభినందనలు.
  మూడవపాదంలో గణదోషం ఉంది. సవరించండి.

  రిప్లయితొలగించండి
 13. సవరించిన పద్యము

  సిద్దుడు లేపన మీయగ
  వద్దనకను పూసు కొనెను పాద మ్ములకున్
  బుద్ధిగ నేగెను ప్రవరుడు
  ముద్దుగ వలచె నప్సరస మోహ మటంచున్ !
  --------------------------------------------
  లేపన మలదిన ప్రవరుడు
  తాపసియై దిరుగ నెంచె ధర చుట్టంగా
  పాపము దగిలె వరూధిని
  శాపముగా తోచి మరలె శ్లాఘించి నగ్నిన్

  రిప్లయితొలగించండి
 14. శ్రీ గురువులకు, శ్రీ శంకరయ్య గారికి
  నమస్కృతులతో,

  మనుచరిత్రలోని "పాదలేపనము" ఉదంతాన్ని వివరించి, ఈ రోజు సరదాగా నా అర్ధాంగ"లక్ష్మి"కి చదివించిన పద్యం, మీకు వినిపిస్తున్నాను:

  చేవ యొకింత లేక రససిద్ధుని సేవ యొకింత లేక మున్
  త్రోవఁ గనంగలేక ననుఁ బ్రోచెడు నావఁ గొనంగలేక వే
  ళావధి లేక నేఁ జతికిలం బడి యుండఁగఁ బ్రేమతోడుతన్
  "మూ" వను పాదలేపనము ముచ్చటగా నిడినావె, శ్రీమతీ!

  సప్రశ్రయంగా,
  ఏల్చూరి మురళీధరరావు

  రిప్లయితొలగించండి
 15. ఏల్చూరి మురళీధర రావు గారూ,
  మీరు తీక్ష్ణమైన పాండితీప్రకర్షతో ప్రౌఢమైన పద్యాలను వ్రాయడంలోనే కాదు సున్నితమైన హాస్యాన్ని ఒలికిస్తూ సరదా పద్యాలు కూడా వ్రాయడంలోనూ నేర్పరులని తెలిసి ఆనందిస్తున్నాను. అభినందనలు.

  రిప్లయితొలగించండి
 16. గురువు గారూ ! ప్రత్యక్షముగానో,పరోక్షంగానో భార్యామణుల నాడిపోసుకోవడమును మీ బ్లాగులో తప్పించాలి. అయినా శ్రీ ఏల్చూరి వారి వద్ద నుంచి వచ్చిన ఈ అనిదంపూర్వ పద్యమును చూచి అబ్బురపడక తప్పలేదు.
  డా. విష్ణునందనుల వారి పద్యమును ' అటజని కాంచె భూసురు డంబ చుంబి శిరస్సరజ్ఝరీ ' సరసన చేర్చుకొని చదువుకోవచ్చును. చాలా బాగుంది.

  రిప్లయితొలగించండి
 17. మాన్యులు శ్రీ శంకరయ్య గారికి,
  నమస్కృతులతో,

  మీ సహృదయ సౌజన్యాలకు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.

  శ్రీయుత గన్నవరపు నరసింహమూర్తి గారికి
  నమస్కృతులతో,

  ఇంటిలో వినోదార్థం చెప్పిన పద్యం ... మీరు దయతో ఆదరించినందుకు ధన్యవాదాలు.

  డా. విష్ణు నందన్ గారి అమోఘమైన పద్యధారకు, వైదుష్యసంపదకు, భావుకత్వానికి, కవిత్వ రసప్రతీతికి హృదయపూర్వకమైన అభినందనలు.

  ఈ పద్యాన్ని చదివినప్పటి నుంచి, వారి "శంకరాచార్య చరిత్రము"ను చదవాలన్న అభిలాష మఱింత ప్రగాఢమయింది ...

  రిప్లయితొలగించండి
 18. కవివతంసులు - భిషగ్వరులు శ్రీ గన్నవరపు వారికి , విద్వత్కవి చంద్రములు శ్రీ ఏల్చూరి మురళీధరరావు గారికి , వారు వారు పల్కిన హితవచనాలకు వినమ్రుడనై అయిదు పది చేసి నమోవాకం ప్రశాస్మహే అనుట కన్న నేనేమి చేయగలను ?

  నిజానికి ఎన్నడో పదేండ్లకు మునుపు ప్రచురించిన ధర్మదండం మొదటి భాగం శ్రీ శంకరులు మండనమిశ్రుని ఇంటికి చేరడంతో ముగిసి - కాలం కలిసి రాక - మిగిలిన ముద్రణ - అక్కడితో ఆగిపోతే మళ్లీ ఇన్నేళ్లకు శంకర - మండనమిశ్ర సంవాదము నుండి కథానుస్యూత సంఘటితమై మొత్తం ఏక కావ్యముగా ప్రస్తుతం అచిర కాలములోనే ముద్రింపబడనున్నది . ఏతత్కార్యం ముగియగానే సభక్తికముగా మీకు కావ్య ప్రతి నొకదానిని మీకు సమర్పింపగలను . పునరభివాదములు .

  రిప్లయితొలగించండి
 19. మాన్యులు , కవిపండితులు శ్రీ కంది శంకరయ్య గారికి ధన్యవాద పరశ్శతం .

  శ్రీ సహదేవుడు గారి పద్యంలో 'లేపనా' దీర్ఘాంతానికి మారుగా లేపన అని హ్రస్వం చేస్తే సరిపోతుందని ఒక సూచన .

  రిప్లయితొలగించండి